బీఎల్ సంతోష్.. మరోసారి బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఎంపిక కావడం ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వస్తున్న అంశం. దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా కొనసాగిన సంతోష్.. మోడీకి అత్యంత సన్నహితుడు. మోడీ-షాల ద్వయం ప్రభుత్వానికి సంధానకర్తగా కూడా వ్యవహరించే కీలక నేత.
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పార్టీలో సజీవంగా ఉంచి, వ్యూహ రచనల్లో కీలక భాగస్వామ్యం వహించే సంతోష్ మాటకు అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. వివాహం వివాహం చేసుకోకుండా సంతోష్.. తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీలకు అంకితం చేశారని నమ్ముతారు. ఓసారి తెలంగాణలో అధికారం కోసం రంగ ప్రవేశం చేసిన బీఎల్ సంతోష్ వ్యూహం కేసీఆర్ వల్ల ఆ ప్లానింగ్ అప్పట్లో బెడిసికొట్టింది.
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో.. బీఎల్ సంతోష్‌ను దోషిలా చేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు మోడీ. తనకు అత్యంత సన్నిహితుడైన సంతోష్‌ను దోషిలా పెట్టడం, అతను మిస్సింగ్ అంటూ పోస్టర్లు వేసి కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వడంతో..అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కేసీఆర్, మోడీ మధ్య సాన్నిహిత్యం.. మొత్తం బ్రేక్ అయిపోయింది.
సంతోష్‌ను ఈ కేసులో ఇరికించి.. తన కూతురుపై ఉన్న లిక్కర్ స్కాం కేసులో రాజీ కుదుర్చుకోవాలని కేసీఆర్ వ్యూహం పన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ కేసును కోర్టులో కొట్టేశారు. సీబీఐకి అప్పగించింది కోర్టు. ఇక అప్పట్నుంచి మోడీ .. కేసీఆర్‌ను నమ్మడం పూర్తిగా మానేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ మీదే కోపముండేది ఇక్కడ మోడీకి. కేసీఆర్‌ను సపోర్టు చేయడం మూలంగా కాంగ్రెస్‌ను రానీయకుండా చేయాలనేదే మోడీ,షాల ద్వయం వ్యూహంగా ఉండేది.
బీఎల్ సంతోష్‌పై కేసు నేపథ్యంలో బీఆరెస్‌కు పూర్తిగా తన మద్దతును ఉపసంహరించుకున్నది బీజేపీ. ఇది కాంగ్రెస్‌కు మరింతగా కలిసి వచ్చింది. బీఆరెస్ ఓడింది. కాంగ్రెస్ గెలిచింది. ఇక ఈసారి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది బీజేపీ.
అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పట్టు ఉండి.. ఎన్నికల వ్యూహ కర్తగా ఉన్న బీఎల్ సంతోష్‌ను మరోసారి తెలంగాణపై ప్రయోగించేందుకు రెడీ అయ్యింది కేంద్రం. జాతీయ అధ్యక్షుడి పదవి తరువాత అత్యంత పవర్‌ఫుల్ పోస్ట్ బీఎల్ సంతోష్‌దే. ఇప్పుడు మరింత పదునైన వ్యూహాలతో సంతోష్ తెలంగాణ రాజకీయాల పై పైచేయి సాధించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.