Big Stories

Undi Constituency: ఉండి.. రాజుల్లారా ఉండండి..!

- Advertisement -

టీడీపీలో ఉండి టికెట్ వ్యవహారం కాకరేపుతోంది. పొత్తులు ఖరారు కాకముందు వరకు ఒక లెక్క.. ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు మారింది పార్టీ వ్యవహరం. కూటమి ఏర్పాటుకు ముందు సిట్టింగ్ లకు మళ్ళీ ఛాన్స్ అని చంద్రబాబు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కానీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. చంద్రబాబుని ఇరకాటంలో పడేస్తున్న సీట్లలో ఉండి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. పేరుకు త్రిముఖ పోటీ లాగా కనబడుతున్న అసలు పోటీ మాత్రం ఆ ఇద్దరి మధ్యే అని నియోజకవర్గంలో నేతలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

2024 ఎన్నికల మొదటి జాబితాలో టీడీపీ ఉండి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ప్రకటించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మంతెన సుష్మ సైతం భర్తను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. అయితే నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు అఫిషియల్ గా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రఘురామ కృష్ణరాజును ఈసారి అసెంబ్లీ బరిలో నిలుపుతారంటూ ప్రచారం జోరందుకుంది. దాంతో ఉండి నుంచి ఆయన పోటీ చేస్తారని టాక్ బయటికి రావడంతో రామరాజు వర్గీయులు రోడ్డెక్కారు.

Also Read: కుటుంబం.. అన్నగారి కుటుంబం!

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామరాజుకు సీటు మార్పు తప్పదని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దాంతో తమ నాయకుడికి సీటు కొనసాగించాలి అంటూ.. రామరాజు అనుచరులు భారీ నిరసనలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబుతో ఒకసారి.. హైదరాబాద్ లో మరొకసారి భేటీ అయినప్పటికీ సీటు పంచాయితీ మాత్రం తేలడం లేదు.

ఇక రీసెంట్‌గానే అమలాపురంలో ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని… ఉండి సమస్యని తనకి వదిలేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నేతలను పిలవాల్సి వచ్చిందని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. రామరాజుపై ప్రత్యేక అభిమానం ఉందని రామరాజుకు ఏ విధంగా న్యాయం చెయ్యాలని కొట్టు మిట్టాడుతున్నామని బాబు తెలిపారు. అలానే రఘురామ కృష్ణరాజుకు కూడా ఏం న్యాయం చెయ్యాలని చూస్తున్నామని అన్నారు.

అయితే అమలాపురంలో భేటీ అయినా ఎమ్మెల్యే రామరాజు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడంతో కార్యకర్తల ముందే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. రామరాజు ఆవేదనతో సీటు మార్పు తప్పదని అర్ధం చేసుకున్న రామరాజు అనుచరులు ఆమరణ దీక్షకు సైతం దిగడం… అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు దీక్షను కొనసాగిస్తూ రామరాజుకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం

ఇంత జరుగుతున్న.. ఎంపీ రఘురామకృష్ణరాజు తనకేమీ పట్టనట్టు తన పని తను చూసుకుంటున్నారు. కానీ మధ్యమధ్యలో తాను ఉన్నానంటూ పొలిటికల్ విమర్శలు చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల దీక్షలను ఎవరు పట్టించుకోరని.. ఉండిలో కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటారని పొలిటికల్ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రామరాజు సైతం ఘాటుగా స్పందించారు. కార్యకర్తలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోనని పార్టీ మీద అభిమానంతో దీక్షలు చేస్తుంటే విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ ఘాటుగా స్పందించారు.

మరోపక్క రఘురామకృష్ణరాజు మాత్రం ఇప్పటికీ తనకు నరసాపురం నుండి ఎంపీ టిక్కెట్టు కేటాయిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. రామరాజు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించడం కూడా కొత్త వివాదానికి తెర లేపుతోంది. వైసీపీలోకి ఆహ్వానిస్తాం కానీ టికెట్ ఇవ్వమని వారు చెప్పడంతో సైలెంట్ గా ఉన్నారని విమర్శలు చేశారు. ఒకవేళ ఎంపీ సీటు రాకపోతే ఏది ఏమైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండి పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.

వీరిద్దరి పోరుతోనే తలపట్టుకుంటున్న చంద్రబాబుకు.. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కూడా మరో ఇబ్బందిలా మారారు. 20 సంవత్సరాలు కష్టపడి టీడీపీ కంచుకోటలో కేడర్‌ను బలోపేతం చేసిన తనను… ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. తాను ఏంటో నిరూపించుకుంటాను అంటూ స్వతంత్ర అభ్యర్థిగా ఉండే బరిలో పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రచారం చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఊహించని పరిణామాలతో పార్టీ నష్టపోతుందన్న భావనలో ఉన్నారు పార్టీ అభిమానులు. ఇకనైనా అధిష్టానం చొరవ చూపించి అసంతృప్తులను బుజ్జగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు త్వరలోనే ఈ ఇష్యూకి చరమగీతం పాడాలని ఉండి నియోజకవర్గ టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News