చంద్రబాబు ఏం చేసినా అంతే. ట్రెండ్ ఫాలో అవుతాడు. దానికి అనుగుణంగా తనకు తాను అప్‌గ్రేడ్ చేసుకుని కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు కూడా. చిత్ర విచిత్ర పథకాలకు రూపకల్పన చేసి ఏదో విధంగా ప్రజలతో మమేకమయ్యేందుకు తహతహలాడుతాడు.అందులో సక్సెసవుతాడు కూడా.
ఇప్పుడు ఆయన ఎత్తుకున్న కొత్త పథకం .. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కు జీతాలు ఇవ్వడం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు అధికారికంగా సోషల్ మీడియాను వాడుకోవడం. సబ్ స్క్రైబర్లు, వ్యూస్‌ల ఆధారంగా వారికి జీతాలను కూడా డిసైడ్ చేసి మరీ ఉద్యోగాలు కల్పించడం ఆయనకే చెల్లింది. ఇదిప్పుడు వివాదమవుతుంది.
కానీ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. అది అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా.. ఈ సోషల్ మీడియానే ప్రధాన ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇక్కడ బాబు అధికారికంగా వీరిని ఎంపిక చేసుకుని మరీ జీతాలిస్తుంటే.. అన్ని చోట్ల అనధికారికంగా జీతాలు ఇస్తూ పెంచి పోషిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు.
అయితే బాబు దీన్ని బాహాటంగా చెప్పే సరికి, ప్రభుత్వ సొమ్ము వాడుతున్నాడనే విమర్శ ఒకటి బలంగా బయటకు వస్తోంది. అంతకు ముందు టీడీపీకి సోషల్ మీడియా లేదా? అంటే .. బలమైన పునాదితో ఉంది. దానికి నెలకు కోట్లకు కోట్లు వెచ్చించారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు అధికారికంగానే వీరిని ఎంపిక చేయడమే వివాదమైంది.
ఇక్కడ చర్చించాల్సిన అంశం… బాబు- సోషల్ మీడియా అనేది కాదు. అసలు పాలకులను సోషల్ మీడియానే నడిపిస్తుందా? అనే ట్రెండ్ కొనసాగడం. అంటే కుక్క తోకను ఆడించాలి. కానీ తోకనే కుక్కను ఆడించే స్థాయికి ఇది చేరుకున్నది. నేతలు కూడా దీనికే లొంగిపోతున్నారు. కనెక్టవుతున్నారు కూడా.
మెయిన్ మీడియను లైట్‌గానే తీసుకుంటున్నారు. ప్రింట్ మీడియా శకం దాదాపుగా క్లోజ్ అయ్యే స్థితికి వచ్చింది. దీని స్థానంలో డిజిటల్ పేపర్ల యుగం నడుస్తోంది. సోషల్ మీడియాను విరివిగా వాడుకునే డిజిటల్, టీవీ చానెళ్లే జనాల్లో సజీవంగా ఉంటున్నాయి. దీంట్లో వెనుకున్నవారు వెనుకబడిపోతున్నారు.
ఏపీ రాజకీయాల విషయానికొస్తే.. సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ ఏం తక్కువ లేవు. టీడీపీ ఓ రెండు మెట్లపైనే ఉంది. వైసీపీ ఓడిన తరువాత .. ఆ పార్టీ సోషల్ మీడియాపై అధికార పక్షం దాడి మొదలైంది. కేసులు, అరెస్టులు, జైళ్లు.. అకౌంట్స్ బ్లాక్ చేయడంతో ప్రతిపక్షం ప్రభావం తగ్గింది సోషల్ మీడియాలో.
టీడీపీ మరింతగా బలం పెంచుకుంది. ఇది సరిపోదంటూ ఇప్పుడు వీరికి అధికారిక ట్యాగ్ లైన్ తగిలిస్తున్నాడు బాబు. ఇక్కడే కూటమి సర్కార్ విమర్శలనెదుర్కుంటున్నది. తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రతిపక్షం బీఆరెస్ బలమైన సోషల్ మీడియా టీమ్‌ను నడిపిస్తున్నది. టీ న్యూస్, నమస్తే తెలంగాణ సొంత మీడియా ఉన్నా.. నెలకు కోట్లకు కోట్లు వెచ్చించి కేటీఆర్ ఈ టీమ్‌ను రన్ చేపిస్తున్నాడని అందరికీ తెలుసు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ విషయంలో పుంజుకున్నది. నెలకు కోట్ల రూపాయలు వెచ్చింది.. సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ వస్తోంది.
బీజేపీకి స్వచ్చంధంగా ఈ టీమ్ నడుస్తోంది. కొంత సొమ్మును కూడా వెచ్చిస్తున్నారు. అధికారపక్షానికి మెయిన్ మీడియా బాకా ఊదడం సహజం. కానీ ఆ మీడియా తమను గెలుపు తీరాలను చేర్చుతుందనే నమ్మకం లేదు పాలకులకు. అందుకే ఇలా సోషల్ మీడియానే ప్రధానంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.
కానీ ఈ వేటలో పడి జనం నాడిని తెలుసుకునే ప్రయత్నంలో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా విఫలమవుతున్నాయనే చెప్పాలి. జనాన్ని ప్రభావం చేయాలనే డిసైడ్ అయ్యాయి.. అందుకే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లపై ఆధారపడుతున్నాయి. అంటే కుక్క తోకను ఆడించడం లేదు.. తోకే కుక్కను ఆడిస్తోందన్నమాట!