Netanyahu: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇజ్రాయెట్ ప్రధాని నెతన్యాహూ ప్రసంగం సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఆయన ప్రసంగించేందుకు పోడియం వద్దకు చేరుకోగానే, పలు దేశాల ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు. నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాలన్న పాలస్తీనా మిషన్ పిలుపుతో వారంతా సభ నుంచి నిష్క్రమించారు. ఈ అనూహ్య పరిణామంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన నెతన్యాహూ సభ నుంచి వాకౌట్ చేసిన వారిని పిరికిపందలుగా అభివర్ణించారు. తన ప్రసంగానికి ముందే ఇంకా ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలను సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడం ద్వారా, వాకౌట్ చేసిన దేశాలను కూడా కాపాడుతోందన్నారు. ఇరాన్ అణు సామర్థ్యానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు కొన్ని దేశాల నేతలు రహస్యంగా ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలిపారన్న నెతన్యాహూ..ఈ వ్యవహారంలో బహిరంగ విమర్శలు, రహస్య అభినందనలు రెండూ ఉండటాన్ని తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతపై సుదీర్ఘంగా ప్రసంగించిన నెతన్యాహూ న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈయన ఎన్నికైన తర్వాత న్యూయార్క్‌లో యూదు పౌరులు భద్రత కోల్పోయారని, తీవ్ర అభద్రతాభావంతో బతుకుతున్నారని ఆరోపించారు. తనను ఈ సమావేశానికి రాకుండా, తన గొంతు నొక్కడానికి ప్రయత్నించారని, కానీ సత్యాన్ని ఎవరూ అణచివేయలేరన్నారు.
నెతన్యాహు వ్యాఖ్యలపై న్యూయార్క్ సిటీ మేయర్ మమ్దానీ అత్యంత తీవ్రంగా స్పందించారు. పాలస్తీనియన్లపై ఆయన సాగిస్తున్న నరమేధాన్ని కప్పిపుచ్చుకోవడానికే నిరాధారమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ అబద్ధం కూడా ఆయనను రక్షించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నెతన్యాహూ..ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశాయి.
Also read: నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!