Bihar Politics: బిహార్‌లో ఎన్నికలు అంటే అసలే పెద్ద సవాల్. కులాల కుంపట్లు, వర్గాల మధ్య వార్. ఇవి కామన్. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. 22 ఏళ్ల తర్వాత ఓటరు జాబితా ప్రత్యేక సవరణను ఈసీ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్ లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్యాప్ లో ఈ సవరణతో ఏదో మతలబు జరగబోతోందని విపక్షాలు అంటుంటే.. అనర్హుల ఓట్లు తొలగించడమే లక్ష్యమని ఈసీ, కేంద్రం అంటున్నాయి. మ్యాటర్ కాస్తా సుప్రీం కోర్టు దాకా చేరింది. ఇంతకీ ఏది నిజం? బిహార్‌లో ఓట్లు తొలగిస్తున్నారా?
ఓటరు లిస్ట్ ప్రత్యేక సవరణపై రణం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఈ మాట ఇప్పుడు బిహార్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలకు 5 నెలల ముందు ఈ ప్రత్యేక సవరణ అది కూడా 22 ఏళ్ల తర్వాత ఎందుకు చేస్తున్నట్లు.. కారణాలు ఏంటి.. ఈసీ ఏం అంటోంది. విపక్షాలు ఎందుకు బిహార్ బంద్ కు పిలుపునిచ్చాయి.. ఎవరి ఓట్లు గల్లంతు కాబోతున్నాయి.. ఓటర్ లిస్టులో పేరుండాలంటే.. 11 రకాల డాక్యుమెంట్లకే ఎందుకు పరిమితం చేశారు? ఇందులో అన్న మతలబులేంటి.. ఇవన్నీ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం..
ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్ చూపాల్సిందే
బిహార్ లో ఓటర్ లిస్టులో పేరు ఉండాలంటే 11 రకాల డాక్యుమెంట్స్ సమర్పించాల్సిందే. లేకుంటే ఓటు గల్లంతే మరి. ఎందుకంటారా.. 22 ఏళ్ల తర్వాత ఓటర్ లిస్టులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే స్థానికంగా లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉన్న వారికే ఓటు హక్కు కల్పించడం, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం ఇలాంటివన్న మాట. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడెంటిటీ కార్డు, బ్యాంక్-పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు, కార్మిక శాఖ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఎంప్లాయ్‌మెంట్ ఐడెంటిటీ కార్డు వీటిలో ఏదైనా ఒకటి సమర్పిస్తే మీ ఓటు ఉంటుంది. ఆధార్ కార్డు లిస్టులో ఉన్నప్పటికీ.. దానికి జతగా బర్త్ సర్టిఫికెట్ చూపాల్సిందే. అప్పుడే వాలిడ్. మీ ఓటు భద్రం. ఇదీ బిహార్ లో పరిస్థితి.
కొత్త ఓటర్ల చేరిక, చనిపోయిన వారి ఓట్లు తొలగింపు
కేంద్రం ఎన్నికల సంఘం బిహార్‌లో ఓటర్ లిస్టును సవరించడానికి జూన్ 24 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారు. కొత్త ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం అంటే చనిపోయిన వారు, రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారు, అక్రమ ఓటర్లను తొలగించడం ఈ ప్రక్రియ లక్ష్యం అంటున్నారు. ఈ స్పెషల్ రివిజన్ బిహార్ లో 22 ఏళ్ల తర్వాత జరుగుతోంది. చివరిసారి 2003లో జరిగింది. అందుకే ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ఏదైనా గేమ్ నడుస్తోందా అన్న డౌట్లను విపక్షాలు వినిపిస్తున్నాయి. జులై 9 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని EC ఆదేశించింది.
