BigTV English

Burgula Ramakrishna Rao: ఆదర్శ నాయకుడు.. మన బూర్గుల..

Burgula Ramakrishna Rao: ఆదర్శ నాయకుడు.. మన బూర్గుల..

Dr.Burgula Ramakrishna Rao jayanthy special


Dr.Burgula Ramakrishna Rao jayanthy Special Story: తెలుగునేల మీద పుట్టిన అత్యంత అరుదైన నాయకుల్లో హైదరాబాద్ తొలి సీఎంగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఒకరు. హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన తొలి, తుది సీఎం ఆయనే. ప్రజానేతగానే గాక లాయరుగా, బహుభాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో పలు సేవలందించిన బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశీలిగా పేరొందారు. నేడు ఆయన జయంతి.

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. వీరి ఇంటి పేరు పుల్లంవార్ అయినా వీరి స్వగ్రామం బూర్గుల కావటంతో ఆయన ఇంటి పేరు బూర్గులగా స్థిరపడిపోయింది. రామకృష్ణారావు హైదరాబాద్ ధర్మపంత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1915లో మెట్రిక్ పరీక్ష రాసి, తర్వాత పుణెలోని పెర్గుసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ పూర్తి చేశారు. బొంబాయి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేసి, హైదరాబాద్‌లోని గొప్ప లాయరుగా పేరొందారు. లాయరుగా ఉచ్ఛస్థితిలో ఉండగా, స్వామీ రామానంద తీర్థ తదితర కాంగ్రెస్ నేతలతో కలసి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని కీలక పాత్ర పోషించారు. 1912లో వివాహం చేసుకున్న బూర్గుల.. 1920లో భార్య మృతితో, 1924లో ద్వితీయ వివాహం చేసుకున్నారు.


Also Read: మహిళా హక్కుల తొలి గొంతుక.. సావిత్రీ బాయి పూలే

కాంగ్రెస్ తరపున ప్రజాపోరాటాలకు దిగిన బూర్గుల మాతృభాషలో విద్యాబోధన చేయాలని నిజాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉర్దూను బలవంతంగా రుద్దటం తగదని చాలాకాలం పోరాడారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచి, నిరంకుశ నిజాంకు భయపడకుండా, గాంధీజీ పిలుపు మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను జనంలోకి తీసుకుపోయారు. 1913లో దేవరకొండలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పని చేశారు. శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసే కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలోని పల్లెల్లో తెలుగు పుస్తకాలను విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చి, యువతలో స్వాతంత్ర ఆకాంక్షను పెంచేందుకు దోహదం చేశారు. శాసనోల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. పీవీ నరసింహరావుతో సహా ఎందరో యువ లాయర్లు వీరి వద్దే జూనియర్ లాయర్లుగా ప్రాక్టీసు చేసేవారు. వారందరికీ వృత్తిపరంగా మార్గదర్శకత్వం వహిస్తూ వారిని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి గొప్ప నేతలుగా మలచిన ఘనత బూర్గుల వారి సొంతం.

1948 సెప్టెంబరు 17న పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావటంతో ఇక్కడ వెల్లోడి సీఎంగా ఏర్పడిన ప్రభుత్వంలో బూర్గుల రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ కాలంలో వినోభా భావే భూదానోద్యమానికి చట్టబద్ధత తీసుకొచ్చి, పేదలకు పెద్ద రైతులు ధైర్యంగా భూములు ఇచ్చే మంచి వాతావరణం కల్పించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత బూర్గుల సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి తెలుగువారంతా ఒక్కటి కావాలనే భావనతో, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపి పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం కేరళ గవర్నరుగా, 1962లో ఉత్తర ప్రదేశ్ గవర్నరుగానూ సేవలందించారు.

Also Read: Savitribai Phule: మహిళా హక్కుల తొలి గొంతుక.. సావిత్రీ బాయి పూలే

రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత బూర్గుల రచనా వ్యాసంగంలో మునిగిపోయారు. జగన్నాథ పండితరాయలు రాసిన లహరీ పంచకం, ఆదిశంకరుల సౌందర్యలహరి, కనక ధారా స్త్రోత్రాలను తెలుగులోకి అనువదించారు. తెలుగులో కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, శారదాస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం వంటి రచనలు చేశారు. వీరి సాహిత్య సేవలను గుర్తించి ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. వానమామలై వరదాచార్యులు, కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, సింగిరెడ్డి నారాయణరెడ్డి వారితో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి గొప్ప సాహిత్యం వచ్చేందుకు కృషిచేశారు. జీవితకాలం తాను నమ్మిన విలువలకు కట్టుబడిన బూర్గుల రామకృష్ణారావు సెప్టెంబర్ 14, 1967లో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ధ్రువతారగా నిలిచిపోయిన నేతల్లో ఒకరిగా ఆయనకు జయంతి నివాళి.

Tags

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×