RSS Chief Mohan Bhagwat: కరుడు గట్టిన హిందూ సంస్థ రూటు ఫిరాయించింది. భిన్నత్వంలో ఏకత్వమనే భారత ప్రాధమిక సూత్రాన్ని వందేళ్ల తర్వాత వల్లించింది. దేశంలో రగులుతున్న మందిర్-మస్జీద్ వివాదాల్లో శాంతి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునివ్వడం మరోసారి సంచలనమయ్యింది. ఆరెస్సెస్ చీఫ్ నోటి నుండి మత సామరస్యం వ్యాఖ్యలు రావడం తీవ్రమైన చర్చకు దారి తీసింది. భగవత్ వ్యాఖ్యల్ని చాలా హిందూ సంఘాలు ఖండిస్తుంటే.. దీని కోసమే కాచుకొని కూర్చున్న ముస్లీం సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఒకవైపు, బిజెపి దేశంలో దేవాలయాలను మళ్లీ స్థాపించే ప్రయత్నాలు చేస్తుంటే.. ఆరెస్సెస్ మాత్రం లౌకిక పోకడలను ప్రచారం చేస్తోంది. అంటే, ఆరెస్సెస్ రూటు మార్చిందా..? బిజెపీ ఆరెస్సెస్‌లా మారుతోందా..? అసలు, భగవత్ మాటల వెనుక అర్థం ఏంటీ? హిందూ సంఘాలు భగవత్ వ్యాఖ్యల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..?
ఆరెస్సెస్ చీఫ్ నుండి ప్రేమ, సామరస్యం, శాంతి వ్యాఖ్యలు
ఇది, ఊహించని పరిణామం… దశాబ్ధాలుగా ఉన్న అభిప్రాయాన్ని అనూహ్యంగా మార్చిన సందర్భం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఎంతో ఉదాత్తంగా చెప్పిన మాటలు.. ఆయన అనుచరుల్ని అసహనానికి గురిచేస్తున్నాయి. ఆరెస్సెస్ చీఫ్ నుండి ప్రేమ, సామరస్యం, శాంతి వ్యాఖ్యలు విన్న హిందూ సంఘాలు.. ఇది మన కోసం కాదంటూ విరుచుకుపడుతున్నారు. లౌకిక విలువలను నమ్మే మోసపూరిత ప్రపంచం కోసమే అని మోహన్ భగవత్ అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇంకొందరైతే.. భగవత్ మాటలకు అసలు విలువే లేదని అంటున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని విశ్వసించలేమని చెబుతున్నారు.
భగవత్ మాటలకు విలువే లేదంటున్న హిందూ గురువులు
అయితే, ఆరెస్సెస్ చీఫ్‌గా మోహన్ భగవత్ తన పదవీకాలంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేశారు. కానీ, హిందూ సంస్థలు మాత్రం దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాయి. భగవత్ మత సామరస్యం గురించి మాట్లాడినప్పుడల్లా.. ఇలాంటి ద్వేషమే మళ్లీ మళ్లీ రగులుకుంటోంది. ఇప్పుడు, ఆ వ్యతిరేకత మరింత ఎక్కువయ్యింది. అంటే, మోహన్ భగవత్‌ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదా..? అలా అనుకుంటే, హిందూ సమాజంలో భగవత్ ప్రభావం ఎక్కడుంది? అంటే, హింసను కోరుకునే వ్యక్తులు ఆరెస్సెస్‌కు బయటే ఉన్నారా? ప్రస్తుతం, ఇలాంటి సందేహాలే చాలా మందిని అయోమయంలో పడేస్తున్నాయి.
మత నిర్ణయాలు తీసుకోడానికి ఆరెస్సెస్‌కు అధికారం లేదు
‘మందిర్-మసీదు’ సమస్యపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటన హార్డ్ కోర్ హిందూ సంఘాలకు అంతగా మింగుడుపడటం లేదు. ఇలాంటి మతపరమైన విషయాలను నిర్ణయించడానికి ఆరెస్సెస్‌కు అధికారం లేదంటున్నారు. ఈ అంశంలో మత పెద్దలు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను హిందూ గురువుల ఆర్గనైజేషన్ అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్రంగా విమర్శించింది. “మతానికి సంబంధించిన అంశం తలెత్తినప్పుడు, అది మత గురువులు నిర్ణయిస్తారనీ.. వారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్‌లు అంగీకరిస్తాయి” అని అఖిల్ భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతిని పేర్కొన్నారు.
