BigTV English

Tadipatri Politics: పెద్దారెడ్డి కోడలు ఎంట్రీ.. తాడిపత్రిలో సీన్ రివర్స్

Tadipatri Politics: పెద్దారెడ్డి కోడలు ఎంట్రీ.. తాడిపత్రిలో సీన్ రివర్స్

Tadipatri Politics: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న పర్యటనకు ఓకే అన్న అధికారులు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మనపల్లి చేరుకోగానే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో పెద్దారెడ్డి ఇక తాడిపత్రికి పూర్తిగా దూరమైనట్లే అని వైసీపీలోని కొందరు నేతలు సంబరపడుతున్నారంట. తాడిపత్రి ఇన్చార్జ్ పదవి దక్కించుకోవాలని చూస్తున్న స్థానిక వైసీపీ నేతలకు తాజాగా పెద్దారెడ్డి షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గీసిన స్కెచ్ ఏంటి?


స్వగ్రామం తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో తాజాగా వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ నియోజకవర్గంలోని తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు అనుమతిచ్చారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన తాడిపత్రి సెగ్మెంట్లోని తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పెద్దారెడ్డి

హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు… ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు.

ఇప్పటికే మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉపఎన్నికలు, ప్రధాని పర్యటన అంటూ పలుమార్లు పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనలకు అనుమతులు నిరాకరించారు. ఈ నెల 5న పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. జగన్ పిలుపు మేరకు తాము తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం నిర్వహించాలని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిస్తూ ఏపీ హైకోర్టు ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.

వైసీపీ ఆందోళన కోసం అనుమతి కోరిన మాజీ ఎమ్మల్యే

ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని, పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఆ రోజు తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి అప్పుడు వెనుతిరిగారు. తాజాగా మళ్లీ తాడిపత్రిలో ‘చంద్రబాబు రీకాలింగ్’ కార్యక్రమం చేపట్టడానికి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి రావడానికి రెడీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఆయన్ని అడ్డుకోవడనికి ఎక్కడికక్కడ మొహరిస్తోంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో పోలీసులు శాంతిభద్రల విఘాతం కలుగుతుందని మరోసారి పెద్దారెడ్డి పర్యటనకు చెక్ పెట్టారు.

పెద్దారెడ్డి సొంత ఇంటికి రాకుండా అష్టదిగ్బంధనం

అలా తాడిపత్రి రాజకీయాలు రాష్ట్రంలో అనునిత్యం చర్చనీయాంశంగా మారుతున్నాయి. 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ ఫ్యామిలీ రాజకీయం ఓవైపు, కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోవైపుగా సాగుతున్న తాడిపత్రి రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇది మొదలు ప్రతిపక్ష వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అందులోనూ తాడిపత్రిలోని సొంత ఇంటికి వచ్చే వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేశారు. దాంతో తాడిపత్రిలో వైసీపీ క్యాడర్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాదికాలంగా తాడిపత్రిలోకి అడుగు పెట్టకపోయినా తాడిపత్రిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీ , జగన్ మీద ఉన్న అభిమానంతో ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉండాల్సిన నాయకుడు ఇబ్బందుల్లో ఉండడంతో ఇదే అదునుగా తాడిపత్రిలోనీ కొంతమంది నాయకులు లీడర్స్ గా చలామణి అవుతూ పెద్దారెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు తహతహలాడుతున్నారట

జగన్‌కు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకరరెడ్డి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డినీ తాడిపత్రికి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సాగించిన అక్రమాలు, అన్యాయాలు, ఆకృత్యాలు అన్ని ఇన్ని కావని, తమ కుటుంబ సభ్యులపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టించడంతోపాటు తనను తన కుమారుడైన అస్మిత్ రెడ్డినీ జైలుకు కూడా పంపిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితులలోనూ తాడిపత్రికి రానివ్వబోమని? ఏం చేస్తారు మహా అయితే ఉరివేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఇప్పట్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో చురుకుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, ముస్లిం మైనార్టీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్ భాష, రూపాయి డాక్టర్ చామల వెంకటఅనిల్ ప్రసాద్‌రెడ్డిలలో ఎవరో ఒకరికి తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తాడిపత్రిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ మధ్యనే… రూపాయి డాక్టర్ గా నియోజకవర్గానికి సుపరిచితుడైన డాక్టర్ అనిల్ రెడ్డి వెళ్లి జగన్‌ని కలిసారు. ఆయన వెస్ట్ రాయలసీమ ఎమ్మల్సీ గా పోటీ చేసి 25 శాతం ఓట్లు సాధించగలిగారు.

కోడలు అచ్యుతారెడ్డిని పార్టీ మీటింగ్‌కి పంపిన పెద్దారెడ్డి

పార్టీ కోసం కష్టపడే వారికి తగిన సముచిత స్థానం ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడిపత్రి వైసీపీ నాయకులకు మాట ఇవ్వడంతో తాడిపత్రి ఇన్చార్జి పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారంట. ఆ నాయకుల పన్నాగాన్ని ముందే పసిగట్టిన పెద్దారెడ్డి ముందే అలెర్ట్ అయ్యారట.. తాడిపత్రి వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి తన కుటుంబ సభ్యులు ఎవరు రాకూడదు అని జేసీ కండీషన్ పెట్టడంతో.. పెద్దారెడ్డి ఎవరికీ తెలియకుండా తన పెద్ద కోడలు అచ్యుతారెడ్డిని రంగంలోకి దింపి తాడపత్రి వైసీపీ సమావేశానికి పంపించారు. దీంతో తాడిపత్రి వైసీపీలో తమ కుటుంబానిదే పెత్తనమన్న సంకేతాలను బలంగా పంపారట కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి లో ఉన్న వైసీపీ నాయకుల్లో కూడా కొంతమంది జేసి ప్రభాకర్ రెడ్డి మనుషులు ఉన్నారని మొదట వారి ఆట కట్టించిన తర్వాత మిగిలిన విషయాలు చూసుకుంటానని పెద్ద రెడ్డి అంటున్నారంట.. ఇప్పుడు ఎవరైతే ఇన్చార్జి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారో వారిలో కొంతమంది టీడీపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తులు ఉండటంతో వారికి చెక్ పెట్టడానికి పెద్దారెడ్డి తన కోడల్ని రంగంలోకి దింపారట.

Also Read: రేణుకాకు చెక్! ఆ మంత్రుల స్కెచ్?

తనకు బదులుగా తన పెద్ద కుమారుడు హర్షవర్ధన్ భార్య అచ్యుత రెడ్డిని రంగంలోకి దింపి సొంతపార్టీ నాయకులకి షాక్ ఇచ్చారు పెద్దారెడ్డి.. ఆ సమావేశానికి వచ్చిన నాయకుల్లో ఏ ఒక్కరికి కూడా ఆయన కోడలు వస్తాదని సమాచారం లేకపోవడంతో వారంతా ఆమెను చూసి ఖంగుతిన్నారట.. ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులే తాడిపత్రి వైసీపీలో రాజకీయం చేస్తారని వేరే వ్యక్తికి అక్కడ అవకాశం ఉండదని వైసీపీ నాయకులు ఫిక్స్ అవుతున్నారంట.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Story By Rami Reddy, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×