BigTV English

India vs China: బ్రహ్మపుత్రపై చైనా బ్రహ్మాస్త్రం.. భారత్‌కు బతుకు భారం.?

India vs China: బ్రహ్మపుత్రపై చైనా బ్రహ్మాస్త్రం.. భారత్‌కు బతుకు భారం.?

India vs China: చైనా నక్క బుద్దులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన సమస్య తీరిందనుకుంటే మళ్లీ మళ్లీ ఏదో ఒక సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. కొన్నాళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను ఇబ్బందులు పెట్టే చర్యలకు చైనా సిద్ధమవుతోంది. ఒకవైపు భారత్ సరిహద్దు దేశాలను చంకనెత్తుకొని, రెచ్చ గొడుతూనే.. మరోవైపు, భారత్‌ను పరోక్షంగా ఇబ్బందులు పెట్టే చర్యలు చేస్తోంది. భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మిస్తోంది. దీనితో, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌‌లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధమే వస్తే.. ఈ డ్యామ్ వల్ల భారత్‌కు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.


యుద్ధం వస్తే భారత్‌ను ఇక్కట్లకు గురి చేసేలా చైనా నిర్ణయం

చైనా వంకర బుద్ది ఎప్పటికీ మారదేమో అన్నట్లే ఉంది. స్నేహం నటిస్తూనే గోతులు తీయడంలో చైనా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవల, భారత్, చైనా బోర్డర్‌లో ఉన్న ఉద్రిక్తతలపై శాంతి ఒప్పందానికి ఓకే చెప్పిన చైనా.. ఆ తర్వాత, తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న చైనా.. భారత్‌ను ఇబ్బంది పెట్టే విధంగా పాకిస్తాన్ నడుచుకోడానికి ఉసిగొల్పుతుంది. తాజాగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న అంతర్గత సమస్య వెనుక కూడా చైనా కుట్ర దాగి ఉందనీ.. భారత్‌తో ఉన్న సత్సంబంధాలు క్షీణించేలా చైనా పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది. మాల్దీవుల్ని, శ్రీలంకను కూడా కంట్రోల్ చేసే దిశగా చర్యలు చేపట్టింది.


అరుణాచల్‌కు దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపై చైనా అతిపెద్ద డ్యామ్

ఒకవైపు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో వ్యాపార, వాణిజ్య, దౌత్యపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు యుద్ధం వస్తే భారత్‌ను ఇక్కట్లకు గురి చేసే కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్తు డ్యామ్‌గా పేరున్న ఈ డ్యామ్.. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదిగా నిర్మించనుంది. తాజాగా, ఈ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టిబేట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యామ్ నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది.

$137 బిలియన్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టు

టిబేట్ తూర్పు అంచులో ఉన్న యార్లగు జాంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్ నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని.. 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 విలియం కిలోవాట్ అవర్స్. అంటే కొత్త డ్యామ్ సామర్థ్యం దానికి మూడు రెట్లు అధికం. హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్‌లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే నది

నది పెద్ద యూటర్న్ తీసుకొని ఆరుణాచల్ ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో భారీ లోయ దగ్గర ఈ డ్యామ్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. 137 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఖరీదైన, భారీ ప్రాజెక్టుగా నిలుస్తుంది. అలాగే, బ్రహ్మపుత్ర నది అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశించడానికి ముందు సుమారు 3 వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలుండటం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్తు ఉత్పత్తి

యార్లాంగ్ జాంబ్బో నదిపై ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నవాటిలో ఒకటి అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే, జల విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు… నాలుగు నుంచి ఆరు వరకు తవ్వాలని చైనా ప్లాన్ వేస్తోంది. నమ్ చా బార్వా కొండల్లో తవ్వే ఈ సొరంగాలు ద్వారా సెకనుకు 2000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది.

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు జీవనదిలా బ్రహ్మపుత్ర

అయితే, ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్తు డామ్ మాత్రమే కాదని, పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టు అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చెబుతోంది. అయితే, చైనా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఇబ్బందికరంగా మారుతుందని భారతీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. టిబేట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు జీవనదిలా ఉంది. ఈ నది జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్-చైనా మధ్య ఒప్పందం కూడా ఉంది.

మే 15-అక్టోబర్ 15 మధ్య నదీ జలాల సమాచారం చైనా ఇవ్వాలి

వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ఇరదేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్ తో పంచుకోవాల్సి ఉంది. వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువునున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వట్లేదనే ఆరోపణలు ఉన్నాయి.

చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వట్లేదని భారత్ ఆరోపణలు

బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారిగా 2002లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరపెడుతుంది. చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్‌కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం

గత కొన్ని సంవత్సరాలుగా.. బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి, ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగునున్న ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ, ఈ ప్రాజెక్టు భారత్ – చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే మునిగే దిగునున్న ప్రాంతాలు

అందువల్ల రక్షణ పరంగాను భారత్‌కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిలువ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే, భారత్‌లో ఈశాన్య ప్రాంతం అల్ల కల్లోలం అవుతుంది. అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

భారతదేశానికి ప్రధాన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్​ డ్యామ్ నిర్మాణంపై జిన్‌పింగ్‌ చాలా కాలంగా ప్లాన్లు గీస్తున్నారు. భారత్‌కు నష్టమని తెలిసినప్పటికీ సూపర్‌ డ్యామ్‌ నిర్మాణానికి తయారయ్యారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో స్తబ్దుగాఉన్న చైనా ఇప్పుడు ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదికను విడుదల చేసింది. చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఈ నివేదికలో పొందుపరిచింది. ఈ నిర్మాణంలో సవాళ్లను కూడా ఇందులో పేర్కొన్నారు.

