Apple Pay India: భారతదేశంలో ఉన్న ఐఫోన్ ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వాడుతున్న వారి కోసం యాపిల్ సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple Pay సేవలను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పిన్ నంబర్లు టైప్ చేసే పనిలేకుండా, ఓటీపీల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా చాలా సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు. మన రోజువారీ జీవితంలో క్యాష్‌లెస్‌గా షాపింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్ వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నవారు తమ కార్డ్‌లను యాపిల్ పేకి అనుసంధానించుకోవచ్చు. దీని ద్వారా సూపర్ మార్కెట్లు, షాపుల్లో ఉండే పీఓఎస్ మిషన్ల దగ్గర మీ ఫోన్ లేదా వాచ్‌ను జస్ట్ ట్యాప్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. అటు యాప్‌లలో, ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు కూడా ప్రతిసారీ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిన పనిలేకుండా ఒక్క క్లిక్‌తో చెల్లింపులు చేయవచ్చు. త్వరలోనే మ్యాక్ డివైజ్‌లలోకి, ఇతర బ్యాంక్ కార్డ్‌లకు కూడా ఈ సదుపాయం రానుంది.
Also Read: డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!
ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో అందరికీ వచ్చే ముఖ్యమైన అనుమానం సెక్యూరిటీ. యాపిల్ సంస్థ ఈ విషయంలో పూర్తి భరోసా ఇస్తోంది. Apple Pay ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు మీ అసలు కార్డ్ నంబర్ మీ ఫోన్‌లో కానీ, యాపిల్ సర్వర్లలో కానీ ఎక్కడా సేవ్ కాదు. మెర్చంట్లకు కూడా మీ కార్డు వివరాలు వెళ్లవు. మీ పరికరంలో ఉండే ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ చిప్ ద్వారా ఈ లావాదేవీలు చాలా సురక్షితంగా జరుగుతాయి.
Apple Payను మన డివైజ్‌కు కనెక్ట్ చేయడం చాలా తేలిక. యాక్సిస్ బ్యాంక్ యాప్ ద్వారా నేరుగా కార్డును యాపిల్ వ్యాలెట్‌కి యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫోన్‌లోని వ్యాలెట్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ గుర్తుపై టాప్ చేసి కూడా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. కార్డు యాడ్ అయ్యాక.. షాపుల్లో సైడ్ బటన్ డబుల్ క్లిక్ చేసి ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీతో అథెంటికేషన్ పూర్తి చేసి, రీడర్ దగ్గర ఫోన్ ఉంచితే క్షణాల్లో పేమెంట్ అయిపోతుంది.
మీరు యాపిల్ పే ద్వారా పేమెంట్లు చేసినప్పటికీ మీ క్రెడిట్ కార్డుపై వచ్చే క్యాష్‌బ్యాక్‌లు, పాయింట్లు, ఇతర ఆఫర్లు యథావిధిగా అందుతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది వ్యాపారులు ఈ పేమెంట్లను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా రోజూవారీ లావాదేవీలను వేగంగా పూర్తి చేయడానికి యాపిల్ పే ఒక మంచి డిజిటల్ ఆప్షన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Also Read: ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!