Amit Shah: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీపై కేంద్ర నాయకత్వం మరోసారి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్‌లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నట్లు తెలుస్తుండగా.. అదే పర్యటనలో పార్టీకి సంబంధించిన కీలక సమావేశం నిర్వహించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హతకు గురికావడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది. దీంతో త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
అక్టోబర్ 4న కరీంనగర్‌లో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న అమిత్ షా.. తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్లతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ నియామకమయ్యారు. అంతేకాకుండా టీ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దశరథ్ నియామకమయ్యారు. కాగా ఈ కొత్త టీమ్ తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమిత్ షా తెలంగాణ పర్యటన కొన్ని నెలల ముందే జరగాల్సి ఉంది. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఆపై నీట్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన జెన్ జీ ఉద్యమం కారణంగా వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు తెలంగాణ టూర్ పై కదలిక రావడంతో శ్రేణుల్లో జోష్ నెలకొంది.
Also Read: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అతి త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు, వరంగల్, ఖమ్మం, నొల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, సైబరాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో సమావేశం జరిగితే.. ఖైరతాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఎంపిక, నియోజకవర్గ స్థాయిలో సమన్వయం, బూత్ స్థాయి కార్యాచరణ, ప్రచార వ్యూహం వంటి అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే కేడర్‌ను సమాయత్తం చేయడం, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలపై కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశముంది. అయితే అక్టోబర్ 4 పర్యటన, పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం తదితర అంశాలపై అధికారిక షెడ్యూల్ వెలువడిన తర్వాతే తుది స్పష్టత రానుంది. ఇప్పటికే తెలంగాణలో సంస్థాగత వ్యవహారాలపై కేంద్ర నాయకత్వం దృష్టి పెంచిన నేపథ్యంలో.. అమిత్ షా పర్యటన ఖరారైతే రాష్ట్ర బీజేపీలో కీలక రాజకీయ సమీక్షకు వేదికగా మారే అవకాశం ఉంది.
Also read: చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!