BJP Leaders Fights: పాలమూరు జిల్లా కమలం గూటిలో వర్గ పోరు తారాస్థాయికి చేరిందట.. చాలా రోజుల నుండి నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు రచ్చకెక్కడంతో క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఆ పార్టీ అయోమయంలో పడిందంటున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల వేళ అంతర్గతంగా కొనసాగిన విభేదాలు తాజాగా రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన కొత్త అధ్యక్షుడి పర్యటన లో బహిరంగంగానే బయటపడ్డాయి. ఇప్పుడా పొలిటికల్ ఎపిసోడ్ కు కాస్తా క్యాస్ట్ కూడా తోడవ్వడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పాలమూరు బీజేపీలో ఏం జరుగుతోంది?
రామచంద్రరావు సమక్షంలోనే రచ్చకెక్కిన అంతర్గతపోరు
పాలమూరు బీజేపీలో మహబూబ్‌నగర్ ఎంపీ డికే అరుణ , రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తరవాత రామచంద్రరావు తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు వచ్చి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కింది . శాంతికుమార్ గో బ్యాక్ అంటూ ఎంపి అరుణ వర్గీయులు నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగారు . దీనికి ప్రతిగా శాంతికుమార్ ఫాలోవర్స్ సైతం వ్యతిరేక నినాదాలు చేశారు . ఈ అనూహ్య పరిణామంతో అసలు పాలమూరు బిజెపి లో ఏం జరుగుతోందని ఆరా తీసే పనిలో పడ్డారట రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు .
2019 ఎంపీ ఎన్నికల్లో పరాజయం పాలైన డీకే అరుణ
2019 పార్లమెంట్ ఎన్నికల వేళ బిజెపిలో చేరిన డికే అరుణకు మహబూబ్‌నగర్ ఎంపి టికెట్ ఇచ్చింది అధిష్టానం . ఆ సమయంలో ఓటమి పాలైన డికే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టింది . ఆ తరువాత మొన్నటి పార్లమెంట్ లోనూ మరో మారు పోటి చేసే అవకాశాన్ని డీకే అరుణకే ఇచ్చింది కమలం పార్టి అధిష్టానం . అయితే 2019 తో పాటు , మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ టికెట్ ఆశావహుడిగా ఉండి భంగపడ్డారు ఆ పార్టి రాష్ట్రకోశాధికారి శాంతి కుమార్. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు దక్కే టికెట్ డికే అరుణకు దక్కిందని.. ఆమె ఓటమి కోసం శాంతి కుమార్ పనిచేశారని డికే అరుణ అండ్ టీం ఆరోపిస్తోంది .
శాంతికుమార్ గో బ్యాక్ అంటూ అరుణ వర్గీయుల నినాదాలు
అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టి తగ్గిందని , డీకే అరుణ ఓటమి కోసం శాంతికుమార్ కొందరికి దావత్‌లు ఇచ్చారని మండి పడుతున్నారు డీకే అరుణ మరియు ఆమె వర్గం. అందుకే మొన్నటి రాష్ట్ర అధ్యక్షుడి కార్యక్రమం వద్దకు వచ్చిన శాంతి కుమార్‌ను వేదికపైకి రాకుండా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అరుణ వర్గీయులు బబాహాహీకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతి కుమార్ కుట్ర చేశారని.. ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలని డికే అరుణ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
2 సార్లు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ శాంతికుమార్
ఇక అదలా ఉంటే పాలమూరులో బీజేపీ బలోపేతానికి శాంతికుమార్ ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయినా పార్టీ కార్య క్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారని ఆయన వర్గం చెబుతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన ఈ ఘటనను ఖండించకపోవడం.. తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మఖ్తల్, గద్వాలల్లో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో పలువురు పార్టిని వీడారని ఆరోపిస్తోంది శాంతికుమార్ వర్గం .
రచ్చకెక్కి రభస చేయడంపై బీజేపీ సీనియర్ల అసంతృప్తి
అది చాలదన్నట్లు బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్‌ను రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణ అవమానించారని… ఇది తగదంటూ పలు బిసి సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి డికే అరుణ వైఖరిని ఖండించాయి . రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ఎపిసోడ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కమలం పార్టిలో ఒక బిసి నాయకుడి ఉనికిని దెబ్బతీసేలా ఎంపి డికే వ్యవహరించారనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి బిసి సంఘాలు. ఇక పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకుని , సమస్యలను పరిష్కరించుకోవడం సైద్దాంతిక పార్టి అయిన బీజేపీకి ఆనవాయితీ అని , రచ్చకెక్కి రభస చేయడం పై కమలం పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో లోకల్ బాడి ఎన్నికల వేళ పాలమూరు బిజెపిలో నెలకొన్న వర్గ విభేదాలు, బిసి వాదం ఎంట్రీ తో ఈ ఇష్యూ ఎటువైపుకు పోతుందో నని కొందరు విశ్లేషిస్తున్నారు . అధిష్టాన పెద్దలు ఈ ఎపిసోడ్ పై ద్రుష్టి సారించి సెట్ రైట్ చేయాలని బిజెపి శ్రేణులు కోరుతున్నాయి.
Stroy By Rami Reddy, Bigtv