Urban Bank Elections: కాంగ్రెస్, బీజేపీ ఒకటేని బీఆర్ఎస్ ఆరోపించడం… బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపించడం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఆరోపించడం ఇలా మనం రోజూ ఈ ఆరోపణల పర్వాన్ని వినివినీ బోరైపోతున్నాం. గదా….అయితే, ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతల విజయం వెనుక… తామే ఉన్నామని బీజేపీ కుండబద్ధలు కొట్టడమే కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విజయం.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ఢిల్లీ లెవల్లో ఉప్పునిప్పులా పూర్తిగా భిన్న సిద్ధాంతాలతో కొట్టుకునే బీజేపీ, కాంగ్రెస్.. గల్లీకొచ్చేసరికి భాయిభాయీ అంటున్నాయి. కరీంగనర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలే ఇప్పుడు అందుకు వేదికగా మారింది. అర్బన్ బ్యాంక్‌లో జరిగిన 12 సీట్ల ఆటలో.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందట. తనను తాను మూడు ముక్కలుగా నరికేసుకుని, ప్రతిపక్షానికి రెడ్ కార్పెట్ వేసిందట. అధికారంలో ఉండి కూడా ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ను ప్రదర్శించడం ఎలాగో ఈ ఎన్నికలు చూపించాయంటున్నారు.
కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు గతంలో ఎన్నడూలేనివిధంగా జరిగాయి. అధికారంలో ఉండి కూడా తనలో తాను చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. తాను చీలిపోతూ కూడా.. ప్రత్యర్థికి బంగారు బాట వేసింది. అందుకే కాంగ్రెస్ అసమర్థతకు… ఈ ఎన్నికలు సజీవ సాక్ష్యంగా చెబుతున్నారు. 12 డైరెక్టర్ స్థానాల కోసం జరిగిన ఈ యుద్ధంలో… కాంగ్రెస్ మూడు ముక్కలుగా చీలిపోయింది. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ పడ్డాయి. ఒకటి కర్ర రాజశేఖర్ ప్యానెల్ కాగా.. మరొకటి అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్ గా పనిచేసిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ తో పాటు.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్.. ఈ మూడు ప్యానెల్స్ ఢీ అంటే ఢీ అన్నాయి. వెలిచాల వర్గం పెద్దఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే, ఆ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఫలితాలు ప్రచారానికి భిన్నంగా వచ్చాయి. కర్ర రాజశేఖర్ ప్యానెల్ లో 9 మంది డైరెక్టర్స్ గా గెలిచారు. అందులో ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కాగా.. ఇద్దరు బీజేపీ నాయకులు. ఇక మరో ముగ్గురు డైరెక్టర్లలో ఒకరు ప్రో బీజేపీ నాయకుడైన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవగా… మరో ఇద్దరు వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు డైరెక్టర్లుగా గెలిచారు. తనకంటే ముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన కర్ర రాజశేఖర్ ప్యానెల్ పై అవినీతి ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ అసలు ఒక్క డైరెక్టర్ స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే కర్ర రాజశేఖర్ ప్యానెల్ మొత్తం 9 మందిలో ఏడుగురు కాంగ్రెస్ నేతలు కాగా, ఇద్దరు బీజేపీ నేతలున్నారు. అయితే, కర్ర రాజశేఖర్ ప్యానెల్ గెలుపు తర్వాత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రావాల్సిన అభినందనలు.. బీజేపీ నేతల నుంచి రావడమే ఇప్పుడు ఈ మొత్తం చర్చకు కారణం అయ్యింది…. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెల్చిన కర్ర రాజశేఖర్ వర్గానికి అభినందనలంటూ ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… ఈ చర్చకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ర రాజశేఖర్ అండ్ టీంలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్లుగా గెలిస్తే.. దాన్ని బీజేపీ కేంద్ర మంత్రి ఓన్ చేసుకున్నారు. అంతేకాదు బండిసంజయ్ ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు పూర్తి సయహా సహకారమందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్ర రాజశేఖర్ మరోసారి చైర్మన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉండగా.. ఆ కాంగ్రెస్ నాయకులందరినీ ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నిక తర్వాత బీజేపీలోకి ఆహ్వానించి, కాషాయ కండువాలు కప్పి అఫిషీయల్ బీజేపి నేతలుగా మార్చే తంతు ఇక తర్వాత ఉండనుంది. ఈ క్రమంలో.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కొట్టుకుంటూ… మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ తనకు తానే భస్మాసుర హస్తాన్ని తయారుచేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. అందుకు ఈ అర్బన్ బ్యాంక్ ఫలితాలనే ఓ ఉదాహరణగా జిల్లాలో చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు సమష్టిగా ఒకే ప్యానెల్‌ను బరిలోకి దించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పార్టీలోని వర్గాలు మూడు ప్యానెళ్లుగా చీలిపోయి పోటీ పడ్డాయి. ఒకే ప్యానెల్ కింద పోటీచేసి ఉంటే విజయం వేరేలా ఉండేది. అంతే కాదు అర్బన్ బ్యాంక్ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ లేదా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోలేదట. అందుకే ఎవరికి వాళ్లు ప్యానెళ్లు ఏర్పాటుచేసుకున్నారు. తమలో తామే కొట్టుకుని, ప్రత్యర్థికి ఎర్ర తివాచీ పరిచింది హస్తం పార్టీ. గెలిస్తే బీజేపీకి క్రెడిట్, ఓడితే కాంగ్రెస్‌కు డ్యామేజ్. ఇది కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల సమ్మరీ అని చెప్పొచ్చు. బలమైన ప్రత్యర్థితో పోరాటం చేయడం సిసలైన పోటీ. కానీ, తమలో తామే కొట్లాడుకుని.. ప్రత్యర్థికి పోటీ లేకుండా చేయడం చేతగానితనం, ఐకమత్య లోపం. ఇవన్నీ హస్తం పార్టీ జిల్లాలో పెంచి పోషిస్తూ..తమ పార్టీ నుంచి గెలిచిన డైరెక్టర్లను కూడా ఓన్ చేసుకోలేకపోయింది. ఆ పోటీలోనూ మూడుముక్కలాటకు తెరతీసి… ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి ఆ క్రెడిట్ ను హస్తగతం చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది.
Story by Apparao, Big Tv