Upcoming VinFast Electric Cars: విన్ ఫాస్ట్ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ మార్కెట్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ SUV మోడళ్లను దేశంలో అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా, క్యాబ్ సేవల కోసం కూడా తన EVలను ఉపయోగిస్తోంది. ఇటీవలే MPV7 మోడల్ ను విడుదల చేసిన ఈ కంపెనీ, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని ప్రణాళికలు వేస్తోంది. వాటిలో మూడు ముఖ్యమైన మోడళ్లు ఉన్నాయి. అవేంటంటే..
VF3.. అనేది విన్ ఫాస్ట్ నుంచి రాబోయే ఎంట్రీ లెవల్ మోడల్ గా భావిస్తున్నారు. చిన్న సైజ్ లో ఉండే ఈ మోడల్ మైక్రో SUV రూపంలో అందుబాటులోకి రానుంది. సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బాక్సీ లుక్ తో పాటు రెట్రో స్టైల్ టచ్ కూడా ఇందులో కనిపిస్తుంది. చిన్నవీధులు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పట్టణ రోడ్లలో సులభంగా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఈజీ ఇంటీరియర్, బేసిక్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ EVగా అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్ పలు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. చిన్న బ్యాటరీతో సుమారు 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వనుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ తో 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందుతుందని తెలుస్తోంది.
ఆ తర్వాతి మోడల్ VF5. ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ లోకి వస్తుంది. VF3, VF6 మధ్యలోకి అడుగు పెట్టనుంది. ఈ మోడల్, భారత మార్కెట్లో టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG విండ్సర్ EV లాంటి కార్లకు పోటీగా నిలుస్తుంది. డిజైన్ పరంగా ఇది అత్యాధునిక స్టైలింగ్ తో ఆకట్టుకుంటుంది. V-ఆకారపు LED DRLలు, స్పోర్టీ ఫ్రంట్ లుక్, అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి. ఫీచర్ల పరంగా కూడా VF5లో మంచి సౌకర్యాలు ఉంటాయని అంచనా. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ లైట్స్, సన్ రూఫ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ పరంగా 29 kWh నుంచి 37 kWh వరకు ఆప్షన్లు ఉండవచ్చు. రేంజ్ కూడా 250 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
ఇక VF8 ప్రీమియం మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది. ఇప్పటికే విన్ ఫాస్ట్ ఈ మోడల్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ ను భారత్ లో ఫైల్ చేసింది. ఇది VF7 కంటే పై స్థాయిలో ఉండే SUVగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. టెక్ ఫ్లూయిడ్ డిజైన్ తో ఈ కారు రూపొందుతోంది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ADAS సేఫ్టీ ఫీచర్లు, డిజిటల్ క్లస్టర్, పవర్డ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం సుమారు 60 kWh ఉండగా, ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించవచ్చని సమాచారం.
Read Also: వోక్స్ వ్యాగన్ బిగ్ ప్లాన్.. ఏకంగా 4 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!