ఓటర్ సవరణ ప్రక్రియపై విపక్షాల విమర్శలు
ఈ ఓటరు సవరణ ప్రక్రియపై RJD, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం, ఇతర NGOలు విమర్శలు చేస్తున్నారు. ఇదెక్కడి కొత్త రూల్స్ అంటున్నారు. ఓటు ఉండాలంటే జనాలు ఎంత కష్టపడాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ ఓటు వేయడం అవసరమా అని అనుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు కాదా అని అంటున్నారు. బిహార్ లో ప్రెజెంట్ ఓటర్లు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ను చూపించేందుకు 11 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాలన్నది ఈసీ. సరే ఏదో ఒకటి చూపించి ఓటర్ లిస్టులో పేరు కంటిన్యూ చేయించుకోవచ్చు కదా అన్న డౌట్లు వస్తాయి. అక్కడే ట్విస్ట్ ఉంది మరి. ఆధార్, రేషన్ వంటి కామన్ ఐడీ ప్రూఫులు ఈసీ చెప్పిన 11 డాక్యుమెంట్లలో లేవు. ఉన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్ సమర్పించాలి. ఉదాహరణకు ఎవరి దగ్గరైనా బిహార్ అడ్రస్ తో ఆధార్ ఉన్నా.. బర్త్ సర్టిఫికెట్ అదనంగా చూపించాలి. అదీ లెక్క. సో చాలా మంది ఓట్లు గల్లంతు అవుతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పేదలు, రూరల్ ఓటర్లు. వలస కార్మికుల ఓట్లు గల్లంతేనా?
బిహార్‌లోని పేదలు, రూరల్ ఓటర్లు, వలస కార్మికుల దగ్గర ఈసీ అడిగిన డాక్యుమెంట్లు చాలా వరకు లేవంటున్నారు. పైగా బర్త్ సర్టిఫికెట్లు కేవలం 2.8% యువ ఓటర్ల దగ్గర మాత్రమే ఉన్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇలాంటి పేపర్స్ సమర్పించడం చాలా మందికి కష్టం. అయితే ఇక్కడో ఫ్లెక్సిబిలిటీ ఉంది. 2003 నాటికే ఓటర్ లిస్టులో ఉన్న 4.96 కోట్ల మందికి ఈ అదనపు పత్రాలు అవసరం లేదు. కానీ 2003 తర్వాత చేరిన 3 కోట్ల మంది ఓటర్లు ముఖ్యంగా యువ ఓటర్లు తమ వివరాలతో పాటు తల్లిదండ్రుల వివరాలను కూడా సమర్పించాలి.
అర్జంటుగా ఓటర్ లిస్ట్ సవరణ ఎందుకన్న ప్రశ్నలు
ఈ సవరణ ప్రక్రియకు EC కేవలం తక్కువ టైం ఇవ్వడం చుట్టూ కూడా పెద్ద డిబేటే నడుస్తోంది. ఇంత తక్కువ సమయంలో బిహార్‌లో 7 కోట్ల 64 లక్షలకు పైగా ఓటర్లను ధృవీకరించడం సాధ్యమయ్యే పనేనా అని విపక్షాలు అంటున్నాయి. ఈ డెడ్ లైన్ తో ఏదైనా డాక్యుమెంట్ సమర్పిద్దామని అనుకున్నా అంత తక్కువ టైంలో సాధ్యపడవు.. ఓటర్ లిస్ట్ నుంచి వారు అవుట్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ అత్యవసర ఓటరు లిస్ట్ సవరణ ఎందుకు చేపట్టారన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడమే లక్ష్యమని ఈసీ మొదట్లో ప్రకటించింది. ఆ తర్వాత తన రీజన్ ను మార్చింది. దీంతో విపక్షాలకు మరింత డౌట్లు పెరిగాయి. ఈ సవరణతో దళితులు, ముస్లింలు, EBCల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకున్న వారందరి ఓట్లు తీసేసే చర్యగా దీన్ని చూస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే పేదలు, దళితులు, మైనారిటీలు, వలస కార్మికుల ఓట్లకే ఇబ్బంది అని, కొత్త డాక్యుమెంట్లను వీళ్లంతా తేవాలనుకున్నా టైం కూడా ఇవ్వడం లేదన్న ప్రశ్నలైతే అలాగే ఉన్నాయి.
