Railway ticket rates: మనమంతా ట్రైన్ జర్నీ చేసేందుకు ఇష్టపడతాం. టికెట్ కౌంటర్ దగ్గర రూ. 200, రూ. 300 టికెట్ కొని ప్రయాణం చేస్తాం. కానీ ఆ రూ. 200 టికెట్ నిజంగా రైల్వే ఖర్చులో చిన్న భాగం మాత్రమే అని మీకు తెలుసా? అసలు రైల్వేలు ఒక్క ప్రయాణికుడి మీద వెచ్చించే ఖర్చులో దాదాపు సగం రాయితీ ఇస్తున్నాయంటే ఆశ్చర్యమే కదా. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వేలు రూ. 60,466 కోట్లు ప్రయాణికుల సబ్సిడీ కోసం ఖర్చు పెట్టిందంటే, దీని వెనుక ఉన్న కథ వింటే నిజంగా షాక్ అవుతారు.
❂ రైల్వే టికెట్ ధర ఎందుకు తక్కువగా ఉంటుంది?
మనం చెల్లించే టికెట్ ధర అసలు ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే రైల్వేలు సామాజిక బాధ్యతతో నడుస్తాయి. గ్రామాలకు, చిన్న పట్టణాలకు, బడుగు ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం అందించాలన్నే ఈ లక్ష్యం. టికెట్ ధరలను మార్కెట్ రేటుకు పెంచేస్తే మనలో చాలా మందికి రైలు ప్రయాణం కష్టంగా మారిపోతుంది. అందుకే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైల్వేలకు మద్దతు ఇస్తోంది. ఆ డబ్బు లేకపోతే ఈ తక్కువ టికెట్లు మనం పొందలేం.
❂ రైలు నడపడానికి అసలు ఖర్చెంత?
ఒక్క ట్రైన్ నడిపేందుకు ఇంధనం, విద్యుత్, బోగీలు మెయింటెనెన్స్, సిబ్బంది వేతనాలు, స్టేషన్ల నిర్వహణ, ట్రాక్ రిపేర్స్.. ఇవన్నీ కలిపి భారీ ఖర్చు అవుతుంది. కానీ ఆ ఖర్చు మొత్తం ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేయడం సాధ్యం కాదు. అందుకే రైల్వేలు ఫ్రైట్ ఛార్జీలు (సరుకు రవాణా) నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రయాణికుల విభాగం సబ్సిడీకి ఉపయోగిస్తుంది. ఫ్రైట్ రేట్లు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని చెప్పవచ్చు.
❂ తగ్గింపులు కూడా పెద్ద భారం
మనకు తెలిసినట్లుగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రక్షణ సిబ్బంది, కొన్ని ప్రత్యేక వర్గాలకి రైల్వేలు పెద్ద రాయితీలు ఇస్తాయి. ఇవన్నీ కూడా సబ్సిడీ మొత్తాన్ని పెంచుతున్నాయి. అదనంగా, పండుగ సీజన్లో అదనపు ట్రైన్లు, ప్రత్యేక సర్వీసులు నడపడం రైల్వేల ఖర్చును మరింత పెంచుతుంది.
❂ రైల్వే మోడర్నైజేషన్ కూడా బిల్లు పెంచుతోంది
ఇటీవల వందే భారత్ ట్రైన్లు, స్లీపర్ వందే భారత్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రైల్వేల ఖర్చును పెంచుతున్నాయి. కొత్త రైల్వే స్టేషన్లు, మోడ్రన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిఫికేషన్.. ఇవి భవిష్యత్తులో ప్రయాణ సౌకర్యాన్ని పెంచుతాయి కానీ ప్రస్తుతం మాత్రం బడ్జెట్ మీద అదనపు భారమవుతున్నాయి. టికెట్ ధరలను ఒక్కసారిగా పెంచలేని పరిస్థితి ఉండటంతో ఈ భారీ బిల్లు రైల్వే భుజాలపై పడుతోంది.
Also Read: AP metro projects 2025: విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో.. విజయవాడలో స్పీడ్ రైడ్.. ముహూర్తం ఫిక్స్!
❂ ఈ సబ్సిడీ వెనుక అసలు ఉద్దేశం
మన దేశంలో రైలు కేవలం ఒక ట్రాన్స్‌పోర్ట్ మోడ్ కాదు, ఇది సాధారణ ప్రజలకు ప్రాణాధారం. రోజూ కోట్లాది మంది ఉద్యోగం, చదువు, వ్యాపారం కోసం రైల్వేలపై ఆధారపడతారు. అందుకే ఈ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఒక విధంగా ప్రజలకు సహాయం చేస్తోంది. మీరు రూ. 200 టికెట్ కొన్నా, నిజంగా ఆ ప్రయాణానికి ఖర్చు రూ. 400 అయితే, ఆ మిగతా రూ. 200ను రైల్వే భరిస్తోంది.
❂ రాబోయే మార్పులు ఎలా ఉంటాయి?
నిపుణుల ప్రకారం ఈ భారీ సబ్సిడీ ఎప్పటికీ ఇలాగే కొనసాగడం కష్టం. రాబోయే రోజుల్లో రైల్వేలు ఆదాయ వనరులు పెంచడంపై దృష్టి పెట్టనున్నాయి. స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, స్టేషన్లలో కమర్షియల్ స్పేస్ లీజ్, ప్రకటనలు, కార్గో బిజినెస్.. ఇవి కొత్త ఆదాయ మార్గాలు. అదనంగా, సబ్సిడీలను నిజంగా అర్హులైన వర్గాలకే పరిమితం చేయడం, డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్‌ను పెంచడం కూడా రాబోయే ప్లాన్లలో ఉంది.
❂ టికెట్ వెనుక దాగిన కథ
మీరు రైలు టికెట్ కొంటే ఇంత డబ్బు ఎందుకు? అనిపించవచ్చు. కానీ అసలు ఖర్చు దానికంటే రెండింతలు ఉంటే? రైల్వేలు రూ. 60,466 కోట్ల సబ్సిడీ ఇచ్చిందంటే, అది ఎంత పెద్ద సేవ చేస్తున్నాయో మనం ఊహించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సేవ కొనసాగాలంటే, రైల్వేలు ఆదాయం పెంచే మార్గాల్లో నడవాల్సిందే.
రైల్వేలు కేవలం లాభాల కోసం నడిచే వ్యవస్థ కాదు. ఇది కోట్లాది ప్రజలకు చౌక, సురక్షితం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న దేశపు జీవనాడి. ఈ సబ్సిడీ మనకోసమే. కాబట్టి రాబోయే కాలంలో రైల్వేలు మెరుగైన సేవలు అందించడానికి మనం కూడా అవగాహనతో ఉండాలని, టికెట్ కొని ప్రయాణించాలని రైల్వే కోరుతోంది.