Kavitha Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక దశ మొదలుకాబోతోంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి.. సొంతంగా రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీతో జనంలోకి రాబోతున్నారు. ఇప్పటికే.. తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ మొదలైంది. కవిత పార్టీ పేరు ఏంటి? జెండా ఎలా ఉండబోతోంది? ఎజెండాలో ఏమేం ఉంటాయ్? ఆమె పార్టీ సిద్ధాంతమేంటి? కల్వకుంట్ల కవితకు ఉన్న రాజకీయ వ్యూహమేంటి? లాంటి చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే.. కవిత పార్టీ పేరు ఇలా ఉండొచ్చంటూ.. కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సర్వోదయ తెలంగాణ అనే పేరు ఖరారైనట్లు సమాచారం అందుతోంది. అదేవిధంగా, తెలంగాణ ప్రజా జాగృతి అని, తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే.. తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేరుతో పార్టీ ఆవిర్భావ వేదిక దగ్గర స్వాగత తోరణాలు కూడా వెలిశాయ్. దాంతో.. కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ పేరు ఏమై ఉంటుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, తెలంగాణ జాగృతి సారథిగా, నిజామాబాద్ మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా.. కవితకు ఇప్పటికే పుల్ పొలిటికల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ శక్తిగా అవతరించబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత.. ఆమె ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కొత్త బాటని ఎంచుకున్నారు. ఇందుకోసం తనకు తానే ఓ రాజకీయ వేదికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం.. పక్కా ప్రణాళికతో పాటు బలమైన ఎజెండాను కూడా తయారుచేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆవిర్భావ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఉన్న నినాదాలు చూస్తే.. కవిత పార్టీ ఎజెండా ఎలా ఉంటుందో కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. నవశకానికి నాంది పలుకుదాం.. తెలంగాణలో సామాజిక న్యాయానికి బాటలు వేద్దామంటూ పోస్టర్లు వెలిశాయ్.
అమరుల ఆశయ సాధన కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం.. తెలంగాణ గొంతుకగా వస్తున్న కొత్త రాజకీయ శక్తి.. కల్వకుంట్ల కవిత అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. మన ఇంటి పార్టీ, మన అస్తిత్వం అంటూ భావోద్వేగపూరితమైన స్లోగన్లు కూడా కనిపించాయ్. రైతన్నలకు అండగా నిలుద్దాం.. కులవృత్తులకు భరోసా కల్పిద్దామంటూ.. అన్ని వర్గాలను టచ్ చేసేలా.. కవిత ఎజెండా సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మన కవితక్క, మన తెలంగాణ అంటూ.. జనానికి దగ్గరయ్యేలా ఇంకొన్ని నినాదాలు కనిపిస్తున్నాయ్. ఇవన్నీ చూశాక.. కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ జెండా ఎలా ఉంటుందనే దానిపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
Also Read: కవిత కొత్త పార్టీ అజెండా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?
కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ అనే పేరు పట్ల గతంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పేరుకు దగ్గరగా ఉండేలా.. తెలంగాణ జన జాగృతి లాంటి పేర్లను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కవిత పార్టీ జెండాలో గులాబీ రంగు ఉంటుందా? ఉండదా? అనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. అంతేకాదు, రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పచ్చదనం, గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాలను సూచించే తెలుపు రంగుల మేళవింపు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. జెండా మధ్యలో తెలంగాణ తల్లి ఉంటుందా? బతుకమ్మ ఉంటుందా? తెలంగాణని ప్రతిబింబించే మరేదైనా చిహ్నం ఉంటుందా? అనేది కూడా ఆసక్తి రేపుతోంది. పార్టీ జెండాను మించి.. ఎజెండాపై ఇంకా ఎక్కువ చర్చ జరుగుతోంది.
కల్వకుంట్ల కవిత పార్టీ ఎవరి కోసం? అనే క్వశ్చన్ ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అయితే, కవిత.. తన పార్టీ ఎజెండాను ప్రధానంగా మూడు వర్గాల చుట్టూ తిప్పుతున్నారు. మొదటిది.. సామాజిక తెలంగాణ! గాంధీ సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు రావాలనే సిద్ధాంతం. ముఖ్యంగా.. నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేలా, యువతను ఆకట్టుకునేలా కవిత పార్టీ పాలసీలు ఉంటాయనే చర్చ ఉంది. బీసీ వర్గాలను ఆకట్టుకునేలా.. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటికే కవిత పోరాడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇక, మహిళా సాధికారతకు కూడా కవిత ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళా భద్రత.. ప్రధాన అస్త్రాలయ్యే అవకాశాలున్నాయి.
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ వస్తే.. ప్రభావం చూపుతుందా? జనంపై ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు? అనే క్వశ్చన్స్ సహజంగానే తలెత్తుతాయ్. అలాంటిది.. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే.. ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. నిజానికి.. ఈ తెలంగాణ గడ్డ మీద ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎప్పుడూ ఎక్కువే! అయితే, ఇప్పటికే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి బలమైన శక్తులు ఉన్న తరుణంలో.. కవిత పార్టీ ఏ మేరకు జనాలను ఆకర్షిస్తుందనేది కూడా ఇంట్రస్టింగ్ ఎలిమెంటే. అయితే, రాష్ట్రంలో ఆమెకు ఉన్న గుర్తింపు, తెలంగాణ జాగృతి ద్వారా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న క్యాడర్.. ఆమెకు బలంగా కనిపిస్తున్నాయ్. అయితే, కేసీఆర్ కాంపౌండ్ లీడర్ అనే ముద్రని చెరిపేసుకొని.. స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగడమే ఇప్పుడు కవిత ముందున్న అతిపెద్ద సవాల్.
Also Read: రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే 2500 పోస్టులకు నోటిఫికేషన్
కల్వకుంట్ల కవిత ఎత్తుకున్న సర్వోదయ తెలంగాణ, సంపూర్ణ వికాసం లాంటివి.. కేవలం ఓ నినాదమా? లేక రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలను శాసించబోయే బలమైన అస్త్రమా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఎందుకంటే.. ఓ పార్టీ మనుగడకు.. ఐడియాలజీ ఆక్సిజన్ అయితే, ఆ సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకెళ్లే నాయకత్వం.. వెన్నెముక లాంటిది. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో.. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు హోరు పెరిగింది. ఈ పరిస్థితుల్లో.. కవిత సర్వోదయ నినాదాన్ని భుజానికెత్తుకోవడం వెనుక ఓ లోతైన వ్యూహం కనిపిస్తోంది. కులమతాలకు అతీతంగా, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆవిడ పార్టీ పనిచేయబోతుందనే చర్చ జరుగుతోంది. దూకుడుగా ఉంటూనే, సిద్ధాంతపరమైన పరిణితిని ప్రదర్శించడం ద్వారా న్యూట్రల్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. విద్వేష, విమర్శల రాజకీయాల మధ్య, సర్వోదయ అనే సాఫ్ట్ స్లోగన్.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ జాగృతితో.. సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన చరిత్ర కవితది! బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె పోషించిన పాత్ర.. ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డ అనే ముద్రను వేసింది. ఈ పునాదుల మీదే.. కవిత తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకోబోతున్నారు. అందరికీ సమాన అవకాశాలు దక్కాలనే లెక్కలతో.. జనంలోకి వెళ్తున్నారు. పైగా.. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమెకు కావాల్సినంత రాజకీయ అనుభవం ఉంది. ఇష్యూ ఎలాంటిదైనా.. వెనకడుగు వేయకుండా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆమెది డిఫరెంట్ స్టైల్. వీటికి మించి.. మహిళా లోకంతో ఆమెకు ఉన్న అనుబంధం.. ఆమె కొత్త పార్టీకి బిగ్ ప్లస్ పాయింట్. అయితే, జాతీయ పార్టీల ప్రభావం, ప్రత్యర్థుల ఎత్తుగడలను తట్టుకొని ఎంతమేరకు నిలబడగలుగుతారన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్.
కవిత తన పార్టీనే కాదు పంథాను కూడా మార్చుకున్నారు. జనం సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనే కాదు క్షేత్రస్థాయిలో జనంతో మమేకమవడంపైనా కవిత ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వాళ్లందరినీ ఒక తాటిపైకి తీసుకురాగలిగితే.. కవిత ఓ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. కేసీఆర్ కూతురిగా గుర్తింపు ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవడంలో ఆమె అడుగులు వేస్తున్నారు. ఉద్యమ కాలం నాటి తెగింపు, పరిణితి చెందిన రాజకీయ వ్యూహకర్తగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను శాసించే కీలక శక్తుల్లో కల్వకుంట్ల కవిత పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో మరో డౌట్ లేదు. సరికొత్త రాజకీయ శక్తిగా ఆమె ప్రయాణం కేవలం.. తన పార్టీ భవిష్యత్తునే కాదు, రాష్ట్ర రాజకీయ దిశను కూడా మార్చే అవకాశం ఉందని తలపండిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: సీఎం చంద్రబాబు హామీపై దుష్ప్రచారం.. ఖండించిన మంత్రి లోకేష్, చర్యలు తప్పవని హెచ్చరిక
రాజకీయాల్లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే, అన్నింటినీ తట్టుకొని నిలబడమే తత్వమే నాయకత్వంపై జనంలో నమ్మకం కలిగేలా చేస్తుంది. కవిత చూపిస్తున్న ఈ దూకుడు.. ఆమె ఎంచుకునే సిద్ధాంతం, ఆమె ఎజెండా అన్నీ పక్కాగా సెట్ అయితే.. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్‌లో.. కచ్చితంగా ఆమె పేరు రీసౌండ్‌లో వినిపిస్తుంది. ఈ క్రమంలో.. కవిత ప్రకటించబోయే పార్టీ.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తుందా? మిగతా పార్టీలకు ఆల్టర్నేట్‌గా ఎదుగుతుందా? లేక.. కేవలం ఓ ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందా? అనేది.. భవిష్యత్‌లో తేలిపోతుంది. కానీ.. కల్వకుంట్ల కవిత పార్టీతో.. తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యే కొత్త దశ.. కచ్చితంగా ఊహించని పోటీకి దారితీస్తుందనేది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం.
Storey By: Appa Rao Big Tv