ఖైరతాబాద్ వినాయకుడి సాక్షిగా.. ఉప ఎన్నిక ఖాయమైంది. రేపు నిమజ్జనమనగా.. ఆ విఘ్నేశ్వరుడు ఈ నియోజవర్గం ప్రజలకు ఇలా ఓ వరం ప్రసాదించి వెళ్తున్నట్టున్నారు. మల్లొచ్చే ఏడాదికి ..భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరే సమాయానికి ఈ నియోజకవర్గం రూపు రేఖలు కచ్చితంగా మారేలాగే ఉన్నాయి. మారుతాయి కూడా.
ఇబ్బడి ముబ్బడిగా .. నిర్విఘ్నంగా నిధుల వరద పారనుంది. అభివృద్ధి పనులు శరవేగంగా ఇక్కడే జరుగుతాయి. అధికార యంత్రాంగమంతా ఇక్కడే కొలువుదీరుతుంది. పాలన వ్యవస్థ అంతా దీనిపైనే గురి పెడుతుంది. సందుకో మంత్రి ఇక్కడ ఇంచార్జిగా ఉంటారు. వారి నేతృత్వంలో ఇంటింటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఏళ్ల తరబడి పేరుకు పోయిన పెండింగ్ బాధల నుంచి విముక్తి లభించనుంది.
కుల సంఘాల విజ్ఞప్తులు చిటికెలో నెరవేరుతాయి. యువత ఆకాంక్షలు సత్వరం అమలులోకి వస్తాయి. గల్లీ సంక్షేమం కోసం ఏదడిగినా క్షణాల్లో అది నెరవేరి తీరుతుంది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు చకచకా జరిగిపోతాయి. అభివృద్ధి పనులు మరో పదేళ్ల పాటు జరగకున్నా ఓకే అనేలా అన్నీ వచ్చి చేరుతా ఉంటాయి. చకచకా పనులు జరుగుతూ ఉంటాయి. చెప్పిన వెంటనే అవి జరిగిపోతూ ఉంటాయి.
ఖైరతాబాద్ వినాయకుడిని మరీ మరీ భక్తి ప్రపత్తులతో మొక్కుకుని ఉంటారు ఇక్కడి జనం. ప్రతిసారీ ఘనమైన పూజలు అందుకుని ఉంటాడీ ఘననాథుడు. అందుకే వినాయకుడు పోతూ పోతూ.. ఆ నియోజకవర్గానికి మహర్ధశ భాగ్యాన్ని కల్పించి వీడుకోలు పలుకుతున్నాడు. ఇది ఆ ఘననాథుడికి ఘనమైన సెండాఫ్ అన్నట్టు. గతంలో మాదిరిగా కాకుండా బైపోల్ ఉత్సాహం తోడురాగా.. ఆ దేవదేవున్నిఆనందపూర్వక, ధన్యవాదాలను తోడుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు.
అంతే కొన్ని కొన్ని అలా జరిగిపోతాయి. కొందరికి అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టేస్తుంది. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా పడిశం పట్టినట్టే పట్టింది అదృష్టం. వచ్చే ఏడాది విఘ్నేశ్వరుడు వచ్చే నాటికి నియోజకవర్గం రూపురేఖలు మారి.. అక్కడి జనాల ముఖాల్లో కొత్త కాంతులు వెలుగుతుండటాన్ని ఘన నాయకుడు చూస్తాడు కావొచ్చు.
దానం నాగేందర్ .. ఇందిరమ్మ ఇండ్ల కోసం వేదికమీదనే పోరాడిండు. మా వోళ్లకు ఇండ్లు రాకపోతే చెప్తా బిడ్డా మీ పని..? అని ఏకంగా ఆఫీసర్లకే ధమ్కీ ఇచ్చిండు. ఎవరికైతే ఇల్లు రాలేదో.. నా ఇంటికి రండ్రి.. నేను ఇప్పిస్తానని కూడా వారికి హామీ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా లైను కట్టుకుని ఖైరతాబాద్‌కు నడుచుకుంటూ వస్తాయి కావొచ్చు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ టక టకా సాంక్షన్ కూడా అవుతుండొచ్చు. ఇక ఇక్కడ ఇల్లు లేని నిరుపేద లేడు.. అని అధికారులు ఖైరతాబాద్ ను రికార్డుల్లో ఎక్కించుకున్నా ఆశ్చర్యం లేదేమో.. మరి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడా మజాకా!