BigTV English

Telangana Politics: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

Telangana Politics: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

Telangana Politics: కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత చేసిన ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరన్న చర్చ గులాబీ శ్రేణుల్లో మొదలైంది. ఇప్పటికే కవిత లెటర్‌పై కలకలం రేగుతున్న తరుణంలో మీడియా ముందు కొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్..కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేస్తూ.. పార్టీలో దెయ్యాల టాపిక్ రాగానే మాట దాటేయడం గులాబీ శ్రేణులకే మింగుడు పడటం లేదంట


బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న కవిత లెటర్

బీఆర్ఎస్‌లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెటర్ కలకలం కొనసాగుతుండగానే ఆమె మరో బాంబు పేల్చారు కవిత..అమెరికా నుంచి వచ్చిన కవిత చేసిన కామెంట్స్‌ పార్టీలో మరింత సంచలనంగా మారాయి.. కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని, వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె.. ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్‌ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి.. లేఖ లీక్‌ అయ్యిందంటూ హంగామా జరుగుతోందని, ఆ లేఖ రెండు వారాల క్రితం కేసీఆర్‌కు తాను రాసిందేనని స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్‌కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్‌ సభ తరువాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని.. కేసీఆర్‌కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగతఎజెండా లేదని ఆమెస్పష్టం చేశారు.


పొలిటికల్ హీట్ మరింత పెంచిన కవిత కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్‌గా మారారు. ఎప్పుడో మే 2 న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులో రావడం..బయటకు వచ్చిన తర్వాత ఇంకా రచ్చ నడుస్తుండగానే… ఆమెరికా నుంచి తిరిగొచ్చిన కవిత చేసిన కామెంట్స్‌ పొలిటికల్ హీట్‌ను మరింత పెంచేశాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత బయటకు వచ్చిన లేఖ తనదే అని ధ‌ృవీకరించారు. అయితే ఆమె చెప్పిన పలు విషయాల్లో కాంట్రడిక్షన్స్‌పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. లేఖ రాసింది తానేనని ప్రకటించిన కవిత…పార్టీ అధినేతకు రాసిన లేఖ బయటకు ఎవరు లీక్‌ చేశారో తెల్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడు అంటూనే…కేసీఆర్ చూట్టూ దెయ్యాలు ఉన్నాయని చేప్పడం…పార్టీలో కోవర్టులో ఉన్నారని…వారిని తప్పిస్తేనే పార్టీకి మనుగుడ అంటూ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సంచలనంగా మారాయి.

బీఆర్ఎస్‌లో కోవర్టులు ఉన్నారా..? ఉంటే ఈ కోవర్టులు ఎవరు?

బీఆర్‌ఎస్‌లో కోవర్టులు ఉన్నారా…? ఉంటే ఆ కోవర్టులు ఎవరు? కేసీఆర్ చూట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు? కవిత దృష్టిలో ఉన్న కోవర్టులు ఎవరు అనేది ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్, గత ఎన్నికల నాటికి నేషనల్ ఫోకస్ అంటూ బీఆర్‌ఎస్‌గా మారింది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఆ పార్టీలో కోవర్టులు ఉన్నారనే మాటలు తొలిసారి రావడం…అది కూడా కేసీఆర్‌ కుమార్తె నుంచి రావడం పార్టీలో హాట్ టాపిక్‌ అయింది. అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ అక్కడే నుంచి పార్టీ కార్యక్రమాలను మానిటర్ చేస్తున్నారు. అయితే ఫామ్‌ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ చుట్టూ ఉన్న నేతలు ఏం చేస్తున్నారు?పార్టీలో కోవర్టు ఆపరేషన్‌ చేస్తుంది ఎవరని నేతలు తలలు పట్టుకుంటున్నారంట. పార్టీలో ఎవరో నాయకుడు మాట్లాడితే ఏదో కోపంలో మాట్లాడారని అనుకోవచ్చు. కానీ కేసీఆర్ కుమార్తె కవితనే కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యలు చేయడంతో నేతలు జట్లు పీక్కుంటున్నారంట.

కవితకు స్వాగతం పలికేటప్పుడు కనిపించని గులాబీ జెండాలు

ఒక వైపు ఆమె కెసీఆర్‌ను దేవుడు అంటూ ఆయన పక్కన కొంత మంది దెయ్యాలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీలో, కుటుంబంలో ఎక్కడా వివాదాలు, విభేదాలు లేవని చెప్పు కొచ్చారు. అదే నిజం అనుకుంటే మరి ఎయిర్‌పోర్ట్‌లో కవితకు స్వాగతం పలికినప్పుడు ఒక్కటంటే ఒక్క బీఆర్ఎస్ జెండా ఎందుకు కనిపించలేదని ప్రశ్నగా మారింది. ఆమె సొంత సంస్థ జాగృతి శ్రేణులు, సొంత క్యాడరే కవితకు స్వాగతం పలికింది. వారెవరూ కేసీఆర్, కేటీఆర్ ఫోటో ఎందుకు పట్టుకోలేదని సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కవిత ఆదేశాలు లేకుండా ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కవిత నాయకత్వం కోరుకునే వాళ్ళు సొంతంగా ఆ పని చేయగలరా?…అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది విశ్లేషకులు మాట. ఎయిర్‌పోర్టులో పరిణమాలను చూస్తే పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.

