Wrong Fuel Alert: పెట్రోల్ బంక్ లో తొందరపాటు, అజాగ్రత్త వల్ల కొన్నిసార్లు పొరపాటుగా ఫ్యూయల్ నింపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోయడం చాలా మంది డ్రైవర్లు చేసే సాధారణ తప్పిదాల్లో ఒకటి. అయితే, ఈ పొరపాటు జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే సరైన చర్యలు తీసుకుంటే సేఫ్ గా బయటపడే అవకావం ఉంటుంది. ఇంతకీ ఏం చేయాలంటే?
ముందుగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ ప్లగ్ లు పని చేసి ఇంధనాన్ని మండిస్తాయి. పెట్రోల్ చాలా పలుచగా ఉండి త్వరగా ఆవిరవుతుంది. కానీ, డీజిల్ ఇంజిన్ పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో స్పార్క్ ప్లగ్‌లు ఉండవు. అధిక ఒత్తిడి, వేడి కారణంగా డీజిల్ స్వయంగా మండుతుంది. అంతేకాదు డీజిల్ మందంగా, జిడ్డుగా ఉంటుంది. అందుకే పెట్రోల్ ఇంజిన్ లో డీజిల్ సరిగా పనిచేయదు. డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ లోకి వెళ్లిన తర్వాత చాలా సమస్యలు ఏర్పడుతాయి.
ముందుగా, డీజిల్ కారణంగా ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పార్క్ ప్లగ్ లపై నూనె లాంటి పొర ఏర్పడి అవి సరిగా పనిచేయకుండా చేస్తుంది. ట్యాంక్ లో కొంత పెట్రోల్ మిగిలి ఉంటే కారు కొంతసేపు స్టార్ట్ కావచ్చు. కానీ, కాసేపటికే ఇంజిన్ వణకడం, అసాధారణ సౌండ్స్ చేస్తుంది. ఎగ్జాస్ట్ నుంచి నల్లటి పొగ వస్తుంది. చివరికి ఇంజిన్ పూర్తిగా ఆగిపోతుంది.
పెట్రోల్ బంక్ లో ఉండగానే పొరపాటున డీజిల్ పోసిన విషయం తెలిస్తే, కారు స్టార్ట్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఇంజిన్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. కారు స్టార్ట్ కాకపోతే, ఇంజిన్‌లోకి డీజిల్ వెళ్లి ఉండదు. వెంటనే కారు స్టార్ట్ చేయకుండా ఆపేయాలి. కీని కూడా ఆఫ్ చేయాలి. అలా చేస్తే ఫ్యూయల్ పంప్ పని చేయదు. డీజిల్ ను ఇంజిన్ లోకి పంపకుండా కాపాడుతుంది.
వెంటనే, కారును పక్కకు తీసుకెళ్లి, మెకానిక్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కు సమాచారం ఇవ్వాలి. మెకానిక్ ట్యాంక్‌లోని డీజిల్‌ను పూర్తిగా తీసివేసి, ఫ్యూయల్ సిస్టమ్‌ను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ పెట్రోల్ నింపి కారు సాధారణంగా ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ కారు స్టార్ట్ చేసిన తర్వాత లేదా కొంత దూరం ప్రయాణించిన తర్వాత తప్పు తెలిసితే పరిస్థితి కొంచెం సీరియస్ అవుతుంది. వెంటనే కారును ఆపి ఇంజిన్ ను ఆఫ్ చేయాలి. మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే, ఇంజిన్ కు మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కారును టో ట్రక్ ద్వారా సర్వీస్ సెంటర్‌కు తరలించాలి. అక్కడ మెకానిక్‌లు ట్యాంక్‌ను ఖాళీ చేయడం, ఫ్యూయల్ లైన్లను శుభ్రం చేయడం, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఫ్యూయల్ ఫిల్టర్ ను చెక్ చేసి అవసరమైతే మార్చాల్సి ఉంటుంది. అందుకే, ఫ్యూయల్ నింపే ముందు ఒకటికి రెండు చెక్ చేసుకోవడం మంచిది.
Read Also: సియెర్రా To అవిన్యా.. టాటా నుంచి 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు వచ్చేస్తున్నాయ్!