Big Stories

Amadalavalasa Political Heat: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ!

Amadalavalasa Constituency Tammineni Vs Kuna Ravi: సిక్కోలు జిల్లా ఆముదాలవలస నియోజవర్గంలో ఆసక్తికరపోరు జరిగింది. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి మామా, అల్లుడు పోటీ చేశారు. వైసీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతతారం, టీడీపీ నుంచి ఆయన మేనల్లుడు కూన రవి పోటీ పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మరో వైపు నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేత తమ్మినేనికి వ్యతిరేకంగా రెబల్స్‌ అవతారమెత్తి ఆయనకు షాక్ ఇచ్చారు. ఆ సారి పోలింగ్ శాతం పెరగడం, రెబల్ గణనీయంగా ఓట్లు చీల్చుకున్నారన్న ప్రచారంతో తమ్మినేని శిబిరంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై వైసీపీ తరుపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభపతిగా కొనసాగుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, తమ్మినేనికి సొంత మేనల్లుడు.. కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి అముదాలవలసలో ఆ మామాఅల్లుళ్లు తలపడుతున్నారు

- Advertisement -

2009లో తమ్మినేని టిడిపిని వీడి ప్రజారాజ్యం తరఫున బరిలోకి దిగగా… టిడిపి అభ్యర్థిగా కూన రవి కుమార్ మొదటిసారి అసెంబ్లీ బరిలో ఆయనపై పోటీ చేశారు…ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మామ అల్లుళ్ళు ఇద్దరు ఓటమిపాలయ్యారు. తరువాత 2014లో తమ్మినేని వైసీపీ తరఫున, కూన రవి టిడిపి తరఫున ప్రత్యక్ష పోరుకు దిగగా కూన రవి కుమార్ గెలుపొందారు. ఈ ఇరువురు నేతల మధ్య బంధుత్వం 2014 ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీసింది.

Also Read: మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు?

సీనియర్ నేతైన తమ్మినేని సీతారాం ఏడుసార్లు ఆమదాలవలస అసెంబ్లీ స్థానం నుండి ఎంఎల్ఏ గా గెలుపొందారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల తర్వాత తమ్మినేని చాలా కాలం అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని.. 2019లో వైసిపి తరుపున గెలుపొంది శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ మామ అల్లుళ్లే ప్రధాన ప్రత్యర్ధులుగా తలపడటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటలతూటాలు ఒక రేంజ్లో పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆమదాలవలస రాజకీయాలను హీటెక్కించారు.

తమ్మినేని సీతారాం పెద్ద అవినీతిపరుడని అంగన్వాడీ , షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారని, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూన రవి ఆరోపిస్తే.. టీడీపి హయాంలో పురుషోత్తపురం అక్రమ ఇసుక ర్యాంప్, ఆమదాలవలస భూ ఆక్రమణ, వెన్నెలవలసలో కూనవారిపూలతోట పేరిట వంద ఎకరాల ప్రభుత్వ భూఆక్రమణకు యత్నించటం వంటి అక్రమాల మాటేంటని ఇటు తమ్మినేని కూన రవిని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపైన, అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని పరస్పర సవాళ్లు విసురుకున్నారు.

Also Read: Nandyal Assembly Constituency: పుష్ప పవర్ ఎంత? శిల్పా లెక్క మారిందా?

వైసిపికి విశేష ప్రజాదరణ ఉందని 2024 ఎన్నికల్లో తనకు 20వేలకు పైబడి మెజారిటీ వస్తుందని తమ్మినేని ధీమా వ్యక్తం చేశారు. 20వేలకు పైబడి మెజారిటీ రాకపోతే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. అయితే తమ్మినేనికి ఆరోగ్యం క్షీణించి తనకు వచ్చే మెజారిటీని ఆయనకు వస్తుందని రివర్స్ లో చెబుతున్నారని ఎద్దేవా చేశారు కూన రవికుమార్.. ఆమదాలవలసకు ఒక ఎమ్మెల్యే కావాలా లేక ముగ్గురు ఎమ్మెల్యే లు కావాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కూన రవి సూచించారు.

తమ్మినేని గెలిస్తే అతను, అతని భార్య వాణి, అతని కుమారుడు చిరంజీవి నాగ్ అధికారం చెలాయిస్తారని మూడు కలక్షన్ సెంటర్లు ఏర్పడతాయని కూన రవి ఆరోపణలు గుప్పించారు. అయితే తనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవకు అంకితవుతున్న తన కుటుంబ సభ్యులపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు తమ్మినేని.

Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?

పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రభుత్వ ఇసుక, మద్యం విధానాలలో డొల్లతనం, అవినీతి, పడకేసిన అభివృద్ధితో ప్రజలు విసిగివేశారారని, ఈ ఎన్నికల్లో వైసిపిని గద్దె దించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కూన రవి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి అభివృద్ధికి మధ్యలోనే నిలిచిపోయిన శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రధాన రహదారి విస్తరణ పనులే నిదర్శనమని కూన రవికుమార్ దెప్పిపొడిచారు. ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్‌కి టిడిపి హయాం లో 37 కోట్లు కేటాయిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ నిధులను నాయకులు స్వాహా చేయడమే కాకుండా.. ఐదేళ్లు అయినా ఆ రోడ్ ని ఆలాగే వదిలేసారని కూన రవికుమార్ తమ్మినేని పై మండిపడ్డారు.