హిందూ గురువుల ఆర్గనైజేషన్ అఖిల్ భారతీయ సంత్ సమితి
స్వామి జితేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ మోహన్ భగవత్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ.. 56 కొత్త ప్రదేశాలలో ఆలయ నిర్మాణాలను గుర్తించడం జరిగిందని అన్నారు. మతపరమైన సంస్థలు తమ చర్యలను రాజకీయ అజెండాలతో కాకుండా ప్రజల సెంటిమెంట్ ఆధారంగా చేసుకుంటాయని జితేంద్రానంద వెల్లడించారు. ఇక, జగద్గురు రాంభద్రాచార్య వంటి ప్రముఖ మత ప్రముఖులు మాట్లాడుతూ.. మతపరమైన విషయాలపై అవసరమనుకుంటే ఆధ్యాత్మిక నాయకులతో చర్చించాలి గానీ, సొంత వ్యాఖ్యలు చేయకూడదంటూ వాదించారు.
‘ఇండియా-ది విశ్వగురు’ అనే అంశంపై పూణేలో కార్యక్రమం
అయితే, హిందూ గురువులంతా మోహన్ భగవత్‌పై ఎందుకిలా మండిపడుతున్నారు..? అసలు, భగవత్ ఏం చెప్పారు..? అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినప్పటి నుండి కొంతమంది వ్యక్తులు మందిర్-మసీద్ సమస్యలను లేవనెత్తుతున్నారనీ.. దీని ద్వారా హిందువులకు నాయకులవుదామని వాళ్లు అనుకుంటున్నారని మోహన్ భగవత్ ఇటీవల విమర్శించారు. డిసెంబర్ 19న, ‘ఇండియా-ది విశ్వగురు’ అనే అంశంపై పూణేలో జరిగిన కార్యక్రమంలో ఉపన్యాసం ఇస్తూ, భగవత్ “ఇంక్లూజీవ్ సొసైటీ” కావాలని వాదించారు. దేశంలో ప్రస్తుతం, రోజుకొక కొత్త వివాదం చెలరేగుతోందనీ.. దీన్ని ఎలా అనుమతించాలి? అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటిది కొనసాగదనీ.. మనం కలిసి జీవించగలమని యావత్ భారతదేశం చూపించాలని అన్నారు.
ప్రాచీన దేవాలయాలను వెలికితీయడానికి మసీదుల్లో సర్వేలు
మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మసీదు వివాదాలకు సంబంధించిన ఏ ఉదాహరణనీ ప్రస్తావించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ప్రాచీన దేవాలయాలను వెలికితీయడానికి మసీదుల్లో సర్వేలు చేయాలనే డిమాండ్లు ఇటీవలి కాలంలో న్యాయస్థానాల దృష్టికి వచ్చాయి. ఇటీవల సంభల్ మసీదు సర్వే సందర్భంగా జరిగి అల్లర్లలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ముందు, కాశీలోని జ్ఞానవాపీ మసీదు కింద పూజలకు అనుమతి ఇచ్చింది స్థానిక కోర్టు.
మధుర షాహీ ఈద్గా, ఢిల్లీలో జామా మసీదు..
అలాగే, మధుర షాహీ ఈద్గా, ఢిల్లీలో జామా మసీదు.. ఇలా చాలా మసీదులకు సంబంధించిన కేసులు కోర్టుల మెట్లెక్కాయి. అయితే తన ఉపన్యాసంలో దేనీ పేరు ప్రస్తావించలేదు మోహన్ భగవత్. పైగా.. బయటి నుంచి వచ్చిన కొన్ని గ్రూపులు ఇలాంటి వివాదాలను సృష్టించాలని చూస్తున్నాయనీ.. దేశంలో పాత పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నాయనీ భగవత్ అన్నారు. అయితే, దేశం రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది, ప్రజలు ప్రభుత్వాన్ని నడిపే కాలమనీ.. ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయని మోహన్ భగవత్ వెల్లడించారు.
