Malla Reddy: స్వేచ్చ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయంగా కొత్త దారిని వెతుకుతున్నారా? కమలం గూటికి చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారా? అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బీఆర్‌ఎస్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం, మరోవైపు బీజేపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మల్లారెడ్డి తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
ఇటీవల మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా బీఆర్‌ఎస్‌తో ఆయనకు ఉన్న దూరంపై చర్చకు దారితీశాయి. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలు లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. కాగా ఆగ్రహంతో ఊగిపోయిన గులాబీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలాఉండగా మరోవైపు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మల్లారెడ్డిపై చేసిన విమర్శలు కూడా చర్చకు దారితీశాయి. పాలు, పూల వ్యాపారాల ద్వారా వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ మల్లారెడ్డి కుటుంబ వ్యవహారాలను ఉద్దేశించి సీఎం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో మల్లారెడ్డి భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు లేవన్న చర్చ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే బీజేపీ వైపు ఆయన దృష్టి సారించారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలాఉండగా ఇండియన్ కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆస్ట్రేలియా వెళ్లారు. అదే సమయంలో మల్లారెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటం, అక్కడ రాంచందర్‌రావుతో కలిసి కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మల్లారెడ్డి బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకునేందుకే ఈ భేటీ జరిగిందా? అనే చర్చకు ఇది కారణమైంది. అయితే, మల్లారెడ్డి బీజేపీలో చేరే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు నేతలు కలిసి కనిపించడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జోరుగా సాగుతోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది.
Also read: కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!
గతంలో పాతబస్తీలో.. బీజేపీ కార్యకర్త ఇంట్లో జరిగిన ఒక వేడుకకు ప్రీతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సైతం కలుసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. దానిపై ఆరా తీయగా ఆమె ఎప్పటి నుంచో కాషాయ పార్టీ లైన్ లోనే ఉందని బీజేపీ శ్రేణులు కూడా స్పష్టంచేశాయి. ఇటీవల కొద్ది నెలల క్రితం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కుటుంబమంతా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
తాజాగా బీఆర్ఎస్ తో ఫ్లెక్సీ వార్, కాంగ్రెస్ లో సీఎం వ్యాఖ్యలతో నో ఎంట్రీ బోర్డు పడిందని, అందుకే ప్రత్యామ్నాయం కోసం కమలం వైపు ఆయన చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే మల్లారెడ్డి బీజేపీలో చేరికపై బీజేపీ లేదా మల్లారెడ్డి నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. కానీ బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారనే ప్రచారం, బీజేపీ నేతలతో ఆయనకు ఉన్న పరిచయాలు, కుటుంబ సభ్యుల రాజకీయ కార్యకలాపాలు.. ఇవన్నీ కలిపి చూస్తే మల్లారెడ్డి తదుపరి అడుగు కమలం గూటికేననే చర్చ ఆసక్తికరంగా మారింది. మరి మల్లారెడ్డి నిజంగానే కాషాయ గూటికి చేరుతారా? లేక ప్రస్తుత పరిణామాలు కేవలం రాజకీయ చర్చలకే పరిమితమవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.
Also read: కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!