భారీ ఇంజనీరింగ్ ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం

బ్రహ్మపుత్ర నదిపై ఇలాంటి భారీ డ్యామ్ నిర్మాణం భూకంపాలకు గురయ్యే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఉందని తెలుస్తోంది. టిబెటన్ పీఠభూమి టెక్టోనిక్ ప్లేట్‌ల పైన దాని స్థానం కారణంగా తరచుగా భూకంప కార్యకలాపాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ డ్యామ్ నిర్మాణంలో భారీ ఇంజనీరింగ్ ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఇక, బ్రహ్మపుత్ర టిబెటన్ పీఠభూమి మీదుగా ప్రవహిస్తుంది. భారతదేశంలోకి ప్రవేశించే ముందు 25 వేల 154 అడుగుల అసాధారణ నిలువుగా ప్రపంచంలోని లోతైన లోయలో ప్రవహిస్తుంది.

చైనాలోని అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతంలో డ్యామ్

అందులోనూ, ఈ ఆనకట్ట నిర్మించే ప్రదేశం చైనాలోని ప్రధాన భూభాగంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఉంది. కాబట్టి, నదిలోని భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. అందుకే, ఇది ఎలాంటి ముప్పు తెస్తుందోనని ఎప్పటి నుండో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ కూడా డ్యామ్ గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్థానిక జీవావరణాన్ని మాత్రమే కాకుండా బ్రహ్మపుత్ర నది ప్రవాహం, గమనాన్ని కూడా మార్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే దీనికి ఎగువ ప్రాంతంలో చైనా జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లు నిర్మించింది.

గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం

ఇక, 60 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా… ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు.

60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఇది ఒకటి

ఇక, చైనా అభివృద్ధి పేరుతో చేపట్టిన మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటి. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు చైనా పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్‌ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే టిబెట్‌లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది చైనా. అయితే, చైనా చర్యలను భారత్, బంగ్లాదేశ్‌తో పాటు టిబెట్‌ పర్యావరణవేత్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు.

నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా ఆరాధించే టిబెట్‌ ప్రజలు

బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్‌ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్‌ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అలాంటి నదిపై నిర్మాణం పర్యావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ పూర్తిచేస్తే… ఆ ప్రభావం వెంటనే దిగువన ఉన్న ప్రాంతాలకే కాకుండా వరద ముప్పునకు గురయ్యే అసోం, బంగ్లాదేశ్‌ల పరిస్థితి వినాశకరంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

పంటలు పండే లక్షల కొద్ది హెక్టార్లలో పెద్ద ఎత్తున కోత

నది పదే పదే తన ప్రవాహాన్ని మార్చుకుంటూ ఉంటే.. పంటలు పండే లక్షల కొద్ది హెక్టార్లు పెద్ద ఎత్తున కోతకు గురవుతాయి. నది ప్రవాహంలో వస్తున్న ఈ మార్పులతో వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతం కూడా తగ్గిపోతుంది. దిగువ ప్రాంతానికి సరిగ్గా నీటిని విడుదల చేయకపోవడం, నీటిని కిందకి రాకుండా అడ్డుకోవడం, నదిలో నిర్మాణ సామగ్రిని పడేయడంతో నదీ పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. ఇక, అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిగా పేర్కొనే బ్రహ్మపుత్రా నదిని సజీవంగా ఉంచాలనే డిమాండ్ అరుణాచల్ ప్రభుత్వం ఎప్పటి నుండో చేస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిగా పేర్కొనే బ్రహ్మపుత్ర

ఒకవేళ చైనా ఈ నది ప్రవాహాన్ని మళ్లిస్తే, సియాంగ్ సైజు తగ్గిపోతుందనీ.. పెద్ద మొత్తంలో విడుదలయ్యే వరద నీటికి సియాంగ్ లోయ తీవ్రంగా ప్రభావితం కానుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక, అస్సాం, బంగ్లాదేశ్‌ కూడా వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంద గనుక.. ఈ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. అందుకే, అధిక నీటి విడుదలను అడ్డుకోడానికి భారత్ పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తోంది.

డ్యామ్ చేసే నష్టం ఎంత అనేది అంచనా వేయడం కష్టం

అయితే, ఈ నదిపై ఏదైనా డ్యామ్ నిర్మించాలంటే ముందు, ఎగువ ప్రాంతంలో చైనా నిర్మించే డ్యామ్ సైజు ఎంత అనే దానిపై సమాచారం కావాలి. దాని ఎత్తు, ఆనకట్ట నిల్వ సామర్థ్యం, ఎంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు అనే సమాచారంతో పాటు ఎంత వరద నీటిని కిందకి వదులుతారు? వంటి విషయాలు కూడా చైనా చెప్పాల్సి ఉంది. అప్పటి వరకూ ఈ డ్యామ్ చేసే నష్టం ఎంత అనేది అంచనా వేయడం కష్టం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం, టిబెటన్ అటానమస్ రీజియన్‌లో ఆరు డ్యామ్‌లను చైనా నిర్వహిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌కు మూడు డ్యామ్‌లున్నాయి.

స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్న డ్యామ్ నిర్మాణం

ఇందులో రెండు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఇక, ఈ డ్యామ్‌ను స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్నందు వల్ల, వారికి చైనా నుంచి ఉన్న ముప్పును అర్థమయ్యేలా వివరించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే, ఎగువ ప్రాంతంలో ఉన్న చైనా, డ్యామ్ నిర్మాణంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది కాబట్టి…. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దూకుడు అడ్డుకట్ట వేయడానికి భారత్ కూడా సాంకేతిక, వనరుల విషయంలో తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×