రాజ్యాంగం ప్రకారం తాము చేసేది కరెక్టే అని ఈసీ అంటోంది. ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టు సవరణ సహజమే అని బీజేపీ చెబుతోంది. ఓట్లు వేయడానికి సవాలక్ష డాక్యుమెంట్లు ఇవ్వాలా అని విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఎటూ తెగడం లేదు. మధ్యలో కన్ఫ్యూజన్ పెరుగుతోంది. అందుకే ఈ మొత్తం మ్యాటర్ సుప్రీం కోర్టుకు చేరింది. గతంలో మహారాష్ట్రలో ఉన్నట్లుండి కొత్త ఓటర్లు పెరగడం, భారీ ఓటింగ్ నమోదు.. కచ్చితంగా గెలుస్తామనుకున్న చోట ఓటమి వీటిని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ గా చూపుతోంది. మహారాష్ట్ర ఫార్ములానే బిహార్ లో అమలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
ఆగస్ట్ 1న ఓటరు తొలి డ్రాఫ్ట్ లిస్ట్
ఓటరు లిస్టు సవరణలో ఈసీ కన్ఫ్యూజ్ అవుతోందా? విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు రావట్లేదా.. అంటే అవుననే అంటున్నారు తేజస్వీ యాదవ్. అసలు ఈ ప్రత్యేక సవరణ ఎందుకంటే ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారంటున్నారు. ప్రాసెస్ జరిగేది జరిగిపోతోంది. ఆగస్ట్ 1న అసలు బాంబు పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే బిహార్ ఓటర్ లిస్టులో ఉండేదెవరో.. ఊడేదెవరో.. ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ అప్పుడే వస్తుంది. గతంలో కంటే ఓటర్లు పెరిగారా.. తగ్గారా తెలిసిపోతుంది. ఇదే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుందన్న ఆందోళన విపక్షాల్లో పెరుగుతోంది. విపక్ష పార్టీలు ఈ సవరణను ప్రజాస్వామ్యానికి ముప్పుగా చూస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది ఓటర్లు, ముఖ్యంగా దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబాటు తరగతుల వారు, పేదలు ఓటు హక్కును కోల్పోతారంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా అడ్డుతొలగించడం కోసమే ఇలా చేస్తున్నారన్న వెర్షన్ ను కాంగ్రెస్, ఆర్జేడీ వినిపిస్తున్నాయి. ఓటర్ లిస్టు సవరణలో తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్ల వివరాలను EC రాజకీయ పార్టీలకు చెబుతుంది. అయితే ప్రస్తుత సవరణలో పారదర్శకత లేదన్న అనుమానాలను వినిపిస్తున్నారు.
సవరణపై సుప్రీం కోర్టులో పిటిషన్లు
అసలు ఓటర్ లిస్టు ఇలా ప్రత్యేకంగా సవరణ చేయొచ్చా చేయరాదా అన్న విషయాలపై రాజ్యాంగ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను ఈసీ తనకు అనుకూలంగా ప్రస్తావిస్తోంది. ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు రాజ్యాంగ ఉల్లంఘనే అని మరికొన్ని ఆర్టికల్స్ ను తెరపైకి తెస్తున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. బిహార్ లో చేస్తున్న ఓటరు లిస్టు సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 – సమానత్వం, ఆర్టికల్ 19 – వాక్ స్వాతంత్ర్యం, ఆర్టికల్ 21 – జీవన హక్కు, ఆర్టికల్ 325 – ఎన్నికల సమగ్రత, ఆర్టికల్ 326- సార్వత్రిక ఓటు హక్కు ఉల్లంఘనలకు దారితీస్తోందని వాదిస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం వంటి పార్టీలైతే ఈ ప్రక్రియను ఓట్ బందీ అని అంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ అయితే సీఈసీని కలిసి ఓట్ల సవరణను ఆపేయాలన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందే రిపీటా?
