Sukhoi Deal: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పటికే శక్తిమంతమైన రఫేల్, నమ్మకదిగిన సుఖోయ్-30, ఇండియా మేడ్ తేజస్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలున్నాయ్. అయినాసరే, రష్యాకు చెందిన అత్యంత అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్ సుఖోయ్-57 వైపు భారత్ మొగ్గు చూపుతుందనే వార్తలు.. రక్షణ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. భారత్ దగ్గర రఫేల్ లాంటి అద్భుతమైన 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది. కానీ.. ఇది పూర్తి స్థాయి స్టెల్త్ జెట్ కాదు. చైనా ఇప్పటికే జే-20 లాంటి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని సరిహద్దుల్లో మోహరించింది. అందువల్ల.. ఇండియా దగ్గర కూడా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే.. రష్యా సుఖోయ్-57పై ఫోకస్ చేసింది ఇండియా. ఇది.. ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం. దీని డిజైన్.. శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయేలా ఉంటుంది.
ఆధునిక యుద్ధాల్లో శత్రువు కంటికి కనిపించకుండా దాడి చేయడం అత్యంత కీలకం. రఫేల్ దగ్గర లేని పూర్తి స్థాయి స్టెల్త్ టెక్నాలజీ, కెపాసిటీ.. సుఖోయ్-57లో ఉంటుంది. అందుకే.. భారత్ దానివైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి వీటని కొనుగోలు చేసేందుకు భారత్ సీక్రెట్ డీల్ కుదుర్చుకుందనే వార్తలు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్స్ అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని.. రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్‌బోరోన్ ఎక్స్‌పోర్ట్ సీఈవో అలెగ్జాండర్ మిఖయేవ్ ఇటీవలే తెలిపారు. భారత్-రష్యా మధ్య ఆ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్లు.. ఇటీవలే మిలటరీ వాచ్ అనే మ్యాగజీన్ ఓ కథనాన్ని ప్రచురించింది.
యుద్ధవిమానాల కొరతతో భారత వాయుసేన సతమతమవుతున్న క్రమంలో.. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ విమానాల సోర్స్ కోడ్‌ను భారత్‌తో పంచుకునేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపట్లేదు. బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం మిసైళ్లని.. రఫేల్‌తో లింక్ చేసేందుకు అవసరమైన మేరకైనా కోడ్‌ను తమకు అందించాలని భారత్ కోరుతోంది. దీనికి కూడా ఫ్రాన్స్ ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా.. భారత్‌కు ఈ విమానాల సప్లై మొదలవడానికి మరో నాలుగేళ్లు పడుతుంది. అయితే, ఇప్పటికే ఐఏఎఫ్ అమ్ములపొదిలో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది.
Also Read: జీహెచ్ఎంసీలో కమీషనర్ వింత పాలన.. రోజు ఎంక్వైరీ.. కానీ ఓక్క భాద్యుడిపైనా వేటు పడదేం..?
రఫేల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్‌కి చెందినవి కావడంతో.. అవి ఎన్ని కొన్నా ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం లేని లోటు తీరదు. ఈ క్రమంలో.. ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను ఎలాగైనా వాయుసేనలో చేర్చుకోవాలని భారత్ చూస్తోంది. భారత్ సొంతంగా డెవలప్ చేస్తున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఆమ్కా 2035 తర్వాత గానీ అందుబాటులోకి రాదు. మరోవైపు.. అమెరికా తమ ఎఫ్-35 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇండియాకు ఇంట్రస్ట్ లేదు. ఎందుకంటే.. అమెరికా వాటి సోర్స్ కోడ్‌ను మనతో ఎంతమాత్రం పంచుకోదు. పైగా.. వాటి వినియోగంపై అనేక కండీషన్లు పెడుతుంది. ఈ పరిస్థితుల్లో.. రష్యా మాత్రమే సుఖోయ్-57 పూర్తి సోర్స్ కోడ్‌ని ఇండియాకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
సుఖోయ్-57 స్టెల్త్ యుద్ధ విమానాలను పెద్ద సంఖ్యలో కొంటే.. భారత్‌లోనే వాటిని తయారుచేసేందుకు సహకరిస్తామని కూడా రష్యా హామీ చెప్పింది. ఇప్పటికే.. మహరాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానాల్ని భారత్ తయారుచేస్తోంది. ఆ యూనిట్‌లోనే సుఖోయ్-57 ఫైటర్ జెట్స్‌ని కూడా తయారుచేయొచ్చని, రెండు విమానాల్లో కొన్ని స్పేర్ పార్ట్స్ సేమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే.. సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుకు.. భారత్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్ గనక వాటిని కొనుగోలు చేస్తే స్వదేశీ మిసైళ్లతో పాటు దేశీయంగా తయారుచేసిన విరూపాక్ష రాడార్‌ని కూడా దాంతో లింక్ చేయొచ్చు. వీటన్నింటి వల్లే.. భారత్ సీక్రెడ్ డీల్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిని, బహిరంగంగా ప్రకటిస్తే, అమెరికా నుంచి ప్రెజర్ పెరగొచ్చనే కారణంతోనే.. రహస్యంగా ఉంచారనే చర్చ జరుగుతోంది.
Also Read: మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
ఇక.. మన డీఆర్‌డీవో డెవలప్ చేస్తున్న తేజస్ మార్క్-2 యుద్ధ విమానం కూడా ఫస్ట్ ఫ్లైట్‌కు దాదాపు సిద్ధమైంది. ముందుగా.. టాక్సీ ట్రయల్స్ నిర్వహించి.. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లైట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌డీవోనే అభివృద్ధి చేసిన 4.5 జనరేషన్ యుద్ధవిమానాలైన తేజస్ ఎంకే-1ఏలు కూడా ఐదారు రెడీగా ఉన్నాయి. కానీ, వాటిని ఇంకా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చలేదు. ఆ యుద్ధ విమానాలతో పోలిస్తే.. తేజస్ ఎంకే2 జెట్స్ మరింత శక్తిమంతమైనవి. వీటి ఇంజిన్, ఇంధన సామర్థ్యం, రేంజ్, ఫ్రంటల్ స్టెల్త్ కెపాసిటీ చాలా ఎక్కువ. చాలా ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఇందులో.. అమెరికా ఎఫ్-18 యుద్ధవిమానాల్లో వాడే ఎఫ్-414 ఇంజన్లు ఉన్నాయి.
రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో.. తేజస్ మార్క్ 2 రఫేల్ కంటే మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ యుద్ధ విమానాలు హిమాలయాల్లో బాగా ఉపయోగపడతాయి. ఇందులో వాడే ఉత్తమ్ రాడార్, గాలియం నైట్రైడ్ రాడార్ రఫేల్ రాడార్ కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది. శత్రుదేశాలు జామింగ్ చేయకుండా తట్టుకొని నిలబడగలదు. రఫేల్‌తో పోలిస్తే.. ఎక్కువ ఎత్తులోనూ కచ్చితత్వంలో పనిచేస్తుంది. రఫేల్ 52 వేల అడుగుల ఎత్తులో పనిచేస్తే.. తేజస్ ఎంకే2 56 వేల అడుగుల ఎత్తులోనూ పనిచేస్తుంది. సుఖోయ్-57, తేజస్-మార్క్ 2 గనక భారత వాయుసేనలో చేరితే.. భారత్ మరింత శత్రుదుర్భేద్యంగా తయారవుతుంది.
Storey By: Anup Big Tv
Also Read: హూజూరాబాద్‌లో హస్తం హవా.. కో ఆఫ్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..!