Miss World 2025: తెలంగాణ జరూర్ ఆనా.. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే.. ఇవే స్లోగన్స్ తో 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఈనెల 10 నుంచి 31 దాకా జరిగే దశల వారీగా జరిగే పోటీలతో భారీ ఇన్వెస్ట్ మెంట్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారతీయ, తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతాలు కూడా పలుకుతున్నారు. ఒక్క ఈవెంట్.. మల్టీ బెనిఫిట్స్.. మిస్ వరల్డ్ పోటీలు ఎలా ఉండబోతున్నాయ?
సింగిల్ ఈవెంట్.. 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్
సింగిల్ ఈవెంట్.. 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్.. ఇదే తెలంగాణ సర్కార్ ప్లానింగ్. అవును 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేందుకు సిద్ధమైంది. సిటీలో సందడి షురువైపోయింది. విదేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించడం కాదు… ఇందుకోసం పెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు.. వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలెట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉండేలా చేయడం కీలకం.
ఈనెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ
అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. తొలిసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిస్థాయిలో క్యాచ్ చేసేలా ప్లానింగ్ రెడీ అయింది. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు కనీవినీ ఎరుగని విధంగా జరిపేలా డిజైన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉండబోతోంది. అటు అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.
ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు
ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం వస్తున్న సుందరీమణులకు టూరిజంశాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సెలబ్రిటీల సందడితో శంషాబాద్ పరిసరాల్లో జోష్ పెరిగింది. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతే కాదు.. టూరిజం శాఖ తరఫున పోటీదారులకు అందించేందుకు ఫుల్ డిటైల్స్ ఉన్న బుక్‌లెట్‌ను రెడీ చేస్తున్నారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాల్లో బ్యూటిఫికేషన్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. నగర అభివృద్ధిని అతిథులకు చూపిస్తారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో వివిధ దేశాలతో హైదరాబాద్‌కు ఉన్న కనెక్టివిటీని వివరించనున్నారు.
MISS WORLD-2025 ఏర్పాట్లపై సీఎం సూచనలు
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 29న సీఎం సమీక్ష కూడా నిర్వహించారు. ఓవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోటీల్లో పాల్గొనే వారికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మే 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై సీఎం సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతిథుల కోసం ఎయిర్‌పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో టైట్ సెక్యూరిటీ పెట్టాలని సీఎం పోలీసులకు సూచించారు. మొత్తం 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈనెల 13న హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లను కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉంచకుండా.. షెడ్యూల్ ప్రకారం వారిని తెలంగాణలోని అన్ని టూరిజం స్పాట్లకు తిప్పుతారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కంటెస్టెంట్లను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్తారు. మే 12న హైదరాబాద్ చారిత్రక, వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ఏరియాలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అదే రోజు నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలిపేలా ఆధ్యాత్మిక పర్యటనకు తీసుకెళ్తారు. ఈనెల 13న హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ తీసుకెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంది.
చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్
ఇక మే 14న వరంగల్ లోని థౌజండ్ పిల్లర్ టెంపుల్, వరంగల్ పోర్ట్ కు తీసుకెళ్తారు. అదే రోజు రామప్ప ఆలయ సందర్శన ఉంటుంది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రత్యేకతలను వివరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన అరుదైన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న యాదగిరి గుట్ట ఆలయ సందర్శన ఉండనుంది. డివోషనల్ టూరిజంలో భాగంగా ఈ చోట్లకు తీసుకెళ్తారు. అదే రోజు గ్రూప్ 2లోని కంటెస్టెంట్లను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడ చేనేత తయారీ చూపించడం, చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే క్రమంలో ఈ షో ఏర్పాటు చేశారు.
16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన
మే 16న వివిధ దేశాల నుండి చికిత్సల కోసం వచ్చే వారిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం ప్రోగ్రామ్ రెడీ చేశారు. హైదరాబాద్ AIG హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు హాజరవుతారు. తక్కువ ధరల్లోనే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే పరిస్థితిని వివరిస్తారు. 16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన, 17న రామోజీ ఫిలిం సిటీ సందర్శన, 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సేఫ్టీ టూరిజంపై డెమో ఇస్తారు. జనం భద్రతకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరిస్తారు. అదే రోజు సచివాలయం తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ చరిత్ర గురించి వివరించనున్నారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. చివరగా ఈనెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించడంతో ఈ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా ముగిస్తారు.