Gadala Srinivasa: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో నూ తనదైన ముద్ర వేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన అధినాయకత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.ప్రజా పరిపాలనలో, వైద్యారోగ్య రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి, క్షేత్రస్థాయిలో విశేష ప్రజాదరణ పొందిన డాక్టర్ గడలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ వర్గాల్లోనూ, జనసైనికుల్లోనూ నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు జనసేన అధినాయకత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థాగత నైపుణ్యం, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చింది.
ఇక నుంచి జనసేన పార్టీలో డాక్టర్ గడల శ్రీనివాసరావు కీ రోల్ పోషించనున్నారు. గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు నుంచి రాష్ట్ర స్థాయి నిర్వహణ వరకు బాధ్యతలను సమర్థవంతంగా సమన్వయం చేయడం, పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సంస్థాగత కార్యక్రమాలను సమర్థవంతంగా సక్సెస్ అయ్యేలా మానిటరింగ్ చేయనున్నారు. అంతేగాక క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పార్టీ వేదికగా పోరాటం చేయనున్నారు. మాజీ హెల్త్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థలో విశేష సేవలందించిన డాక్టర్ గడల, ఇప్పుడు రాజకీయ వేదిక ద్వారా తన సేవా దృక్పథాన్ని కొనసాగించనున్నారు.
Also Read: ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?
డాక్టర్ గడల నియామకంతో తెలంగాణ జనసేన సంస్థాగత యంత్రాంగానికి కొత్త ఊపు వచ్చినట్లయింది. ఆయన పరిపాలనా అనుభవం, విషయ పరిజ్ఞానం పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉండటంతోనే ఇటీవల ఖమ్మం, వరంగల్, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్ధిగా పార్టీ ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత యాక్టివ్ చేసేందుకు ఆయనకు పవన్ ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ప్రొఫెసర్లు వంటి మేధావులు, నిపుణులను రాజకీయంలో భాగస్వాములను చేయాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
‘‘నాపై నమ్మకంతో ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్యతను తాను ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేసేందుకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం , అవినీతి రహిత పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తా. ఈ నియామకంలో నాకు సహకరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు, జనసైనికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పదవులు మారవచ్చు, కానీ నా లక్ష్యం మారదు… ప్రజాసేవే నా అంతిమ లక్ష్యం . జనసేన సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ, తెలంగాణ అంతటా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు లీడర్లు, కార్యకర్తలతో కలిసి అంకితభావంతో పనిచేస్తా”అని డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు.
Also read: ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!