ఇది అటు తిరిగి ఇటు తిరిగి గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సీన్ ను గుర్తు చేస్తున్నాయంటున్నారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ఆల్ ఆఫ్ సడెన్ గా లక్షలాది కొత్త ఓటర్లు చేరడం, అసాధారణంగా ఓటింగ్ శాతం పెరగడం, EC పారదర్శకత చూపకపోవడంతో గతంలో రాహుల్ గాంధీ రిగ్గింగ్ ఆరోపణలు చేశారు. బిహార్ దానికి కొనసాగింపు అన్నారు. లక్షలాది మంది పేదలు, దళితులు, మైనారిటీల ఓటు హక్కును లాక్కుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకమై పోరాడాలని ట్వీట్ చేశారు. అటు RJD నేత తేజస్వీ యాదవ్ అయితే ఈ సవరణను ప్రజాస్వామ్య హత్యగా చెప్పారు. ఇది BJP రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. మహారాష్ట్రలో ఓటర్లను చేర్చారన్న ఆరోపణలు వస్తే.. బిహార్‌లో ఓట్ల తొలగింపు ఎక్కువ టెన్షన్ పట్టుకుంది. అలాగే 2019లో అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియలో డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల లక్షలాది మంది పేదలు, మైనారిటీలు ఓటు హక్కును కోల్పోయారన్న విషయాలు తెరపైకి తెస్తున్నారు.
గ్రామీణ ఓటర్ల దగ్గర బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయా?
అసలు విషయం ఏంటంటే పేదలు, గ్రామీణ ఓటర్ల దగ్గర బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వీటికి తోడు ప్రకృతి విపత్తుల్లో డాక్యుమెంట్లు కోల్పోయిన వాళ్లూ ఉంటారు. వీరికి తోడు వలస కార్మికల మ్యాటర్ చాలా కీ రోల్ పోషించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిహార్‌లో 70 లక్షల మంది వలస కార్మికులు ఆ రాష్ట్రం బయట అంటే ఢిల్లీ, ముంబై, గుజరాత్, హైదరాబాద్, సౌత్ లో పనిచేస్తున్నారు. ఈ సవరణ టైంలో వారు బిహార్‌లో ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అర్జంట్ గా పేపర్లు సబ్ మిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలాంటి వాళ్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. 2003 తర్వాత ఓటర్ జాబితాలో చేరిన 3 కోట్ల మంది యువ ఓటర్లపై ఈ సవరణ ఎక్కువ ఒత్తిడి పెంచుతోంది. ఎందుకంటే వాళ్లు తమ పేరెంట్స్ జనన వివరాలతో సహా ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్ మిట్ చేయాలి.
Also Read: కేంద్ర స్థాయిలో దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ ఇచ్చే పదవి ఇదేనా?
ఆర్టికల్ 326 ప్రకారం ఓటర్ల సవరణ కరెక్టే అన్న ఈసీ
సో ఇప్పుడు ఈసీ పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల, ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం విపక్షాల్లో లేదు. ఇది విశ్వసనీయతను దెబ్బతీస్తుందంటున్నారు. ఓటర్ల సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1950 ప్రకారం చట్టబద్ధమైనదని EC చెబుతోంది. ఇది ఎన్నికల సమగ్రతను కాపాడటానికి అవసరమని వాదిస్తోంది. పేద వర్గాలకు ఓటరు జాబితా విషయంలో BLOs సహాయం చేస్తారని, రాజకీయ పార్టీలు ప్రక్రియను పర్యవేక్షించవచ్చని EC అంటోంది. అయితే ఈ సవరణను వ్యతిరేకిస్తూ, INDIA కూటమి జులై 9న బిహార్ బంద్‌కు పిలుపునిచ్చింది. సో ఈ విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. సవరణ ఆపే ప్రసక్తి ఉండదు. అదే సమయంలో 11 రకాల డాక్యుమెంట్స్ నుంచి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా అన్నది చూడాలి.