Varuna Yagam: కరువు కాటేసినప్పుడు.. వరుణ కరుణ కోసం ఆకాశం వైపు రైతులు ఆశగా చూస్తారు. పల్లెల్లో కప్పతల్లి ఆడుతూ వరాల వాన రావాలంటూ వేడుకుంటారు. నేలతల్లి తడిసిపోవాలని.. పంటలు మురిసిపోవాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ పవిత్ర సంకల్పానికి పూనుకుంది. సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించనుంది ప్రభుత్వం. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు సూచనతో వేదపండితుల ఆశీస్సులతో ఆషాఢ మాసం బహుళ ద్వాదశి రోజున ముహూర్తం ఫిక్స్ చేసింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు ఆదిపూజతో యాగం ప్రారంభం కానుంది.
కృష్ణమ్మ ఒడ్డున ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని ప్రశాంతమైన విజయ విహార్ ప్రాంగణం.. ఇప్పుడు ఈ మహా యజ్ఞానికి వేదికవుతోంది. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో 108 మంది రుత్వికులు… 11 యాగకుండాల్లో వేద మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని నిర్వహించనున్నారు. ఆ నీలి మబ్బులను కదిలించి, కరిగించేలా మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించనున్నాయి.
Also Read: కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!
కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని చెరువులు జళసిరులతో కళకళలాడాలని ఈ మహాక్రతువు చేపడుతున్నారు. వర్షం అంటే కేవలం నీరు కాదు. రైతుల ఆశ పల్లెలకు జీవం రాష్ట్రానికి సిరిసంపద. అదే ఆశతో తెలంగాణ ప్రభుత్వం వరుణుడిని ఈ యాగం ద్వారా వేడుకోబోతోంది.
ఈ మహా క్రతువు చివరి అంకం సమస్త లోకాల కల్యాణాన్ని కోరుకునే పూర్ణాహుతి కార్యక్రమం. ఈ పవిత్ర ఘట్టంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని వరుణ దేవున్ని పూజించి తరిస్తారు. తెలంగాణ కోటి ఆశలు ఫలించి, నేల తల్లి పులకరించే ఆ అద్భుత క్షణం కోసం అందరి చూపు ఆ సాగర్ తీరంపైనే నిలిచింది.
Also Read: రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!