Manmohan Singh: సామాన్యుడి ఆవేశం కంటే మేథావి మౌనం ప్రపంచానికి చాలా ప్రమాదకరం అంటారు. ఈ మాటలను అక్షరాల నిజమని మన్మోహన్ సింగ్ నిరూపించారు. ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో ఉండేది కాదు.. చేతల రూపంలోనే చూపించేవారు. ఆయన మౌనంగా పనిచేస్తూ ఎక్కడో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించి ప్రపంచదేశాలతో పోటీగా నిలబెట్టారు. ఇలా ఆయన మౌనం ప్రపంపదేశాలకు ప్రమాదంగా మారింది. సింపుల్ చెప్పాలంటే 1986లో ఏర్పడిన బీఎస్సీ సెన్సెన్స్ 1991 నాటికి కేవలం 1000 పాయింట్లకు మాత్రమే చేరింది. అంటే 5 ఏళ్లలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు ఎదిగింది. కానీ, 1992 నాటికి అది 4000 పాయింట్లకు చేరింది. దానికి కారణం ఫైనాన్స్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే. ఆ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు వెనక్కి చూడలేదు.
ఫోన్లను తయారీ చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ, ఆ ఫోన్ సమాన్యుడికి చేతికి చేరిందంటే మన్మోహన్ సింగ్ తీసుకున్న లిబరలైజేషన్ నిర్ణయమే. అంతకు ముందు ఎవరైనా ఫోన్ కనెక్షన్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కోసం నెలలు తరబడి ఎదురుచూడాల్సిందే. ఒక్కోసారి అవి సంవత్సరాలు కూడా అయ్యేవి. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ఇవాళ అనుభవిస్తున్న విలాసాలు దేశానికి చేరడానికి ఆయనే కారణం. ఆర్థిక మంత్రిగా, ప్రధాని మంత్రిగా ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనక మారుమూల గ్రామంలో ఉండే ప్రజలకు ఆ ఫలితం దక్కే విధంగానే ఉండేది.
ఇక్కడ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయనపై కొన్ని విమర్శలు ఉన్నాయి. మౌనమునిగా మారిపోయారని, సొంత నిర్ణయాలు తీసుకోలేదని కొందరు విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన మౌనమే ప్రత్యర్థులకు అంతుపట్టని సమాధానం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో కాకుండా చేతల రూపంలోనే ఉంటుంది. ప్రభుత్వ సేవలు దేశంలోని ప్రతీ పౌరుడికి దక్కితే సరిపోదా? ఇంకా ఆయన నోరు విప్పి సమాధానం చెప్పాలా? ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ నిర్ణయాలతో కంపెనీలు దేశానికి క్యూ కట్టాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
Also Read: బాల్యంలోనే తల్లిని కోల్పోయి.. దీపం వెలుగులో చదివి.. మన్మోహన్ సింగ్ సాధించిన ఘనతలు ఇవే!
ప్రభుత్వం సాయం చేస్తుందని చూడకుండా ఎవరి కాళ్ల మీద వాళ్లు నిల్చొనే పరిస్థితిని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే వారికి ఉపాధి కల్పించారు. ప్రపంచంలోనే ఓ అద్భుతమైన పథకం ఇది. ఇలా ఆయన తన పనులు ద్వారా సమాధానం చెప్పుకుంటూ పోయినపుడు ఇంకా నోరు విప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి? మౌనముని అయితే ఏంటీ? మాటల మాంత్రికుడు అయితే ఏంటీ? చివరికిగా దేశ ప్రజలకు మంచి చేయడమే కదా కావాల్సింది.
మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు మంచి చేశారనే మాట దగ్గర కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. దాన్ని కూడా ఇప్పుడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటేజేషన్ అంటూ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వలన దేశ సంపద ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోతుందని వారి ప్రధాన విమర్శ. 140 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించి దేశాన్ని ముందుకు నడిపించడం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. దేశంలోకి ప్రైవేట్ కంపెనీలను స్వాగతించపోతే ఎంతమంది ఉద్యోగాలు దొరుకుతాయి? 1980లో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా దేశంలోని నిరుద్యోగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు దేనికి పనికి రాకుండా పోయేవి. చదువులు పూర్తి చేసుకున్న యువత.. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అని పాటలు పాడుకునే వారు.
1980లో దేశ జనాభా 70 కోట్లు మాత్రమే. ఇవాళ 140 కోట్లు మంది అయ్యారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకొని రాకుంటే ఇవాళ్టి 140 కోట్లమంది పరిస్థితి ఎలా ఉండేది? వేల కొద్ది ప్రైవేట్ కంపెనీలు రావడం వలన కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ కంపెనీలు చుట్టూ టీ స్టార్, జ్యూస్ సెంటర్ అని ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మరికొంతమంది ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. నిజమే ప్రైవేటైజేషన్ వలన ప్రైవేట్ వ్యక్తులు లాభ పడతారనే విమర్శలో కొంత నిజం ఉండొచ్చు. అయితే.. ఐదారు కోట్ల మంది జనాభా ఉండే దేశంలో ప్రభుత్వం అన్ని రకాలుగా పౌరసేవలను అందించగలదు. కానీ, భారత్ లాంటి 140 కోట్లు మంది ఉండే దేశంలో మాత్రం ప్రైవేట్ కంపెనీలు రావడంతోనే అందరికీ పని దొరకుతుంది.
ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంధ్యం వచ్చింది. కానీ, ఆ మాంధ్యానికి భారత్ మాత్రం చలించలేదు. ఎందుకుంటే 1991 తర్వాత మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే దానికి కారణం. ఒకవేళ ఆయన ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే 2008 నాటికి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక, ద్రవ్యోల్భణం పెరిగి ఎన్నో ఆకలి చావులు చూసి ఉండే వాళ్లం. ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు అనే సమయంలో కూడా దేశ జీడీపీ 10.8శాతం నమోదు చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది.