Tata EVs With BaaS: ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునే వారికి ఎక్కువగా ఎదురయ్యే సమస్యల్లో కారు ధర ఒకటి. ముఖ్యంగా ఈవీల్లో బ్యాటరీ ఖర్చు కూడా మొత్తం ధరలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను కొంతవరకు తగ్గించే ఉద్దేశంతో టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) విధానం మరిన్ని మోడళ్లకు విస్తరించింది. టియాగో EV, పంచ్ EVలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌ను ఇప్పుడు నెక్సాన్ EV, కర్వ్ EV, సియెర్రా EV, హారియర్ EVలకు కూడా అందిస్తున్నారు.
సాధారణంగా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ ధర కూడా కారు మొత్తం ధరలోనే ఉంటుంది. BaaS విధానంలో మాత్రం కారు ధర, బ్యాటరీ ఖర్చును విడిగా పరిగణిస్తారు. అంటే మొదట కారు కోసం చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. బ్యాటరీ కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా డ్యూయల్ లోన్ ఫైనాన్స్ మోడల్. కారు కోసం ఒక లోన్, బ్యాటరీ కోసం మరో ఫైనాన్స్ ఉంటుంది. బ్యాటరీకి EMI లేదంటే వినియోగానికి అనుగుణంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
BaaSతో టాటా EVల ప్రారంభ ధరలు చాలా వరకు తగ్గాయి.
1.టియాగో EV: ఈ మోడల్ ధర రూ.6.99 లక్షలు కాగా, BaaSలో రూ.4.69 లక్షలకు లభిస్తుంది. సుమారు రూ.2.30 లక్షల వరకు ఆదా అవుతుంది.
2.పంచ్ EV: దీని ధర రూ.9.79 లక్షలు. BaaSలో రూ.6.59 లక్షలకు తగ్గుతుంది. సుమారు రూ.3.20 లక్షల ఆదా అవుతుంది.
3.నెక్సాన్ EV: ఈ కారు ధర రూ.14.34 లక్షలు ఉంటుంది. BaaSలో రూ.8.99 లక్షలకు లభిస్తుంది. సుమారు రూ.5.35 లక్షల ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
4.కర్వ్ EV: ఈ మోడల్ ధర రూ.17.19 లక్షలు ఉండగా, BaaSలో నుంచి రూ.10.99 లక్షలకు లభిస్తుంది. సుమారు రూ.6.20 లక్షల ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
5.సియెర్రా EV: ఈ మోడల్ ధర రూ.18.79 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఆ మోడల్ రూ.11.99 లక్షలకు లభిస్తుంది. దీని మీద సుమారు రూ.6.80 లక్షల ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
6.హారియర్ EV: దీని అసలు ధర రూ.21.79 లక్షలు ఉండగా, రూ.14.49 లక్షలకు పొందే అవకాశం ఉంటుంది. దీని మీద రూ.7.30 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
అంటే BaaS ద్వారా ముందుగా చెల్లించాల్సిన మొత్తం మోడల్ ను బట్టి రూ.2.30 లక్షల నుంచి రూ.7.30 లక్షల వరకు తగ్గుతుంది.
BaaS చెల్లింపు అంటే బ్యాటరీకి సంబంధించిన ఫైనాన్స్, వినియోగ ఖర్చు మాత్రమే. ఛార్జింగ్ ఖర్చు, మెయింటెనెన్స్, రిపేర్లు ఇందులో కలిపి ఉండవు. అలాగే రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, TCS వంటి ప్రభుత్వ, ఇతర చార్జీలు కూడా ప్రకటించిన BaaS ధరల్లో భాగం కావు.
Read Also: హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!