Voyah Passion S EV SUV Stunt: చైనా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు కేవలం కొత్త టెక్నాలజీ, తక్కువ ధరలతోనే కాకుండా క్రేజీ స్టంట్లతోనూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా డాంగ్ ఫెంగ్ కు చెందిన వోయా తన ప్యాషన్ S ఎలక్ట్రిక్ SUVతో చేసిన ఓ అడ్వెంచరస్ ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. 2010లో మెర్సిడెస్ బెంజ్ SLS AMGతో రూపొందించిన ప్రసిద్ధ టన్నెల్ లూప్ యాడ్ ను గుర్తు చేస్తూ, వోయా ప్యాషన్ Sను 360 డిగ్రీల లూప్ లో నడిపినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టంట్ లో కారు కొంతసేపు టన్నెల్ గోడపై తలకిందులుగా ప్రయాణించినట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఈ ప్రయోగాన్ని వుహాన్ లోని ఓ టెస్ట్ టన్నెల్‌లో నిర్వహించారు. ముఖ్యంగా స్టంట్ కోసం వాహనంలో ప్రత్యేకంగా మార్పులు చేయలేదని కంపెనీ వెల్లడించింది. సుమారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో SUV టన్నెల్ గోడపైకి ఎక్కేలా ఇంజినీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. వెహికల్ లూప్‌ను పూర్తి చేసే సమయంలో స్టీరింగ్ యాంగిల్ సుమారు 16 డిగ్రీలుగా ఉంచినట్లు తెలిపారు. టన్నెల్ లూప్ లో వెహికల్ విజయవంతంగా తిరగడానికి వేగం చాలా కీలకం. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే బలం టైర్లను టన్నెల్ గోడకు బలంగా నొక్కి ఉంచుతుంది. అదే సమయంలో వేగం గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు తగ్గినా వాహనం పట్టును కోల్పోయే అవకాశం ఉందని వోయా తెలిపింది. అలాంటి పరిస్థితిలో SUV టన్నెల్ పైభాగం నుంచి కిందపడే ప్రమాదం ఉంటుంది.
అయితే, ఈ స్టంట్ మొదటి ప్రయత్నంలోనే పూర్తయిందా? అనే విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్ పైభాగంలో కనిపించే టైర్ గుర్తులు, పలుమార్లు ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో ఫెయిల్ అయిన ప్రయత్నాలు కూడా కనిపించాయి.
ఈ సూపర్ స్టంట్ కోసం ఉపయోగించిన వోయా ప్యాషన్ S సాధారణ SUV కాదు. ఇందులో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఇది 637 హెచ్‌పీ శక్తితో పాటు 765 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. SUVలో 98 kWh బ్యాటరీ ప్యాక్, 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ 700 కిలోమీటర్ల వరకు CLTC రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. AWD వెర్షన్ లో ఈ రేంజ్ సుమారు 660 కిలోమీటర్లుగా ఉంటుంది.
ఫ్లాగ్ షిప్ AWD వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్టంట్ సమయంలో కూడా వాహనంలో పూర్తి బ్యాటరీ ప్యాక్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ హార్డ్ వేర్ ఉన్నాయని వోయా తెలిపింది. మెర్సిడెస్ SLS AMG చేసిన ఒరిజినల్ టన్నెల్ లూప్ యాడ్ ఇప్పటికీ ఆటోమొబైల్ ప్రపంచంలో గుర్తుండిపోయే స్టంట్లలో ఒకటి. ఇప్పుడు అదే మోడల్ స్టంట్ ను ఎలక్ట్రిక్ SUVతో చేసి వోయా మరోసారి ఆ చారిత్రక స్టంట్ ను గుర్తు చేసింది.
Read Also: ఈ కారు ధర అక్షరాలా రూ. 382 కోట్లు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?