బ్రహ్మదేవుడు ధర్మంపై చెప్పిన జ్ఞానాన్ని ఉదహరించిన భగవత్
ఇక, మోహన్ భగవత్ ఇటీవలే.. మరో సందర్భంలో.. మతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్న అకృత్యాలన్నీ ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, బ్రహ్మదేవుడు ధర్మంపై చెప్పిన జ్ఞానాన్ని ఉదహరించిన భగవత్.. “ధర్మం గురించి అసంపూర్ణ జ్ఞానం అధర్మానికి, అనైతికతకు దారి తీస్తుంది” అని చెప్పారు. డిసెంబర్ 22న అమరావతిలో మహానుభావ్ ఆశ్రమం మూడు రోజుల శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
800 ఏళ్ల తర్వాత హిందూ సమాజం తమ మతాన్ని అంగీకరించింది
ఒక వ్యక్తికి ధర్మానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని అనీ.. అలాంటి వ్యక్తిని సమాజం తప్పుగా పేర్కొంటూ, దూకుడుగా వ్యవహరిస్తుందనీ.. ఇలాంటి ఆగ్రహాన్ని తట్టుకుని ధర్మానికి సరైన అర్థాన్ని బోధించాల్సిన అవసరం ఉందని భగవత్ వెల్లడించారు. దీనికి, హేతుబద్ధమైన శాఖలు అవసరం అనీ.. కేవలం శాఖలు ఉండటం వల్ల ఉపయోగం లేదనీ అన్నారు. 800 ఏళ్ల తర్వాత హిందూ సమాజం తమ మతాన్ని అంగీకరించిందని గుర్తు చేసిన మోహన్ భగవత్.. 800 ఏళ్లుగా సమాజంలోని ఏ వర్గాన్ని విస్మరించడం అన్యాయమని అన్నారు.
జాతీయ ఐక్యత, ప్రగతిని పెంపొందించే మాటలన్న అజ్మీర్ దర్గా గురువు
అయితే, ఇటీవల దేశాన్ని కలవరపరుస్తున్న ఆలయ వివాదాలను ప్రస్తావించకుండా మోహన్ భగవత్ ఇచ్చిన సలహాను అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ ప్రశంసించారు. మోహన్ భగవత్ చెప్పిన మాటలను ప్రజలు ఆదరిస్తే అది జాతీయ ఐక్యతను, ప్రగతిని పెంపొందిస్తుందని చెప్పారు. గతంలో కూడా మోహన్ భగవత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారనీ.. 2022లో భగవత్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకకూడదని.. చెప్పినట్లు గుర్తుచేశారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రశంసనీయమనీ.. మనమంతా వాటిని స్వీకరించాలని అన్నారు. ఇలాంటి మాటలు ఆచరిస్తే మనమంతా ఒక్కటిగా జీవించగలమని అన్నారు. ప్రపంచం ముందు భారతీయులంతా ఐక్యంగా ఉంటే, మన దేశం అభివృద్ధి చెందుతుంది” అని అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు వెల్లడించారు.
డ్యూయల్ రోల్ చేసే హార్డ్ కోర్ హిందూ వాదులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్ర చూస్తే.. నాణానికి రెండు ముఖాలు స్పష్టంగానే కనిపిస్తాయి. ఈ ముఖాల్లో ఒకటి ప్రపంచం వైపు, మరొకటి ఆరెస్సెస్‌లోని వ్యక్తుల వైపు చూపిస్తుంది. ఆరెస్సెస్ కార్యకర్తలు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేస్తూనే.. గాంధీని హత్య చేసి, ఉరికి శిక్షకు గురైన వ్యక్తిని సంఘ్ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే.. ఆరెస్సెస్ అధికారులు, లాల్ కృష్ణ అద్వానీ, ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారతదేశం దాటి బయటకు వెళితే.. తమ సైద్ధాంతిక గురువులుగా భావించే గోల్వాల్కర్‌ను, సావర్కర్‌ను అత్యంత గౌరవనీయమైన వ్యక్తులుగా ప్రకటించడానికి ధైర్యం చేయలేరు.
