BigTV English

Savitribai Phule: మహిళా హక్కుల తొలి గొంతుక.. సావిత్రీ బాయి పూలే

Savitribai Phule: మహిళా హక్కుల తొలి గొంతుక.. సావిత్రీ బాయి పూలే
Savitri Bhai
Savitri Bhai Death anniversary

Savitribai Phule Special Story: విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన నికార్సైన స్త్రీవాది, కట్టుబాట్లను, సాంప్రదాయాలను ధిక్కరించి తమ హక్కులకై మహిళలు నినదించేలా స్ఫూర్తినిచ్చిన సంఘ సంస్కర్త, ఆకలిగొన్న వారి కడుపునింపిన అన్నపూర్ణ, అణగారిన వర్గాల గుండెఘోషకు గొంతకనిచ్చిన ధీశాలి.. సావిత్రీ బాయి పూలే నేడు ఆమె వర్ధంతి.  ఈ సందర్భంగా ఆమె జీవన ప్రయాణపు విశేషాలను తెలుసుకుందాం.


మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఓ సాధారణ రైతు కుటుంబంలో సావిత్రి బాయి జన్మించారు. ఆమె తల్లిదండ్రుల పేర్లు ఖండోజి నెవెషే పాటిల్, లక్ష్మీ. నాటి సంప్రదాయం కారణంగా 12 ఏళ్లకే సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న జ్యోతిరావు పూలేతో ఆమె వివాహం జరిగింది. ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకున్న జ్యోతిరావు స్వయంగా అక్షరాలు దిద్దించారు. అత్తారింట్లో కుటుంబ బాధ్యత మోస్తూనే చదువుకుని, అహ్మద్ నగర్‌లో టీచర్ ట్రైనింగ్ పొంది, 1848 జనవరి 1న పూణెలోని బుధవారపేటలో తొలి అతిశూద్రుల బాలికల కోసం భర్తతో కలిసి తొలి స్కూలును ప్రారంభించారు. 1855 నాటికి వీరు రాత్రి బడులూ ఆరంభించారు.

Read More: మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ!


విద్యార్థులకు కొంత స్టైఫండ్ ఇవ్వటం, తరచూ తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు నిర్వహించి విద్య ప్రాధాన్యతను గుర్తించేలా వారిని చైతన్యవంతులను చేశారు. 1870 లో దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో 2వేలమంది బాలబాలికలకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అయితే.. దీనిని సహించలేని నాటి ఆధిపత్య కులాల వారు ఈ దంపతులకు సామాజిక బహిష్కరణ శిక్షన విధించారు. కానీ.. వీరు వెనుదిరగకుండా ముందుకే సాగారు. బాలికల విద్యకై ఆమెచేస్తున్న కృషిని గుర్తించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం సావిత్రీ బాయికి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారంతో బాటు.. పూలే దంపతులను సత్కరించింది.
 
బాలికా విద్యతో బాటు.. మహిళా చైతన్యం కోసం ఆమె మహిళా మండలుల ఏర్పాటు చేయటం ఆరంభించారు. నిధుల లేమి, సిలబస్ మీద వచ్చిన అభ్యంతరాల కారణంగా 1858లో పూలే దంపతులు ప్రారంభించిన 3 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే.. ఈ దంపతుల సేవానిరతిని గుర్తించిన పలువురు వీరికి అండగా నిలవటంతో సుమారు 50 పాఠశాలలు తెరిచి నిమ్నకులాల పిల్లలకు విద్యాబోధన చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొని నిలిచారు.

అప్పట్లో వితంతువులకు శిరోముండనం చేసేవారు. ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ.. బొంబాయి, పుణె నగరాల్లోని వేలాదిమంది క్షురకులను కూడగట్టి సమ్మెచేయించి, ‘మేం వితంతువులకు శిరోముండనం చేయం’ అని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు.. బాల వితంతువులను బడి బాట పట్టించేందుకు కృషి చేయటంతో బాటు సతీసహగమనం, అంటారానితనం, లింగవివక్ష వద్దంటూ గొప్ప ప్రచారం చేశారు.

దళితుల నీడ కూడా తమ వీధిలో పడటానికి అగ్రవర్ణాలు అంగీకరించని రోజుల్లో.. పూలే దంపతులు తమ ఇంటిలో ఓ బావిని తవ్వించి ఎవరైనా వచ్చి నీరుతోడుకునే ఏర్పాటు చేశారు. 1873లో ‘సత్య శోధక్ సమాజ్’ పేరిట స్త్రీలు, శూద్రులు, దళితులు, ఇతర నిమ్నవర్గాల ఉన్నతికై ఉపక్రమించారు. ఈ సంస్థ మహిళా విభాగానికి సావిత్రీ బాయి నాయకత్వం వహించారు. 1890 నవంబర్ 28న జ్యోతీరావు పూలే కన్నుమూయగా, అన్ని అభ్యంతరాలను పక్కనబెట్టి.. స్వయంగా భర్త చితికి ఆమె నిప్పంటించారు. ఈ వార్త నాడు దేశంలో సంచలనం కలిగించింది.

Read More: సీమ ముద్దుబిడ్డ.. ఉయ్యాలవాడ..!

1863లో శిశు హత్యల నివారణకు ‘బాల్ హత్య ప్రతి బంధక్ గృహ’ పేరుతో ఒక హోమ్‌ను ప్రారంభించి, అత్యాచార బాధితులు, అవాంఛిత గర్భం ధరించిన వారు సురక్షితంగా ప్రసవించేందుకు ఏర్పాట్లు చేశారు. 1874లో పూలే దంపతులు.. కాశీ బాయి అనే బ్రాహ్మణ వితంతువు కుమారుడిని దత్తత తీసుకుని డాక్టర్‌గా తీర్చిదిద్దారు. సావిత్రిబాయి మంచి రచయిత్రి కూడా 1854లో ఆమె తన సంపుటి ‘కావ్య ఫూలే’ ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభూద్ రత్నాకర్’ 1891లో ప్రచురించింది.

ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి. 1897లో పుణె నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలగా, దత్త కుమారుడైన డా.యశ్వంత్ రావుతో కలిసి మహిళలు, పిల్లల కోసం వైద్యశిబిరాలు నిర్వహించారు. చివరకు అదే ప్లేగు వ్యాధి బారిన పడి సావిత్రిబాయి 1897 మార్చి 10న కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం 1983లో పూణే నగర కార్పొరేషన్ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 10న ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. తన అవిశ్రాంత పోరాటం,అనితరమైన సేవలతో సావిత్రీబాయి జాతి జనుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

Tags

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Big Stories

×