– బీఆర్ఎస్ హయాంలో లోపాయికారి బదిలీలు
– పోలీస్ శాఖను భ్రష్టు పట్టించిన వైనం
– బదిలీల్లో భారీగా అవకతవకలు
– సైబరాబాద్, రాచకొండ ఏరియాలకు ఫుల్ డిమాండ్
– స్టేషన్ కో రేటుతో దందా చేసిన ప్రముఖుల అనుచరులు
– మాజీ సీపీల సీసీలు, కేటీఆర్ పీఏ, ఇద్దరు సీఐల పాత్ర
– లోకల్ మామూళ్లు ఎలా వసూలు చేయాలో ట్రైనింగ్
– ఇప్పటికీ తమ హవా చూపిస్తున్న దందా గ్యాంగ్
– లా అండ్ ఆర్డర్ సమస్యకు వాళ్లే కారణమా?
– అప్పటి బదిలీలు, దందాలపై కాంగ్రెస్ సర్కార్ ఎంక్వయిరీ
– టెన్షన్‌లో కరప్షన్ ఖాకీలు.. గులాబీ అవినీతిపరులు
– మహానగరంలో ఖాకీ మాయపై స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ స్టోరీ
దేవేందర్ రెడ్డి, 9848070809
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం
Corruption in Police Transfers : పోలీస్ అంటే బాధ్యత.. కనిపించని నాలుగో సింహం.. అవినీతి పరులకు సింహస్వప్నం. కానీ, గులాబీ హయాంలో పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. దానికి సాక్ష్యమే బదిలీలు. తమకు కావాల్సిన చోటకు పోలీస్ అధికారులను బదిలీ చేసి డబ్బులు గుంజారు. ఇందులో ఆనాటి పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉంది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కరప్షన్ ఆఫీసర్ల వల్లే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతోందన్న చర్చ జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం లంచాలు ఇచ్చి వచ్చిన అధికారులు డబ్బుల కోసమే ఆలోచిస్తారు. ఆ డబ్బులు వసూలు చేయడానికి ఏ గడ్డి అయినా కరుస్తారు. అందుకు లా అండ్ ఆర్డర్‌ని సైతం గాలికొదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కేటీఆర్ పీఏ తిరుపతి లింక్స్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆఫీసర్స్ పైరవీలు గట్టిగానే సంపాదించారు. ఇప్పుడు అదే మాఫియా జాడల్లో కొందరు ఉంటూ శాంతి భద్రతలను గాలికొదిలేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు జంట కమిషనరేట్లలో ఏం జరిగిందో దర్యప్తునకు ఆదేశించినట్లు సమాచారం. గతంలో అప్పా జంక్షన్ వద్ద మీటింగ్‌లు పెట్టుకుని ట్రాన్సఫర్స్‌పై సైబరాబాద్ ఎస్ఐ, సీఐల బదీలీలపై నలుగురు డిసైడ్ చేసేవారు. ఈక్రమంలోనే నార్సింగ్ సీఐ, మాదాపూర్ సీఐలు వారి బ్యాచ్ మెంట్స్‌కి గాలం వేసి లక్షల్లో వసూలు చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఈ దందాలో కీలకమనే ఆరోపణ ఉంది. అటు కేటీఆర్, ఇటు ఆనాటి సీపీ స్టీఫెన్‌కు చెప్పకుండానే పీఏ తిరుపతి, సీపీ సీసీ సతీష్‌తో కలిసి సీఐలు దందాలు చేసేవారు. వీరితోపాటు వారి అధికారిక ఛానల్ క్రైం రిపోర్టర్ కూడా భాగస్వామిగా తెలుస్తోంది. ఇలా బీఆర్ఎస్ వర్గం సైబరాబాద్‌లో ట్రాన్స్‌ఫర్స్ విషయంలో కోట్లాది రూపాయలు సంపాదించారు.
స్టేషన్‌కో దందా
వీళ్ల హయాంలో ప్రతి పబ్ నుంచి నెలకు 3 లక్షలు ఇవ్వాల్సిందే. అక్కడ డ్రగ్స్ పార్టీ జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా అటు వైపు చూడమనేది అగ్రిమెంట్. ఏదైనా అపార్ట్‌మెంట్ కోసం కొండలను, గుట్టలను పగులగొట్టాలంటే, బ్లాస్టింగ్ చేసుకునేందుకు అనధికారికంగా ప్రతి స్టేషన్‌కి నెలకి 2 లక్షలు. వీటి కోసం పోలీస్ కమిషనర్ పర్మిషన్ లేకుండా లోకల్ పోలీసులతో మేనేజ్ చేసి నెల నెలా 2 లక్షల వరకు వసూలు చేసిన స్టేషన్ హెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. కాస్ట్లీ ఏరియా అయిన గచ్చిబౌలి సీఐ కోసం జేమ్స్ వద్ద 70 లక్షలు అడిగారు. 20 లక్షలు ఇస్తేనే ఆయనకు పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మామూళ్లు ఎలా వసూలు చేయాలో అప్పటి మాదాపూర్, నార్సింగ్ ఎస్‌హెచ్‌లు చెప్పారు. కేటీఆర్ పీఏ తిరుపతి, సంతోష్ తన జేబులో ఉన్నారని చెప్పుకునే అధికారిక ఛానల్ క్రైం రిపోర్టర్ హామీలతో దందాలు నడిచాయి.
