VinFast Rasad Electric Scooter: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత మార్కెట్ పై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారత్ లో పేటెంట్లు పొందిన ఈ కంపెనీ, తాజాగా రసద్ అనే ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌కు కూడా పేటెంట్ దాఖలు చేసింది. దీంతో భారత్ లో పేటెంట్ పొందిన విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల జాబితాలో మరో మోడల్ చేరింది.
విన్ ఫాస్ట్ రసద్ కాన్సెప్ట్ ను 2026 ప్రారంభంలో భవిష్యత్ ఎలక్ట్రిక్ టూ వీలర్ లైనప్ లో భాగంగా ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ను సాధారణ సిటీ కమ్యూట ర్‌గా కాకుండా పర్ఫార్మెన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన మ్యాక్సీ స్కూటర్‌గా రూపొందించినట్లు కనిపిస్తోంది. రసద్ కు ముందు విన్‌ఫాస్ట్ వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, సులాద్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లు భావిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ కు కూడా భారత్‌లో పేటెంట్లు పొందింది. సులాద్ కాన్సెప్ట్ ను కంపెనీ 2026 జనవరిలో పరిచయం చేసింది. వరుసగా పేటెంట్ దాఖలు చేస్తుండటం చూస్తే, భారత మార్కెట్ కోసం విన్‌ఫాస్ట్ పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ లైనప్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రసద్ డిజైన్ స్పోర్టీగా, కొంత దూకుడుగా కనిపిస్తుంది. యమహా ఏరాక్స్, ఇటీవల ఆవిష్కరించిన హోండా ADV160 లాంటి మ్యాక్సీ స్కూటర్లను పోలిన కొన్ని డిజైన్ అంశాలు ఇందులో కనిపిస్తాయి. స్కూటర్‌కు పెద్ద టైర్లు, బాడీ డిజైన్, పొడవైన విండ్ స్క్రీన్ ఉన్నాయి. రైడర్‌కు ఎక్కువ సౌకర్యం కల్పించేలా విశాలమైన స్టెప్డ్ సీట్ ను కూడా ఇందులో అందించినట్లు పేటెంట్ చిత్రాలు సూచిస్తున్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. అండర్‌బోన్ ఛాసిస్ ను ఉపయోగించినట్లు కూడా డిజైన్ ద్వారా తెలుస్తోంది.
విన్‌ఫాస్ట్ ఇప్పటివరకు రసద్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కొన్ని వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం, ఈ స్కూటర్ లో మధ్యలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని తెలుస్తోంది. ఇది గరిష్ఠంగా 7.1kW శక్తిని ఉత్పత్తి చేస్తుందని, స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుందని సమాచారం.
విన్‌ఫాస్ట్ గతంలో 2026లో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. మొదటగా వియత్నాంలో అందుబాటులో ఉన్న మూడు మోడళ్లను భారత మార్కెట్‌కు తీసుకురావాలని కంపెనీ భావించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు వైపర్, సులాద్, రసద్ వంటి మరిన్ని మోడళ్లకు భారత్‌లో పేటెంట్లు పొందడంతో అవే రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్!