స్వేచ్ఛ స్పెషల్ డెస్క్: ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న ఆర్మీ మన సొంతం. ఎండైనా, వానొచ్చినా, మంచు కురుస్తున్నా దేశ రక్షణలో మన సైనికుల అసామాన్య సేవ అమోఘం. దేశం మొత్తాన్ని తమ ఇళ్లుగా భావించి సరిహద్దుల్లో రక్షణ గోడగా నిలబడారు. అలాంటి సైనికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. సరిహద్దుల్లో, ఇతర ఆపరేషన్లలో సైనికుల రక్షణను మరింత బలోపేతం సేందుకు టెక్నాలజీని కూడా గట్టిగా వాడేస్తోంది. ఈ క్రమంలోనే రోబోటిక్ డాగ్స్‌ను రంగంలోకి దింపింది.
జనవరి 15 చాలా ప్రత్యేకం
బ్రిటీష్ కాలంలోనే భారతీయ సైన్యానికి పునాది పడింది. 1895లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రెసిడెన్సీ ఆర్మీని ఏర్పాటు చేసింది. తర్వాత అది బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అయింది. అది దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత సైన్యంగా మారింది. 1949 జనవరి 15న దేశ మొదటి చీఫ్ జనరల్‌గా కేఎం కరియప్ప నియమితులయ్యారు. అందుకు గుర్తుగా ప్రతీ ఏడాది ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా 77వ సైనిక దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. మహారాష్ట్రలోని పుణెలో ఆర్మీ పరేడ్ జరిగింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రోబోటిక్ డాగ్స్.
రోబోటిక్ డాగ్స్ మార్చ్‌ఫాస్ట్
నాలుగు కాళ్లతో నడిచే ఈ రోబో డాగ్స్‌ను మొదటిసారి పుణె ఆర్మీ పరేడ్‌లో ప్రదర్శించారు. ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీటిని తయారు చేసింది. మొత్తం వంద రోబోలను భారత సైన్యం కొనుగోలు చేసింది. వీటి పేరు ఆర్క్‌వీ మ్యూల్. ఇవి స్వయంప్రతిపత్తితో పని చేయడమే కాకుండా రిమోట్ సాయంతోనూ పని చేస్తాయి. నాలుగు పాదాలతో చూడడానికి డాగ్స్ మాదిరి కనిపిస్తాయి. అందుకే వీటిని రోబోటిక్ డాగ్స్ అని కూడా అంటుంటారు. పుణె మార్చ్‌ఫాస్ట్‌లో ఇవి సైనికులతో పాటు క్రమశిక్షణగా ముందుకు కదిలివెళ్లడం అందర్నీ ఆకట్టుకుంది. అత్యాధునిక సాంకేతికతతో కేంద్రం వీటిని తయారు చేయించింది.
రోబోటిక్ డాగ్స్‌తో ఎన్నో ఉపయోగాలు
ఈ రోబోకు పెట్టిన పేరులోని మ్యూల్ అంటే, మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్యూప్‌మెంట్. వీటివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు వీటి పాత్ర చాలా కీలకం. రిమోట్ ద్వారా పని చేయడంతో సంబంధిత ప్రదేశాలకు వీటిని పంపించి సైనికులు ఉపయోగిస్తారు. అంతేకాదు, ఎక్కడైనా బాంబులు అమర్చినప్పుడు వాటిని తొలగించేందుకు బాంబ్‌స్క్వాడ్‌ను వాడుతున్నాం. ఈ రోబో డాగ్స్ బాంబుల నిర్వీర్యం చేసేందుకు సైతం ఉపయోగపడతాయి. పెరీమీటర్లు, సైనిక పహారాకు కూడా సేవలందిస్తాయి.
రోబోటిక్ డాగ్స్ మరిన్ని ప్రత్యేకతలు
– ఈ రోబోల్లో ఒక బ్యాటరీ ఉంటుంది. దాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 20 గంటల వరకు పని చేస్తుంది
– తల వెనుక భాగంలో సెన్సార్లు ఉంటాయి
– ఈ రోబోలలో కంప్యూట్ బాక్స్ ఉంటుంది. అది మెదడులా సాయం చేస్తుంది
– నాలుగు కాళ్లతో ఉండే ఈ రోబో డాగ్స్, సెన్సార్స్ సాయంతో పరిసరాల్లో ఏమేం ఉన్నాయో చూడగలుగుతుంది
– సెకనుకు 3 మీటర్ల వేగంతో నడవగలుగుతాయి. బరువు 51 కేజీలు ఉంటుంది
– ఇవి గరిష్టంగా 12 కేజీల బరువును మోయగలుగుతాయి. చిన్నపాటి తుపాకులు, డ్రోన్లు, కెమెరాలను మోయగలవు
– ఎక్కడైనా పని చేసే వీలుగా రూపకల్పన. నీళ్లలో మాత్రం మునిగితే కాసేపటి వరకు మాత్రమే యాక్టివ్ మోడ్
– కొండ ప్రాంతాల్లో, బురదలోనూ పయనం. మెట్లు కూడా ఎక్కేలా డిజైన్
– 55 డిగ్రీల ఎండలోనూ వెళ్లేలా, మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేసేలా రూపకల్పన
– దుమ్ముధూళిలోనూ పనిచేసేలా నిర్మాణ స్వరూపం
– ఈ రోబో డాగ్స్‌ను 15 నిమిషాల్లోనే విడగొట్టి తిరిగి జత చేయొచ్చు
– ఇవి ఎన్‌విడియా జేవియర్ ప్రాసెసర్‌తో పని చేస్తాయి
– ఈ రోబోలకు ఐపీ 67 రేటింగ్ లభించింది
Also Read: మరింత దారుణంగా దిగజారిపోయిన చైనా.. చివరకు చిన్న పిల్లలను కూడా..?