అలర్ట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాదాపూర్ ఎస్‌హెచ్ గడ్డం మల్లేష్ ఎవరినీ నమ్మకుండా అయనే వెళ్లి వసూలు చేసుకోవడం మొదలు పెట్టారు. అందుకే ఇప్పటి సీపీ బదిలీ చేశారు. అది కూడా నిజాయితీతో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రెగ్యులర్‌గా వచ్చే మామూళ్ల పైనే ఆయన ఫోకస్ చేశారు. అలా కాకుండా ఎంతో మంది మేం డబ్బులు ఇచ్చి పోస్ట్ తెచ్చుకున్నాం, డబ్బులు వసూలు చేసుకుంటామని చెలరేగుతున్న అధికారులు ఇప్పటికీ ఉన్నారు. గులాబీ లీడర్లు, పీఏల లింక్స్ ఇప్పటికీ కొనసాగుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. వారి వ్యవస్థతోనే లా అండ్ ఆర్డర్ నడవడం ఏంటని దర్యాప్తునకు ఆదేశించింది. గత 3 ఏండ్లుగా సైబరాబాద్‌లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అన్ని అంశాలు వివరంగా కావాలని అడిగింది. అందులో ట్రాన్సఫర్స్ మాఫియాపై ప్రత్యేకంగా దర్యప్తు జరుగుతోంది.
రాచకొండలో బదిలీకి 13 లక్షలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సదరు అవినీతి బ్యాచ్ రాచకొండలో అరాచకాలు ఎక్కువగా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 5 ఎండ్లు సీపీగా ఉన్న మహేష్ భగవత్ కొన్నింటికి దూరంగా ఉండేవారు. ఏ ప్రభుత్వం ఉన్నా వారి మన్ననలను పొందడానికి ఏ సమాచారమైనా ఇట్లే చేరవేసేవారు. భగవత్ వెళ్లిపోయిన తర్వాత ఆఫీసర్స్ పోస్టింగ్ కోసం రేట్లు మాట్లాడారు. గత సీపీకి తెలుసో తెలియకనో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ప్యాకేజీ మాట్లాడుకున్నారు. ఎక్కువ విస్తర్ణం కలిగిన కమిషనరేట్‌గా రాచకొండ ఉంది. సిటీకి దగ్గర్లో ఉండే ఏరియా కావడంతో, ఎస్‌హెచ్ఓ కి 13 లక్షలు. సెమీ అర్బన్ ఎస్‌హెచ్ఓ కి 8 లక్షలు, రూరల్ స్టేషన్‌కి 5 లక్షల చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు కొత్త సీపీ రావడంతో ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. తామంతా బదిలీల కోసం లక్షలు ఖర్చు చేశామని, ఇప్పటి సీపీ బదీలీ చేస్తే తమ పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. ఇదే సమయంలో కొత్త సీపీ తనకు అనుకూలమైన వారిని, తన సామాజిక వర్గాన్ని నింపుకోవడంపై ఫోకస్ పెట్టారు. పోస్టింగ్‌లను మార్చేందుకు రెడీగా ఉన్నారు.
రాచకొండ, సైబరాబాద్ కీలకం
ఒకప్పుడు హైదరాబాద్ క్రైం రేట్ చూసి అందరూ ప్రశ్నించే వాళ్లు. ఇప్పుడు సైబరాబాద్, రాచకొండ కీలకంగా మారాయి. హైదరాబాద్‌లో రెగ్యూలర్ క్రైం కంట్రోలింగ్ తప్ప వేరే ఏమీ లేదు. కానీ, సిటీ శివార్లలో, ఆదాయ మార్గాలు ఒక్కొక్క స్టేషన్‌కి వద్దన్నా నెలకు 15 లక్షలు వస్తాయి. డ్రగ్స్, రేవ్ పార్టీలు, బ్లాస్టింగ్స్ పదార్ధాలు, హుక్కా, గ్యాబ్లింగ్ గ్యామ్లింగ్‌తో పాటు అనేక అసాంఘీక చర్యలకు పాల్పడుతుంటారు. అవి బయటపడకుండా ఒక్కొక్క స్టేషన్‌కి నెలకు 10 నుంచి 15 లక్షలు అందుతాయి. అయితే, ఈమధ్య ఈ దందాలు తగ్గినట్టు సమాచారం. దాని వల్లే కరప్షన్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేస్తున్నారని తెలుస్తోంది. రాచకొండ సీపీ సుధీర్‌కి ఇది ఇబ్బంది కలిగించే అంశం. అయితే, ఇప్పటికీ బదిలీల మాఫియా యాక్టివ్‌గా ఉండడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచాల్సి ఉంది. గతంలో ట్రాన్స్‌ఫర్స్ అన్నీ లెటర్ హెడ్స్‌తో జరిగాయి. ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చన్న ధ్యాసలో దందా నడిపించేందుకు చూస్తోంది గ్యాంగ్. ఈ వ్యవహారంలో గత సీపీ సీసీ వెంకట్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ బదిలీల మాఫియా ఆగడాలు ఆగకుండా కొనసాగితే మాత్రం లా అండ్ ఆర్డర్‌కి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకావం ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్‌గా దీనిపై దర్యాప్తు జరుపుతోందని, గత మాఫియాపై కేసులు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ పోలీస్ వర్గాల్లో జరుగుతోంది.