Tata Aeris CNG Full Video Leaked: టాటా మోటార్స్ నుంచి త్వరలో రానున్న కొత్త కాంపాక్ట్ సెడాన్ ఏరిస్ విడుదలకు ముందే హైలెట్ అయ్యింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో, ఇప్పటి వరకు టీజర్లలో కనిపించిన దానికంటే ఎక్కువ వివరాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా షోరూమ్‌కు తరలిస్తున్న iCNG వేరియంట్ వీడియోలో క్లియర్ గా కనిపించింది. టాటా ఏరిస్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌తో పాటు CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
లీక్ అయిన వీడియోను చూస్తే ఏరిస్ డిజైన్‌లో టాటా ఫ్యామిలీలోని ఇతర కార్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టియాగో నుంచి తీసుకున్న అంశాలను కొత్త డిజైన్‌తో కలిపారు. ముందు భాగంలో గ్రిల్ మీద నల్లటి బార్, వెనుకకు వంగిన హెడ్ ల్యాంప్‌లు టియాగోను గుర్తు చేసేలా ఉన్నాయి. అయితే, ఏరిస్ కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు బంపర్ ను కొత్తగా డిజైన్ చేశారు. ఇందులో స్పష్టమైన C ఆకారపు డిజైన్ ఎలిమెంట్స్, మధ్యలో కొత్తగా రూపొందించిన ఎయిర్ ఇన్ టేక్ కనిపిస్తున్నాయి.
ఏరిస్ పూర్తిగా కొత్త డిజైన్ తో వచ్చినప్పటికీ, టిగోర్ తో ఉన్న సంబంధాన్ని కొన్ని భాగాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా నాచ్ బ్యాక్ తరహా రూఫ్ లైన్ టిగోర్ ను పోలి ఉంటుంది. రూఫ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ డిజైన్ లాంటి అంశాల్లోనూ టిగోర్ ప్రభావం కనిపిస్తుంది. టియాగో నుంచి ORVM డిజైన్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఏరిస్ డిజైన్ ను పూర్తిగా కొత్తగా రూపొందించడంతో పాటు, టాటా ఇప్పటికే ఉపయోగిస్తున్న డిజైన్ లోని కొన్ని అంశాలను కలిపినట్లు కనిపిస్తోంది.
లీకైన కారు iCNG వెర్షన్ కావడంతో దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వివరాలు కూడా బయటపడ్డాయి. బూట్ మీద iCNG బ్యాడ్జ్ ఉండటంతో ఇది CNG మోడల్ అని ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. వెనుక బంపర్‌ను కూడా కొత్తగా రూపొందించారు. స్టాటిక్ రిఫ్లెక్టర్లతో సాధారణ వేరియంట్‌కు కొంత భిన్నంగా కనిపిస్తుంది. రెండు రంగులతో కూడిన వీల్ డిజైన్, ముందు డోర్లపై ‘ఏరిస్’ బ్యాడ్జింగ్ కూడా లీక్ వీడియోలో కనిపించింది.
ఏరిస్ బయట డిజైన్ తో పాటు క్యాబిన్ లోనూ ఆధునిక ఫీచర్లను తీసుకురానుంది. టూ టోన్ ఇంటీరియర్, ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండనున్నట్లు ఇప్పటికే వెల్లడైన వివరాలు సూచిస్తున్నాయి. దీంతో టాటా కొత్త సెడాన్‌ను కేవలం టిగోర్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా, ప్రస్తుత కాంపాక్ట్ సెడాన్ మార్కెట్‌కు సరిపోయేలా మరింత లేటెస్ట్ గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.
ఏరిస్‌లో పెట్రోల్, CNGతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రానున్నట్లు సమాచారం. దీంతో ఒకే మోడల్‌కు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందించే దిశగా టాటా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీకైన వీడియో CNG వెర్షన్‌పై ఆసక్తిని పెంచింది. అయితే ధర, పూర్తి ఫీచర్లు, ఇంజిన్ వివరాలు వంటి కీలక అంశాలను టాటా మోటార్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Read Also: హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!