ఇలా డ్యూయల్ రోల్ చేసే హార్డ్ కోర్ హిందూ వాదులు.. మసీదులను దేవాలయాలుగా మారుస్తామన్న ప్రచారాన్ని ఆపాలని మోహన్ భగవత్ చెప్పినప్పుడు హిందూ గురువులు తప్ప మిగిలిన వాళ్లు కొందరు స్వాగతించారు, ఇంకొందరు మౌనంగా ఉన్నారు. అయితే భగవత్ మాటలను ఆరెస్సెస్ నెట్‌వర్క్ అనుసరించాలని ఆరెస్సెస్ మద్దతుదారులు ఎవరూ కోరుకోరన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
ప్రతి ఒక్కరికి వారి సొంత మార్గంలో పూజించే హక్కు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మత ఘర్షణలు రేపడం వల్ల హిందువులకు నాయకుడవుతానని ఎవరైనా విశ్వసిస్తే తప్పేనని భగవత్ పేర్కొన్నారు. భారతీయులు చాలా కాలంగా సామరస్యంగా జీవిస్తున్నారని, ప్రతి ఒక్కరికి వారి సొంత మార్గంలో పూజించే హక్కు ఉందని కూడా వెల్లడించారు. దేశంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే చర్యలు మంచిది కాదని సూచించారు. ఈ క్రమంలో.. ఆరెస్సెస్‌ను విమర్శించే వారు, వ్యతిరేకించే వారందరూ భగవత్ ప్రకటనను స్వాగతించారు. కనీసం, ఈసారి అయినా ఆయన సరైన మాటే చెప్పారని ప్రశంసించారు.
‘సనాతన ధర్మం’ భారతదేశ జాతీయ మతం -సీఎం యోగి
అయితే, ఆయన సూచనలను సొంత వారే వ్యతిరేకించారు. భగవత్ మాటలను ఆరెస్సెస్‌ను అనుసరించే రాజకీయ శాఖలు, బిజెపి, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లోని ఎవ్వరూ స్వాగతించలేదు. భగవత్ సామరస్యం గురించి మాట్లాడుతున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘సనాతన ధర్మం’ భారతదేశ జాతీయ మతం అని ప్రచారం చేస్తున్నారు. బాబర్ పాలన ఇక్కడ నడవదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయాన్నీ పున:స్థాపిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
భగవత్‌ని మౌనంగా ఉండమని బహిరంగంగానే సలహా
మరోవైపు, మోహన్ భగవత్ చేస్తున్న శాంతి సందేశంపై ముస్లిం వ్యతిరేక భావజాలం ఉన్న చాలా మంది నిప్పులు చెరుగుతున్నారు. భగవత్‌ని మౌనంగా ఉండమని బహిరంగంగానే సలహా ఇస్తున్నారు. మోహన్ భగవత్ హిందువులకున్న ఒకే ఒక్క నాయకుడు, ప్రతినిధి అనే భ్రమను విడిచిపెట్టాలని సోషల్ మీడియాలో మోతమోగిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ఎందుకు అవసరం? సంభాల్‌లో హరిహర ఆలయం ఎందుకు అవసరం లేదు..? అసలు, ఏ మసీదు ఉండాలి, ఏదీ ఉండకూడదూ అని నిర్ణయించడానికి నువ్వెవరు అంటూ భగవత్‌పై మండిపడుతున్నారు.
మానవ ధర్మమే హిందూ ధర్మం, హిందూ ధర్మం ప్రపంచ ధర్మం
నిజానికి, భగవత్ ప్రకటన తర్వాత ఆరెస్సెస్ బయట పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. భగవత్ చేసిన ప్రసంగం వేదికపైన ఆయన మాటల్ని ఖండించారు. భారత సనాతన ధర్వం శాశ్వతమైనదనీ.. ఇది రాజకీయాలకు సంబంధించినది కాదనీ అన్నారు. అయితే, మోహన్ భగవత్ కూడా ఇలాంటి ధర్మన్నే చెప్పారు. కానీ, అన్ని ధర్మాల్లోకీ మానవ ధర్మం ఉన్నతమైనదనీ.. మానవ ధర్మమే హిందూ ధర్మమనీ.. హిందూ ధర్మం ప్రపంచ ధర్మమనీ వెల్లడించారు.
శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి
ఈ సందర్భంగా.. మోహన్ భగవత్ మరో విషయాన్ని కూడా వెల్లడించారు. రామకృష్టా మఠం జీసెస్ క్రైస్ట్ జన్మదినమైన క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేస్తారనీ… ఇలా చేయడం వల్లే మానవ ధర్మం మరింత వికసిస్తుందని చెప్పారు. అయితే, భగవత్ చేసిన వ్యాఖ్యలను హిందూ గురువులు ఏ మాత్రం సమర్థించట్లేదు. అంతెందుకు, అయోధ్య రామాలయం ఏర్పాటైన తర్వాత అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి, గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతదేశంలో ఆక్రమణకు గురైన, ఇతర దేవాలయాలను “విముక్తి” చేయాలనే కోరిక తమకు లేదని స్పష్టంగా చెప్పారు. పేరు పెట్టకుండానే అయోధ్య రామ మందిరం, జ్ఞాన్‌వాపి, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడారాయన.
