ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగానే ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శల తీరు. నిన్నటి దాకా ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్ చేసి మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి ఇవాళ మీడియా మీద పడ్డాడు. ప్రత్యేకించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై. రాధాక్రిష్ణ వ్యవహార శైలిపై. ఆ మీడియాలో ప్రత్యేకించి తనపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ.
ఆంధ్రా మీడియా ఇక మాకవసరం లేదన్నారాయన. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా మీడియా మాకు చాలు అనడం.. మీ మీద ఆధారపడాల్సిన అసవరం మాకు లేదు.. అనే కామెంట్స్ వరకు ఓకే గానీ మేము వంద పేపర్లు, వంద చానెళ్లు పెట్టుకోగలుగుతామని అనడమే మరీ అహంతో కూడిన కామెంట్స్‌గా చర్చకు వచ్చాయి.
మీడియా మీద సంయమనం కోల్పోవడం మూలంగా మీడియా సంస్థలకు వచ్చే నష్టమేమీ ఉండదు.. పైగా ఇలాంటి కామెంట్స్ వాటికి ఆయాచిత ప్రచారం చేసి పెట్టినట్టే. మాతో పెట్టుకుంటే పత్రిక నడవనివ్వం.. చానెల్‌ను కొనసాగనివ్వమనే బెదిరింపు దోరణిని కూడా ఎవరూ హర్షించరు. ఎందుకంటే.. ఏదో ఒక ఫేక్ వార్త బాధించి ఉండొచ్చు గాక, దీన్ని ఖండించడం, విమర్శించడం వరకు ఓకే. కానీ ఆ మీడియా మూలాలనే పెకిలిస్తామనే దోరణి విపరీత పోకడల కిందనే జమ కడతారు తప్ప.. పెద్దగా ఆమోదమైతే లభించదు.
గతంలో కేసీఆర్ కూడా టీవీ9 విషయంలో ఇలాంటి కామెంట్ చేశారు. ఏబీఎన్‌ను కూడా బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. ఇది కూడా వీరావేశంలో భాగంగానే చూస్తారు.. బాగా స్పందించారని జనాలకు అప్పటికప్పుడు కనెక్టవుతుంది కాబోలు.. కానీ, అంతిమంగా ఇది లాంగ్‌రన్ పోరాటం చేసే అంశం కాదు. మధ్యలోనే వదలేసేది.
కానీ మీడియా మాత్రం కాచుకు కూర్చుంటుంది.. ఎప్పుడు దొరుకుతారా? ఎలా డ్యామేజీ చేయాలా? తోకను బట్టుకుని పడగ అని రాసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి ఇలాంటి తగవులు చికాకునే తెప్పిస్తాయి తప్ప.. పరిష్కార మార్గాలు మాత్రం కాబోవు.
రేవంత్ సీఎం కాగానే సోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబర్లను అసెంబ్లీ సాక్షిగా బట్టలిప్పి కొడతానన్నారు. దీని వల్లా ప్రయోజనం లేదు. చట్టపరమైన చర్యలు సైలెంట్‌గా తీసేసుకుంటే సరిపోతుంది. కానీ బాహాటంగా ఇచ్చే ఇలాంటి వార్నింగులు రెచ్చగొట్టేవే తప్ప.. సమస్య సమిసిపోయేలా చేసేవైతే కావు.
ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే వాస్తవానికి విరుద్దంగా పోయే టీవీ చానెళ్లు, పేపర్లు.. కల్పిత వార్తలను వండి వార్చే కంటెంట్‌లతో నెట్టుకురావాలని చూసేవి.. కొన్ని రోజుల పాటు జనాలను రంజింపజేస్తుండొచ్చు.. వారిని ఆకట్టుకుని ఉంటుండొచ్చు. కానీ పదే పదే ఇవే వార్తలను ప్రసారం చేస్తూ.. ప్రచారంలా వాడుకుంటే.. ఇందులో తన సొంత ఎజెండాను జొప్పించి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే..అది పాఠకులకు, వీక్షకులకు అర్థమైపోతుంది.
ఆ తరువాత వారే దాన్ని పక్కన పడేస్తారు. జనం నీ కన్నా తెలివైనోళ్లు.. బాబు.. ఒక విషయాన్ని వారు చూసే కోణం, ఏం జరుగుతోంది.. పరిణామాల అర్థమేమిటో పసిగట్టడంలో ఉద్దండులు.. మీ జర్నలిస్టులు కూడా పనికిరారు ఈ విషయంలో..! పొద్దున్నే ఓ సీనియర్ లీడర్ అన్న మాటలు ఇక్కడ ప్రస్తావనర్హంలా అనిపిస్తోంది.