ఉద్యమకారలు కవితకు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారు?

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎడా పెడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, ఇతర పార్టీలను నిర్వీర్యం చేసినప్పుడు 2001 నుంచి ఉన్న ఉద్యమకారులు కవితకు గుర్తుకురాలేదు. మరి ఇప్పుడే ఎందుకు కవితకు గుర్తుకు వచ్చారు అన్న చర్చ జరుగుతోంది. అధికారం పోయినందుకేనా?. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ సామాజిక తెలంగాణా గురించి మాట్లాడని కవిత బీఆర్ఎస్ ఓడి పోయిన తర్వాత, అది కూడా ఏడాదిన్నర గడిచిన తర్వాత ఎందుకుగుర్తుకు వచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ అసలు మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తినా అప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇప్పుడే ఆమెలోని ప్రజాస్వామిక వాది ఎలా? ఎందుకు బయటకు వచ్చారు? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.

సొంత ప్లాట్‌ఫాం రెడీ చేసుకునే పనిలో పడ్డారా?

వరంగల్‌లో జరిగిన బిఆర్ఎస్ సభలో వేదికపై కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉండటంతో పార్టీ ఎటు వైపు వెళుతుందో కవితకు క్లారిటీ వచ్చేసిందని, అదే ఆమెకు ఇప్పుడు ఆమెకు నచ్చటం లేదంటున్నారు. కేటీఆర్‌తో పాటు తనకు కూడా బీఆర్ఎస్‌లో కీలక పాత్ర కావాలని కోరుకుంటున్న కవిత, ఆ ఛాన్స్ ఉన్నట్లు కనిపించకపోవటంతో.. సామాజిక తెలంగాణ, వక్ఫ్ బిల్లు, బీసీ లకు 42 శాతం స్లొగన్స్ అందుకుని సొంత ప్లాట్‌ఫాం రెడీ చేసుకునే పనిలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. కేటీఆర్, కవితల వ్యవహారశైలి విషయానికి వస్తే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పటి కంటే గద్దె దిగాకమరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బహిరంగ వేదికలపై, మీడియా ముందు ఆయన స్పీచ్ చూస్తే కూడా అదే విషయం స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు. అయితే కేటీఆర్ తో పోలిస్తే కవిత బయట మాట్లాడే సమయంలో బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అది ఒక్కటే ఆమెకు సానుకూల అంశం. అన్నిటి కంటే ముఖ్యం పదేళ్లలో వందల సార్లు తాను చెప్పిన మాటలనే తానే స్వయంగా, అలవోకగా మార్చేసే కేసీఆర్ దేవుడు ఎలా అవుతారన్న సెటైర్లు ఎక్కువవుతున్నాయి

పార్టీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్

అయితే కవిత లెవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం కేటీఆర్ కొంత ఆసక్తి కనబరచని పరిస్ధితి. కవిత అంటున్న దేవుడు, దెయ్యం గురించి ప్రస్తావిస్తే ఆయన .. బోడిగుండుకి మోకాలికి ముడేసినట్లు టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నారు. అదేమంటే పార్టీలో కోవర్టులు ఉంటే ఉండొచ్చు అన్న కేటీఆర్…పార్టీలో ప్రజాస్వామయ్యం ఉందని చెప్పుకొచ్చారు . తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, కేసీఆర్‌కు ఎవరైనా చీటీలు, లెటర్లు ఇవ్వవచ్చంటున్నారు. మరి అదే కేసీఆర్ పదేళ్లు అధకారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముఖం చూడకుండా, ప్రగతిభవన్ లేదా ఫాంహౌస్‌లకు పరిమితమై పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఒన్ మ్యాన్ షో చేసినప్పుడు కేటీఆర్ చెప్తున్న ఈ ప్రజాస్వామ్యం ఏమైందంటున్నారు విమర్శకులు.

కవిత లేఖ పెద్ద ఇష్యూ కాదని కొట్టి పారేసిన కేటీఆర్

కవిత ఇష్యూ అంత కలకలం రేపుతుంటే దాని గురించి అసలు మాట్లాడకపోతే బాగోదన్నట్లు.. అదీ మీడియా ప్రతనిధులు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు (శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అంతర్గత విషయాలను బయట మాట్లాడటం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని.. అందరం సమానమే అని స్పష్టం చేశారు.

Also Read: జగన్ మైండ్‌గేమ్ సక్సెస్ అవుతుందా?

ఒకవైపు కవిత లేఖాస్త్రాలు సంధిస్తూ.. దయ్యాలు, కోవర్టులని మాట్లాడుతూ కలకలం రేపుతున్నారు. కేటీఆర్ మాత్రం అదేమీ పెద్ద ఇష్యూ కానట్లు.. పార్టీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ.. అంతర్గత వ్యవహారాలు బయటకు చెప్పకూడదని శుద్దులు చెప్తున్నారు. దాంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక గులాబీ శ్రేణులు తలలు పట్టుకోవాలసి వస్తోందంట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×