మూడు దేవాలయాలు చాలు ఇతర దేవాలయాల వైపు చూడం
“మూడు దేవాలయాలు విడిపిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవడం లేదని అన్నారు. ఈ మూడు దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనీ… శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మరచిపోతాం” అని గోవింద్ దేవ్ గిరి మహరాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో… అయోధ్య తర్వాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చేసినట్లే కనిపించింది. ఇక, మధుర కథ కూడా కంచికి చేరితే… మరో దేవాలయం ఎలాగూ లేదని అంతా అనుకున్నారు. మూడు చాలు మరొకటి అడిగే ప్రసక్తే లేదని కూడా పెద్దలు స్పష్టం చేశారు. అయితే, ఇటీవల, సంభల్‌లో జరిగిన ఉద్రిక్తతలు, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి.
హింస లేకుండా సామరస్యం చూపించాలని భగవత్ పిలుపు
నిజానికి, భారతదేశంలో ఎప్పుడు మత ఘర్షణలు వచ్చినా.. ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మతస్తులపై దాడులు జరిగినా.. అది ఆరెస్సెస్ భావజాలం వల్లనే అంటారు. అయితే, ఆరెస్సెస్ కార్యకర్తలకు మార్గదర్శిగా ఉండే మోహన్ భగవత్ మాత్రం హింస లేకుండా సామరస్యం చూపించాలని అంటున్నారు. ఒకవైపు, హిందువులకు, హిందూయేతరులకు మధ్య తేడాను మరచిపోమని ప్రజలకు సలహా ఇస్తున్న భగవత్.. మరోవైపు, హిందులందరూ ఎవరూ భయపెట్టలేనంత బలవంతులుగా మారాలని కూడా కోరారు.
ఆరెస్సెస్ సిద్ధాంతంతోనే నడిచే బిజెపి
ఇక, ఆరెస్సెస్ సిద్ధాంతంతోనే నడిచే భారతీయ జనతా పార్టీ కూడా సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. అంబేద్కర్ విగ్రహాలకు దండ వేస్తూనే రిజర్వేషన్ల అవసరం ఏముందని బిజెపి నేతలు మాట్లాడతారు. అంబేద్కర్ పేరుకి బదులు రాముడి పేరు స్మరించాలని అమిత్ షా లాంటి అగ్ర నాయకులు ఏకంగా పార్లమెంటులోనే ప్రకటిస్తారు. ప్రతిపక్షాలు దీనిపై రాద్దాంతం చేస్తుంటే.. బిజెపి అంబేద్కర్‌ని అత్యంత గౌరవిస్తుందని అంటారు.
‘నేను హిందువు కాదు’ అని పుస్తకం రాసిన అంబేద్కర్
అసలు, “నేను హిందువునే కాదు” అని స్పష్టంగా ఒక పుస్తకమే రాసిన అంబేద్కర్‌ని బిజెపి ఎందుకు గౌరవించాలి..? సీఏఏ చట్టంలో విదేశం నుండి వచ్చిన హిందువులకే ఎందుకు ప్రత్యేక స్థానం కల్పించాలి..? అన్ని మతాలనూ గౌరవిస్తే యూసీసీ చట్టం అమలు చేయడానికి ఎందుకు అంత బలంగా ప్రయత్నించాలి..? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఒక్క బిజేపి పార్టీకే కాకుండా.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కి కూడా వస్తున్నాయి.
ఇలాంటి మాటలు కేవలం రాజకీయంగా లబ్ధి కోసమే..
ఇక, మోహన్ భగవత్ మాటల్ని వ్యతిరేకిస్తున్న వారంతా.. ఇలాంటి మాటలు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప ఇంకదేనికీ పనికిరావని అంటున్నారు. మరి, భగవత్ మాటల్లో.. బిజెపి చేష్టల్లో నిజాయితీ ఎంత ఉందనేది ఇప్పటికైతే అస్పష్టంగానే కనిపిస్తుంది. చూడటానికి, బిజెపి ఆరెస్సెస్ రూటులో నడుస్తుందనీ… ఆరెస్సెస్ బిజెపి రాజకీయ మార్గాన్ని ఎంచుకుందనీ అనిపిస్తున్నప్పటికీ… ఇవి రెండూ అవకాశాన్ని బట్టి అడుగులు వేస్తాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది.