BIG TV LIVE Originals: పాకిస్తాన్ అనేక సమస్యలతో అతలాకుతలం అవుతోంది. పలు దేశాలతో భౌగోళిక సమస్యలు, ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు, బోలెడు ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. విస్తృతంగా వ్యాపించే వ్యాధుల కారణంగా పాకిస్తాన్ అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటుంది. హెపటైటిస్, క్షయ, డెంగ్యూ లాంటి అంటు వ్యాధులు, డయాబెటిస్, గుండె జబ్బులతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పేలవమైన పారిశుధ్యం, పేదరికం, బలహీనమైన ఆరోగ్య సంరక్షణ కారణంగా పాకిస్తాన్ లో రోగాలు విజృంభిస్తున్నాయి.
అంటు వ్యాధుల విస్తరణకు కారణాలు
పాకిస్తాన్ లో హెపటైటిస్ A, B, C లక్షలాది మందిని వేధిస్తున్నాయి. కలుషితమైన నీరు, ఆహారం కారణంగా హెపటైటిస్ A, E వ్యాప్తి చెందుతున్నాయి. వాడిన సిరంజిలనే మళ్లీ వాడటం లాంటి అసురక్షిత వైద్య పద్దతుల కారణంగ హెపటైటిస్ B, C విజృంభిస్తున్నాయి. క్షయవ్యాధి (TB) పాకిస్తాన్ ను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటి. ప్రతి ఏటా పాకిస్తాన్ లో ఏకంగా 5,00,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రద్దీగా ఉండే నగరాలు, మురికివాడల్లో ఈ వ్యాధి విస్తృతి ఎక్కువగా ఉంది. పేదరికం, పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి బలహీనం కావడం వల్ల రోగ తీవ్రత పెరుగుతుంది.
ఇక దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ ప్రతి ఏటా లక్షలాది మందికి సోకుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పేలవమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మురుగు నీరు నిలిచిపోయిన దోమల వృద్ధి పెరుగుతుంది. దోమల ద్వారా సంక్రమించే మలేరియా సింధ్, బలూచిస్తాన్ లాంటి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. టైఫాయిడ్ జ్వరం కూడా బాగా వ్యాపిస్తుంది. అసురక్షిత నీటితో కలిగే విరేచనాలు పిల్లలలో మరణానికి కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో ఏకంగా 80 శాతం కలుషిత తాగునీరు తీసుకుంటున్నారు. పాక్ లో పోలియో కూడా ఆందోళనకరంగానే ఉంది.
పాకిస్తానీయులకు సోకే ఇతర రోగాలు
ఇక పాకిస్తాన్ లో దాదాపు 25 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పరిమిత స్క్రీనింగ్ రోగ నిర్ధారణను ఆలస్యం చేసి, మరణానికి దారి తీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ తో సహా పలు రకాల గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారు. ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటుతో చాలా మంది బాధపడుతున్నారు. ఇక మహిళల్లో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. పొగాకు వినియోగం, వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి.
పాక్ లో వ్యాధులు ఎందుకు కామన్?
పాకిస్తాన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఆ దేశ జీడీపీలో 1% మాత్రమే ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం మీద ఫొకస్ పెట్టకపోవడం వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో నిధులను ఉగ్రవాదులకు నీడ కల్పించడానికే సరిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దారుణ స్థితికి చేరుకుంది.పేదరికం, స్వచ్చమైన నీరు, ఆహారం లభించక 46% మంది ప్రజలను ప్రభావితం అవుతున్నారు. వరదలు, పేలవమైన పారిశుధ్యం అంటు వ్యాధులను మరింత తీవ్రతరం చేస్తుంది. టీబీ, HIV లాంటి వ్యాధుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. పారిశుధ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ మీద అవగాహనను కల్పించడం ద్వారా ఈ వ్యాధులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!