Adilabad Airport: ఆదిలాబాద్.. దశాబ్దాలుగా వెనుకబాటుతనానికి కేరాఫ్ అడ్రస్. ఎన్నో ఏళ్లుగా ఈ మట్టి మనుషులు ఆ ప్రాంతం నుంచి విమానం ఎగరడం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తే.. ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే.. తమ పిల్లల బతుకులు మారుతాయని, వలసలు ఆగుతాయనేది వారి కల. కానీ ఆ దశాబ్దాల కల ఇప్పుడు నేతల పంతాల మధ్య, మాటల యుద్ధాల మధ్య నలిగిపోతోంది. ఆదిలాబాద్ రాజకీయాలను ఎయిర్‌పోర్ట్ అంశం షేక్ చేస్తోంది. దశాబ్దాల కల నెరవేరే సమయం వచ్చిందని ఒకరంటే లేదు లేదు, ఇదంతా అబద్ధాల వేట, మిమ్మల్ని ముంచే ముచ్చట అంటూ మరొకరు రణరంగంలోకి దిగారు. దీంతో నేతల మధ్య డైలార్ వార్‌కు తెర లేచింది.
విమానాశ్రయం కల సాకారం కాబోతోందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక కీలక ఒప్పందం కుదిరిందని ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదనపు భూసేకరణకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దశాబ్దాల ఆకాంక్ష నెరవేరబోతున్న తరుణంలో ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కనబెట్టి సహకరించాలని కోరారు. ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా ఈ వార్త కొత్త ఆశలు రేకెత్తించింది. కానీ.. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ బీఆర్‌ఎస్ కౌంటర్ ఎటాక్ చేస్తోంఇ. పాయల్ శంకర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జోగు రామన్న కౌంటర్ ఎటాక్ చేశారు. ఎయిర్‌పోర్ట్ లేదు.. ఇండస్ట్రియల్ కారిడార్ లేదు.. సీసీఐ ముచ్చట అసలే లేదు.. అంతా ఉత్తదేనంటూ కొట్టిపడేశారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. డీపీఆర్ పూర్తయిందంటూ బీజేపీ నేతలు బూటకపు ప్రచారాలతో జనాన్ని మోసం చేస్తున్నారని ఫైరయ్యారు.
Also read: Tanveer Ahmed: పాకిస్తాన్ లో అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్త..రాళ్లతో అభిమానులు కొడతారు
జోగు రామన్న కామెంట్స్‌కు అదే రేంజ్‌లో రివర్స్ అటాక్ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అసలు జోగు రామన్నకు ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ కోసం 1850 ఎకరాల భూసేకరణ పూర్తయిందని మిగిలిన 400 ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన భేటీలో కూడా దీనిపై క్లారిటీ వచ్చిందని అభివృద్ధిని అడ్డుకోవద్దని హెచ్చరించారు. బీజేపీ బీఆర్‌ఎస్ నేతల మాట యుద్ధంతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పంచాయితీ పీక్స్‌కు చేరింది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో అసలు సత్యమేంటి? ఇది నిజంగానే దశాబ్దాల కల నెరవేరే శుభ సూచకమా? లేక కేవలం ఎన్నికల స్టంటా? ఈ పొలిటికల్ వార్ ఎటు దారితీయబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Storey By: Appa Rao Big Tv
Also read: 40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!