2025 MahaKumbhmela | మహాకుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ఇది. ఈ సంవత్సరం సంక్రాంతి రోజునే అంటే 2025 జనవరి 13 ఈ ఆధ్యాత్మిక మహావేడుక ప్రయాగ్ రాజ్ లో (Prayag Raj) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు అంటే 45 రోజులపాటు నిర్వహించబడుతుంది. ఈ మహా కార్యక్రమంలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలు, సాధువులు, అఘోరీలు, నాగసాధువులు దేశం నలుమూలల నుండి తరలి వస్తారు. భక్తులు పుణ్యస్నానాలు చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని, తమ జీవితం పునీతమవుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో, కుంభమేళా వెనక ఉన్న పురాణ కధ గురించి తెలుసుకుందాం.
పురాణాల్లో మహాకుంభమేళా..
దేవతలు, రాక్షసులు అమృతభాండం కోసం పాలసముద్రాన్ని చిలికారు. ఈ సంఘటన వలన క్షీరసాగర మథనం జరిగింది. ఇందులో అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాడారు. ఈ సమయంలో రాక్షసులు అమృతాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకుని అమృతాన్ని రాక్షసులకు అందకుండా రక్షించారు. ఈ సమయంలో అమృతం కొన్ని చుక్కలుగా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ స్థలాలల్లో పడిపోయాయి. అక్కడ పుణ్యస్నానం చేస్తే, అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ స్థలాలలో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది.
పూర్ణ కుంభమేళా:
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహించబడుతుంది. దీనిని హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు.
అర్ధకుంభమేళా:
అర్ధకుంభమేళాను 6 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తారు. ఇది పూర్ణ కుంభమేళా మధ్యలో జరిగే ముక్యమైన వేడుక.
మహాకుంభమేళా:
మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. ఈ మహాకుంభమేళాను సాధారణంగా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించడం సంప్రదాయం.
మాఘ మేళా:
మాఘమాసంలో ప్రతీ సంవత్సరం జరుగుతుంది. దీనిని మినీ కుంభమేళా అని కూడా అంటారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబడే ఈ వేడుక పెద్ద ఎత్తున జరుగుతుంది.
ముహూర్తాలు చూసి స్నానాలు చేసే సాధువులు
కుంభమేళా సమయంలో ముఖ్యంగా పుణ్యస్నానాల (షాహి స్నానాలు) కోసం ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సాధువులు ఇక్కడికి వస్తారు. వారు సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ముహూర్తాలు నిర్ణయించబడతాయి. భక్తులు ఈ సాధువులను దర్శించడానికి లక్షలాది మంది తరలివస్తారు. ఈ సంవత్సరం, షాహి స్నానాలు జనవరి 13 (పౌష్ పూర్ణిమ), జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి), ఫిబ్రవరి 12 (మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహాశివరాత్రి) తేదీలలో జరుగుతాయి.
గుప్త సామ్రాజ్యంలో కుంభమేళా ప్రారంభం
గుప్తుల కాలం (క్రీ.శ. 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం) లో కుంభమేళా ప్రారంభం అయింది. అప్పటివరకు ఈ వేడుక స్థానికంగా నిర్వహించబడేవారు. కానీ ఈ కాలంలో, రాజులు ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రోత్సహించారు. నదీ తీరంలో పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి, పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఈ కాలంలోనే కుంభమేళా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. 12వ శతాబ్దం తర్వాత, కుంభమేళా మరింత ప్రతిష్ఠవంతమైంది.
Also Read: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
బ్రిటీషర్లు అణగదొక్కినా
బ్రిటిష్ పాలనలో కూడా కుంభమేళాకు మంచి గుర్తింపు పొందింది. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే, ఈ తరహా కార్యక్రమాలు ప్రజలను ఏకతాటిమీద తీసుకొచ్చి సామాజిక సంఘటనలు ఏర్పడుతాయని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిరోధించడానికి పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1954లో కుంభమేళా సంప్రదాయాన్ని పున:ప్రారంభించారు. అప్పటి నుండి ఈ వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది.
కుంభమేళా కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు:
ఈ మహాకుంభమేళా 45 రోజులపాటు నిర్వహించబడే కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సంఖ్యను లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు, అదనపు విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
సినీ ప్రముఖులు హాజరు:
ఈ సారి మహాకుంభమేళా కార్యక్రమానికి బాలీవుడ్, తెలుగు, దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యువ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్, నటి రాఖీ సావంత్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ వంటి ప్రముఖులు ఈ మహాకుంభ మేళా (Maha Kumbhmela) వేడుకలో పాల్గొనబోతున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.