Golden Bonam Offering: ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో సంబురం మొదలౌనట్లే. ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే తెలంగాణలో బోనాల జాతర ధూందాంగా జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డప్పు సప్పుళ్లు, డిల్లెంబల్లెం మోతలు, కళాకారులతో ఆటపాటలతో గల్లీ గల్లీ మార్మోగేందుకు అంతా సర్వ సిద్ధమైంది.
బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతోంది. అన్ని శాఖల సమన్వయంతో గోల్కొండ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఎల్లుండి నుంచి జరగబోయే గోల్కొండ బోనాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పించబోతున్నారు. గోల్కొండ వృత్తి సంఘం ఉపాధ్యక్షుడు శ్రీకాంతాచారి. ప్రతి ఏడాది శ్రీకాంతాచారి ఇంటి నుంచే మహంకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా వెళ్తుంటాయి. ఈ ఏడాది విగ్రహాల ఊరేగింపుతో పాటు అమ్మవార్లకు బంగారు బోనం, బంగారు పుస్తెలతాడు సమర్పించబోతున్నారు. అమ్మవారు తనకు కలలో కనిపించి బంగారు బోనం సమర్పించాలని కోరారని.. అందుకే ఈ ఏడాది మొక్కు చెల్లించుకుంటున్నానని చెబుతున్నారు.
తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని.. మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని ఆరోగ్యంగా, సుఖ శాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని ఆ అమ్మవార్లను కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని పలు ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు.
బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమౌతోంది. మరో మూడ్రోజుల్లోనే బోనాల పండగ సందడి మొదలు కానుంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. 28 కుల వృత్తులకు చెందినవారు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాలకు సంబంధించిన కుండల తయారీని మోహదీపట్నంలోని కుమ్మరివాడలోని దామ కుటుంబాని ఇచ్చింది గోల్కండ ఉత్సవ సమితి. అమ్మవారికి సమర్పించే బోనం కుండల తయారీ ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం.
Also Read: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?
మట్టి కుండల తయారీ అందరి తెలుసు. కానీ బోనం తయారుచేసే మట్టి కుండలు విభిన్న సైజుల్లో ఉంటాయి. ఇందులో ప్రధాన నైవేద్యం పెట్టే కుండ ఒకటి, దానిపైన చిన్న బుడ్డి, దాని మీద దీపం పెట్టే ముంత ఉంటాయి. వీటన్నింటిని కలిపి సెట్‌గా అందిస్తుంటారు తయారీదారులు. కుండలు తయారైన తర్వాత వాటిని ఆరబెట్టి, బట్టీలలో కాలుస్తారు. ఆ తర్వాత సున్నం పూసి, రంగులను అద్దుతారు.