Narasaraopet Elections: ఇంకా నోటిఫికేషన్ రాలేదు.. కూటమిలో సీట్ల లెక్కలు తేలలేదు.. రిజర్వేషన్ల పంచాయితీ కూడా పూర్తిగా వీడలేదు. జనసేన 30 శాతానికి పైగా సీట్లు ఆశిస్తోందన్న చర్చ. బలాబలాలు చూసే అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ–జనసేన అగ్రనేతల లెక్కలు. దీంతో ఆశావహులంతా తమ సీటు కోసం ఎవరి లాబీయింగ్ వారు చేసుకుంటున్నారు. కానీ.. నరసరావుపేటలో మాత్రం సీన్ రివర్స్. అధిష్టానం నుంచి క్లారిటీ రాకముందే.. కూటమి అభ్యర్థిని ప్రకటించేశారు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. మాజీ ఛైర్మన్ నాగసరపు సుబ్బయ్య గుప్తానే కూటమి అభ్యర్థి అంటూ క్లారిటీ ఇచ్చేశారు.
ఇటు 50 శాతం రిజర్వేషన్లకు మించి వెళ్లొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే చదలవాడ ఒక అడుగు ముందుకేశారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నదే ఆసక్తిగా మారింది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్న చర్చ మొదలైంది.
అయితే అభ్యర్థిని ప్రకటించడం ఒక ఎత్తయితే.. ఆయనకు అందరినీ కలుపుకుని వెళ్లడం మరో ఎత్తు. టికెట్ తమకే వస్తుందని ఆశించిన ఆశావహులు ఎంతవరకు సహకరిస్తారు? కూటమిలోని ఇతర పార్టీల నేతలు, కేడర్ సుబ్బయ్య గుప్తా కోసం కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి తోడు నరసరావుపేట ప్రజల నాడి ఏంటి? మరి అభ్యర్థిని ముందుగానే ప్రకటించిన ఎమ్మెల్యే.. ఇప్పుడు ఆశావహులను బుజ్జగించి, కూటమి కేడర్‌ను ఒక్కతాటిపైకి తీసుకురావాల్సి ఉంది. అప్పుడే నరసరావుపేట మున్సిపల్ పీఠంపై కూటమి కైవసం అవువతుంది. మరి నరసరావుపేటలో చదలవాడ లెక్క ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also read: మెట్రో రైలులో ప్రధాని మోదీ, సీఎం విజయ్ ప్రయాణం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!