Tata vs Mahindra vs VinFast: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ దూసుకెళ్తోంది. 2026 ఆగస్టులో దేశ వ్యాప్తంగా 30,051 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 19,629 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 53.1 శాతం ఎక్కువ. అయితే, ఈ పెరుగుదల అన్ని కంపెనీలకు ఒకేలా లేదు. కొన్ని పాత కంపెనీలు తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంటే.. కొత్తగా వచ్చిన విన్ ఫాస్ట్ మాత్రం తక్కువ సమయంలోనే మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకుంటోంది.
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆగస్టులో కంపెనీ 13,158 కార్లు రిజిస్టర్ చేసింది. గతేడాది ఇదే నెలలో 8,064 యూనిట్లు ఉండగా, ఇప్పుడు 63.2 శాతం వృద్ధి నమోదైంది. దీంతో టాటా మార్కెట్ వాటా 43.8 శాతానికి చేరింది. టాటా బలం దాని విస్తృత ఈవీ లైనప్. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీతో పాటు కొత్త సియెరా ఈవీ లాంటి మోడళ్లు కొనుగోలుదారులకు కొత్త ఆప్షన్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా నెక్సాన్, పంచ్ ఈవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. అయితే, జూలైతో పోలిస్తే ఆగస్టులో టాటా రిజిస్ట్రేషన్లు 8.5 శాతం తగ్గాయి. అంటే, వార్షికంగా వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, నెలవారీ మార్కెట్ మాత్రం స్థిరంగా ఉండటం లేదు.
మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో తన స్థాయిని పెంచుకుంటోంది. ఆగస్టులో 6,464 ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. గతేడాది ఆగస్టులో 4,139 యూనిట్లు మాత్రమే ఉండగా, ఈసారి 56.2 శాతం వృద్ధి నమోదైంది. BE 6, XEV 9e, XEV 9S వంటి కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మహీంద్రా ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించాయి. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ లాంటి ఆప్షన్లు కూడా ప్రారంభ ధరను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి.
కొత్తగా భారత మార్కెట్లోకి వచ్చిన విన్‌ఫాస్ట్ మాత్రం వేగంగా ముందుకు వస్తోంది. ఆగస్టులో 2,199 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ చేసింది. జూలైలో 1,532 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా 43.5 శాతం పెరిగాయి. దీంతో మారుతి సుజుకిని అధిగమించి నాలుగో స్థానానికి చేరింది. VF6, VF7 ఎస్‌యూవీలతో పాటు కమర్షియల్ MPV విభాగంలో లిమో గ్రీన్ కూడా కంపెనీ విక్రయాలకు తోడ్పడుతోంది. దీంతో విన్‌ఫాస్ట్ వృద్ధి కేవలం ప్రైవేట్ కార్ల కొనుగోలుదారులపైనే ఆధారపడటం లేదు.
జూలైతో పోలిస్తే ఆగస్టులో దేశీయ ఈవీ కార్ల మార్కెట్ 11.1 శాతం తగ్గింది. అయినప్పటికీ వార్షికంగా చూస్తే వృద్ధి బలంగానే ఉంది. ముఖ్యంగా టాటా, మహీంద్రా తమ స్థావరాన్ని కొనసాగిస్తుండగా.. విన్‌ఫాస్ట్ తక్కువ సమయంలోనే మార్కెట్ లో మంచి వాటాను సాధించింది. ముందున్న కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.
Read Also: రిలీజ్ కు ముందే టాటా ఏరిస్ వీడియో లీక్.. CNG మోడల్ లో ఇవే హైలైట్స్!