Woman Hanging Door| భార్యభర్తల గొడవ హింసాత్మకంగా మారింది. ఇద్దరూ తరుచూ గొడవ పడుతుండడంతో భర్తపై ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ ఆ తరువాత మహిళతో పోలిసులు తరుచూ సంప్రదించేవారు. ఈ క్రమంలో ఆ మహిళ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. కానీ ఆ భర్త మాత్రం.. తాను ఇంట్లో లేని సమయంలో పోలీసులే ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారిని ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ నగరం ఆవాస్ వికాస్ కాలనీలో నివసిస్తున్న ఆలోక్ కుమార్ అగ్రహారికి మూడేళ్ల క్రితం దివ్య అగ్రహారితో వివాహం జరిగింది. వారిద్దరూ అదే కాలనీ కాపురం పెట్టారు. ఆలోక్ లేబర్ పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దివ్యకు పిల్లలు పుట్టక పోవడమే ప్రధాన సమస్య. పైగా అప్పుడప్పుడూ ఆలోక్ మద్యం సేవించి ఆమెను చితకబాదేవాడు.
Also Read: ఆస్పత్రిలో భర్త ఆపరేషన్.. డబ్బులు, నగలతో పరారైన భార్య.. హత్య కేసు
భర్త పెట్టే చిత్రహింసలతో ఆమె మూడు నెలల క్రితం పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు భార్యభర్తల గొడవలో కలుగజేసుకొని ఆలోక్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దివ్య ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఆమెకు తరుచూ ఫోన్ చేసి అంతా సవ్యంగా ఉందా? అని ఆరా తీసేవారు. ఈ క్రమంలో శనివారం డిసెంబర్ 28, 2024న ఉదయం ఆలోక్ కుమార్ పనికి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో దివ్య కనిపించలేదు. బెడ్రూంలో ఆమె తలుపుకు ఉరి వేయబడి ఉంది. ఆమె చనిపోయింది.
ఇది చూసి ఆలోక్ షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దివ్య మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. అమేఠీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌పెక్టర్ మనోజ్ కుమార్ మిశ్రా దివ్య అనుమాస్పద స్థితిలో మృతి చెందిందని కేసు నమోదు చేశారు. దివ్యను ఆమె భర్తనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలోక్ కుమార్ మాత్రం తన భార్య హత్యచేయబడిందని .. ఆమెది ఆత్మహత్య కాదని పోలీసులే ఆమెను హత్య చేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు.
మీడియా ముందుకు వచ్చి తన భార్యను పోలీస్ కానిస్టేబుల్ రవి శుక్లానే హత్య చేసి ఉంటాడని చెప్పాడు. తన భార్యతో తనకు మూడు నెలల క్రితం గొడవలు జరిగిన విషయం వాస్తవమేనని.. కానీ ఆ తరువాత దివ్య పోలీసులకు ఫోన్ చేసి తనపై ఫిర్యాదు చేసిందని తెలిపాడు. అయితే పోలీసులు తనను ఆ సమయంలో హెచ్చరించి వదిలేశారని.. కానీ ఆ తరువాత నుంచి కానిస్టేబుల్ రవి శుక్లా తరుచూ తన భార్యకు ఫఓన్ చేసేవాడని.. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చేవాడని చెప్పాడు.
మూడు రోజుల క్రితం రవి శుక్లా తన ఇంటికి తన భార్య ఫోన్ లోని ఫొటోలు, మెసేజ్ లు డెలీట్ చేయాలని అడుగుతుండగా తాను విన్నానని చెప్పాడు. కానీ దివ్య మాత్రం అందుకు అంగీకరించలేదని చెప్పాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తాను పని కోసం బయటికి వెళ్లినప్పుడు ఇంటకి రవి శుక్లా వచ్చినట్లు పొరుగింటి వారు చెప్పారని.. ఆ తరువాతే దివ్య శవాన్ని చూడాల్సి వచ్చిందని ఆరోపించాడు. ఇంట్లో తలుపులు తక్కువ ఎత్తులో ఉన్నాయని అంత తక్కువ ఎత్తులో ఎవరైనా ఎందుకు ఉరి వేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య హత్య కేసులో ముందు రవి శుక్లాని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశాడు.
మరోవైపు ఈ కేసు సిఐ మనోజ్ కుమార్ మిశ్రా మాత్రం.. దివ్య మృత దేహం పోస్టు మార్టం రిపోర్ట్ వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో కానిస్టేబుల్ రవి శుక్లాను కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు.