Pakistan: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో చాలా దేశాలు ఆచితూచీగా వ్యవహరిస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియక మౌనంగా ఉంటున్నాయి. కానీ ఈ విషయంలో అడ్డంగా బుక్కైంది పాకిస్థాన్. స్వదేశంలో వివిధ రంగాల ప్రముఖుల నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి.
ఏప్రిల్‌లో పెహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆపరేషన సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను నేల మట్టం చేసింది భారత సైన్యం. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చిన్నపాటి వార్ సాగింది. ఈ సమయంలో ట్రంప్ సర్కార్ దౌత్యంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని భావించింది దాయాది దేశం.
ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను అమెరికా వెళ్లడం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భోజనానికి వైట్‌హౌస్‌కు ఆహ్వానించడం చకచకా జరిగిపోయింది. ఈ క్రమంలో శనివారం 2026 ఏడాది నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అధికారికంగా సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఆపై ప్రకటన చేసింది.
శనివారం ఉదయం ట్రంప్‌కు మద్దతుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అదేరోజు రాత్రికి సీన్ మారిపోయింది. ఇరాన్‌లోని మూడు అణుస్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్‌లపై అమెరికా దాడులు చేసింది. ఆయా స్థావరాలు డ్యామేజ్ అయినట్టు ప్రకటించుకుంది. ఆదేశం చేసిన పనిని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆపై విరుచుకుపడింది.
ALSO READ: చైనా మిలటరీ చేతికి కొత్త ఆయుధం దోమ, త్వరలో సైన్యం చేతికి
దీనిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇరాన్‌పై అమెరికా దాడి అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని తెలిపింది. అమెరికా నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉద్రిక్తతలు పెరిగితే ఈ ప్రాంతం బయట తీవ్రప్రభావాలు ఉంటాయని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పకనే చెప్పింది. తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు ఇరాన్‌కు ఉందని తాము పునరుద్ఘాటిస్తున్నామని తెలియజేసింది.
షెహబాజ్ షరీఫ్ సర్కార్ వ్యవహారశైలిపై స్వదేశంలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఆదేశ ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. ఇరాన్‌కి తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. ఈ విషయంలో షెహబాజ్ సర్కార్ వైఖరి సిగ్గుపడేలా ఉందని మండిపడుతున్నాయి.
దాడులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి శాంతి దూత ఎలా అవుతారని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును ప్రతిపాదించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో #NobelForWar, #TrumpNominationShame వంటి పేరుతో సోషల్‌మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు బాగా ట్రెండ్ అయ్యాయి.