ఆమదాలవలస ..శ్రీకాకుళంరోడ్ వేయడానికి ముందుకి వచ్చిన కాంట్రక్టర్ దగ్గర స్పీకర్ తమ్మినేని సీతారాం 2 కోట్లు నొక్కేసారని తమ్మినేని సీతారాంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ 2 కోట్లు తోనే తన కొడుకు పెళ్లి చేశారని కూన రవికుమార్ పదేపదే టార్గెట్ చేస్తున్నారు .. తమ్మినేని సీతారాం అవినీతి వలనే ఆమదాలవలస.. శ్రీకాకుళం రోడ్ పూర్తి కాలేదని.. రోడ్ పై ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..

ఆ మామా అల్లుళ్ళ పోరుకు తోడు వైసీపీ అసమ్మతి నేతలు రంగంలోకి దిగి తమ్మినేనికి షాక్ ఇచ్చారు. కుటుంబ పాలన వద్దు.. సువ్వారి గాంధీ ముద్దు అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా వైసిపి రెబల్ గాంధీ పోటీకి దిగారు. అముదాలవలస వైసీపీ టికెట్ కోసం వైసిపి నేత సువ్వారి గాంధీ, జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌లు తమ్మినేనితో పోటీ పడ్డారు.. దాంతో వైసీపీలో మూడు గ్రూపులు వెలిశాయి. అయితే పార్టీ అధిష్టానం టికెట్ ను తమ్మినేనికి కేటాయించడంతో వెంటనే గాంధీ, అతని భార్య మాజీ ఎంపీపీ దివ్య, అతని మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ సువర్ణ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు. అనంతరం గాంధీ స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్లు ప్రకటించి విస్తృత ప్రచారం నిర్వహించారు

మరోవైపు చింతాడ రవికుమార్‌ను పార్టీ పెద్దలు బుజ్జగించి.. తమ్మినేనికి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించారు… అయితే గాంధీ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు తమ్మినేని పై, అటు కూన రవిపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో ముందుకెళ్లారు. మామా అల్లుల్లు ఇద్దరు ఒకరిపై ఒకరు బయటికి విమర్శించుకుంటున్న లోపాయికారీగా ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని సువ్వారి గాంధీ విమర్శలు గుప్పించారు.

Also Read: Amadalavalasa Political Heat: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ!

కూన రవికుమార్‌కి ఆమదాలవలస టీడీపీలో ఎటువంటి వ్యతిరేకతా లేదు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆ పార్టీ రెబల్ పోటీకి దిగడం ఆయనకు తలనొప్పిగా మారిందంట. మరో వైపు ఆమదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం పై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా లో తన తమ్మినేని సీతారాం కోట్లు రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా తమ్మినేని కి ఈ సారి ఎన్నికల్లో ఇబ్బందిపెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఒవైవు ఆమదాలవలస రోడ్ పూర్తి కాకపోవడం.. అందులో కూడా తమ్మినేని కి అవినీతి ఆరోపణలు.. అదే రోడ్ పై పదుల సంఖ్యలో మరణాల.. ఈ సారి ఎన్నికల్లో తమ్మినేనికి నెగిటివ్‌గా మారాయని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుతున్నారు.

ఆ లెక్కలు ఎలా ఉన్నా సువ్వారి గాంధీ ఆమదాలవలసలో వైసీపీని బానే దెబ్బతీసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుమారు గా 6 నుంచి 8 వేల వరకు వైసీపీ ఓట్లు చీల్చారన్న అంచనాలు పోలింగ్ తర్వాత వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమి తరపున పోటీ చేసిన కూన రవికుమార్ గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. 20 నుంచి 25 వేల వరకు మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లో కూటమి బలంగా ఉండటం.. వైసీపీ రెబల్‌గా సువ్వారి గాంధీ పోటీచేయడం. స్పీకర్ విజయ అవకశాలను చాలా వరకు దెబ్బతీసే అవకాశం ఉందని వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా చర్చ నడుస్తుంది.

Also Read: జగన్ మేనమామ.. హ్యాట్రిక్ కొడతాడా?

2019లో ఎన్నికల్లో 78.89 శాతం.ఓటింగ్ జరిగింది. ఈ సారి 81.42 ఓటింగ్ శాతం నమోదు అయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మూడవ అత్యధిక ఓటింగ్ ఆమదాలవలస నియోజకవర్గం లో నమోదు అయింది.పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కూటమిపై నమ్మకంతోనే ఓటు వేశారని రవి అంటున్నారు. మరో వైపు పోస్టల్ ఓటింగ్‌‌లో4 లక్షల 39 వేల మంది ఓటు వేయడం కూడా తనకి కలిసొస్తుందని కూన రవి స్పష్టం చేస్తున్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకి ధైర్యంగా ఉన్నా.. లో లోపల పెరిగిన ఓటింగ్ శాతం.. ఉద్యోగులు తమ తిరుగుబాటును పోస్టల్ బేలెట్ ద్వారా వ్యక్తం చేయడంతో కొంత ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ టెన్షన్ భరించలేకే.. టూర్ పేరుతో కేరళ చెక్కేశారని సొంత పార్టీలోనే గుస గుస లు వినిపిస్తున్నాయి.  మొత్తానికి మామ అల్లుళ్ళ పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపించింది. ఆమదాలవలస నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంతో ఆసెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News