Heart Attack: ప్రస్తుతం చాలా మంది వ్యాయామం చేస్తూనే ఉన్నట్లుండి కుప్ప కూలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది నేడు హార్ట్ ఎటాక్స్ తో మరణిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు. ఇదిలా ఉంటే.. వ్యాయామం, గుండె పోటుకు మధ్య సంబంధం ఏమిటి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాకుండా ఉంటుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె పోటు యొక్క లక్షణాలు:
ఛాతిలో అసౌకర్యం: ఛాతి మధ్యలో ఒత్తిడితో పాటు బిగించినట్లు ఉండటం లేదా నొప్పిగా అనిపించడం గుండె పోటు ముఖ్య లక్షణం.
శరీరంలోని ఇతర భాగాల్లో నొప్పి: ముఖ్యంగా ఈ నొప్పి చేతులు ప్రధానంగా ఎడమ చేయి లేదా మెడ, దవడ, వీపు లేదా కడుపు వరకు వ్యాపించవచ్చు.
శ్వాస ఆడకపోవడం: ఊపిరి తీసుకోడంలో ఇబ్బందిగా అనిపించవచ్చు.
వికారం, వాంతులు: హార్ట్ ఎటాక్ కి ముందు కొన్ని సార్లు వికారంగా కూడా అనిపించే అవకాశం కూడా ఉంటుంది.
తల తిరగడం: పై లక్షణాలతో పాటు తల తిరిగినట్లు అనిపించినా కూడా హార్ట్ ఎటాక్ లక్షణంగా పరిగణించాల్సి ఉంటుంది.
చెమటలు పట్టడం: ఉన్నట్టుండి చెమటలు పట్టడం కూడా గుండె పోటుకు లక్షణం కావచ్చు.
అలసట: ఎక్కువగా అలసిపోయినా కూడా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.