Budameru Flood: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తిన వరద బుడమేరు కాలువలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతానికి నందివాడ మండలంలో బుడమేరు ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పుట్టగుంట వంతెన వద్ద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
పెనమలూరులోని ఉప్పులూరు-కేసరపల్లి మధ్య బుడమేరు కాలువ పొంగిపొర్లుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉప్పులూరు నుంచి కేసరపల్లి వైపు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచనలు చేశారు.
పుట్టగుంట వంతెనపై సుమారు అడుగు ఎత్తులో నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వరద ప్రవాహానికి అడ్డుగా భారీగా గుర్రపుడెక్క పేరుకుపోవడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రొక్లైనర్ల సాయంతో గుర్రపుడెక్కను తొలగిస్తూ ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని కొన్ని పొలాలు నీట మునిగాయి. మరోవైపు ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు భరోసా కల్పిస్తూ అవసరమైన సూచనలు అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా గుడివాడ–హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also read: బంగారంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్.. చివరికి షాకిచ్చిన దొంగలు?