SIM Card Fraud: ప్రస్తుత రోజుల్లో మొబైల్ నంబర్ అనేది కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడటానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకింగ్, యూపీఐ (UPI), సోషల్ మీడియా అకౌంట్ల నుండి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీదీ మొబైల్ నంబర్‌తోనే అనుసంధానమై ఉన్నాయి. ఈ తరుణంలో మన ఐడెంటిటీ ప్రూఫ్‌ల ఆధారంగా ఎన్ని మొబైల్ కనెక్షన్లు జారీ అయ్యాయో తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పేరిట ఎవరో ఒకరు సిమ్ కార్డు తీసుకుని దానిని చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించే ప్రమాదముంది. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 ప్రకారం.. సిమ్ కార్డుల మోసాలకు సంబంధించి ఎలాంటి శిక్షలు, జరిమానాలు విధిస్తారో ఈ కథనంలో చూద్దాం.
టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023లోని సెక్షన్ 42 ప్రకారం.. వేరొకరి వివరాలతో మోసపూరితంగా సిమ్ కార్డులు పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నిర్దిష్టమైన తీవ్ర నేరాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే రూ. 50 లక్షలు అనేది చట్టంలో పేర్కొన్న గరిష్ట జరిమానా మాత్రమే. మన పేరిట ఉన్న సిమ్ కార్డును వేరొకరు వాడినంత మాత్రాన లేదా సాధారణ పొరపాటు జరిగినంత మాత్రాన అందరికీ ఆటోమేటిక్‌గా రూ. 50 లక్షల ఫైన్ పడుతుందనుకోవడం పొరపాటే. తీవ్రమైన మోసాలు, కుట్రలకు పాల్పడే వారిపైనే ఆ స్థాయి చర్యలు ఉంటాయి.
మన గుర్తింపు కార్డులతో మరొకరు సిమ్ తీసుకుని దాన్ని సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. విచారణ సంస్థలు మొదట ఆ సిమ్ ఎవరి పేరిట ఉందో వారి వివరాలనే సేకరిస్తాయి. కాబట్టి గతంలో తీసుకుని వాడని పాత సిమ్‌లు, పోగొట్టుకున్న నంబర్లు, తెలియకుండా మన ఆధార్‌తో ఇతరులు తీసుకున్న కనెక్షన్ల వల్ల భవిష్యత్తులో ఐడెంటిటీ సంబంధిత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
ప్రజల భద్రత కోసం కేంద్ర టెలికం శాఖ.. ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) అనే అధికారిక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ ఐడీపై ప్రస్తుతం ఎన్ని యాక్టివ్ కనెక్షన్లు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తొలుత వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లి మీ పేరిట ఉన్న నంబర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. జాబితాలో తెలియని లేదా ఉపయోగించని కొత్త నంబర్ ఏదైనా కనిపిస్తే.. తక్షణమే పోర్టల్ ద్వారానే ‘రిపోర్ట్’ (Flag) చేసే వెసులుబాటు ఉంది. మరోవైపు పాత నంబర్లు ఇంకా యాక్టివ్‌గా కనిపిస్తే వాటిని కూడా నిలిపివేసేందుకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు.
Also Read: మెుబైల్ పదే పదే స్లో అవుతూ చికాకు తెప్పిస్తోందా? పైసా ఖర్చు లేకుండా.. రాకెట్‌లా మార్చే 7 ట్రిక్స్!
సిమ్ కార్డు వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా ఇతర వివరాలను అపరిచిత వ్యక్తులకు, అనాధికార ఏజెంట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా ఓటీపీ (OTP) ప్రక్రియలు పూర్తి చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనవసరమైన కారణాలకు ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదని హితవు పలుకుతున్నారు. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా వేరే సిమ్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంచార్ సాథీలో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. తమ పేరిట ఉన్న సిమ్ దుర్వినియోగం అయినట్లు గుర్తిస్తే సమీపంలోని సైబర్ క్రైమ్ లేదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మంచిదని వివరిస్తున్నారు.
Also Read: Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!