రెండేండ్ల ముందే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటున్నది. సర్కార్ విఫలమైందని చెప్పేందుకు ఈ ఎన్నికలనే వేదిక చేసుకునేలా కనిపిస్తున్నది. తాజాగా హరీశ్‌రావు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చడం వెనుక వ్యూహం ఇదేనంటున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటరు నమోదు కార్యక్రమం మొదలైంది. అందరి కంటే ముందు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది.
హైదరాబాద్-రంగారెడ్డికి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్లగొండ- ఖమ్మం-వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇద్దరు రెడ్లకే ఇవ్వడం వివాదమవుతోంది. ఓవైపు పార్టీలో బీసీ జపం చేస్తూనే రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్లకే కేటాయించడం పట్ల ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ మంత్రంతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్‌ను ఢీకొట్టేలా సర్వశక్తులు సమకూర్చుకుంటున్నది. ఇది బీఆరెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ …. ఒక స్థానం బీసీకి, మరొకటి ఓసీకి ఇవ్వాలనుకుంటుంది. బీజేపీ కూడా ఎమ్మెల్సీలపై ఆశలు పెట్టుకున్నది.
నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఎంత చమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆ ప్రతికూల ఫలితాలను గుణపాఠంగా తీసుకున్నది కాంగ్రెస్. ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పార్టీలో సీనియర్లు కావడం, నేపథ్యం కూడా కలిసి వచ్చే అవకాశాలుండటం, అధిష్టానం దీన్ని అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న నేపథ్యంలో గెలుపు తీరాలకు చేరడమే లక్ష్యంగా పనిచేయనుంది.
వాస్తవానికి, ఈ రెండు సీట్లపై బీఆరెస్ పెద్దగా ఆశలు పెట్టుకోదనే అభిప్రాయం నిన్నటి వరకు ఉండేది. ఎందుకంటే.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఓటర్ల వాటం ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే అధికార పార్టీ కూడా భయపడుతున్నది. గెలుపు కోసం ఎదురీత తప్పదు కాంగ్రెస్ పార్టీకి కూడా.
మరి బీఆర్‌ఎస్‌కే ఓటర్లు మొగ్గు చూపుతారా? అంటే దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టం. ఈ ఎన్నికల్లో బీజేపీని లైట్‌గా తీసిపారేయడానికి అసలే చాన్సు లేదు. ఎంపీ ఎన్నికల్లో మోడీ మానియా ఎలా ఉంటుందో.. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు గత ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.
దీనికి తోడు నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు. అతనికి ఈ నియోజకవర్గంపై పట్టుంది. పార్టీ పెట్టుకున్నాడు. బీసీ మంత్రం జపిస్తున్నాడు. దీంతో ఈ ఎన్నికలు టఫ్ ఫైట్‌గా మారనున్నాయి. కానీ బీఆరెస్ మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతలో అసంతృప్తి అంశాలను ప్రధానంగా నమ్ముతున్నట్టున్నది. అందుకే డేర్‌గా దీన్ని సెమీఫైనల్స్‌తో పోల్చి మరీ బరిలోకి దిగుతున్నది. ఈ పరిణామం కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడినైతే పెంచుతున్నది.