EPAPER

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ హోమ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ సాయుధుడు కాల్పుల ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమధ్యనే దాడిని తృటిలో తప్పించుకొని ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి, ఈ సంఘటన తర్వాత, ట్రంప్ చుట్టూ మరింత భారీగా సెక్యూరిటీ నిఘా పెరిగి ఉండాలి. డేగ కన్నులతో అణువణువూ జల్లెడ పట్టాల్సి ఉంది. కానీ, ట్రంప్‌ ఉన్న కేవలం 250 మీటర్ల వ్యవధిలోనే ఓ వ్యక్తి ఏకే-47 లాంటి గన్‌ను పట్టుకురావడం నిఘా కంటికి చిక్కలేదా..? అంటే సమాధానం లేదు. ఈ ఘటనపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసి అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లు ఊపిరి పీల్చుకున్నారని తెలిపింది. “అమెరికాలో హింసకు స్థానం లేదు” అని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థురాలు కమల హారిస్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, అసలు నిఘా లోపం ఎక్కడుందనేది మాత్రం ఎవ్వరూ పేర్కొనలేదు. అటు, అధికారంలో ఉన్న జో బైడెన్ గానీ, ఇటు ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ గానీ నిఘా వ్యవస్థపై నోరుజారలేదు. పైగా, తనను కాపాడినందుకు పోలీసు అధికారుల్ని ట్రంప్ ప్రశంసించారు.

అయితే, కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న 58 ఏళ్ల నిందితుణ్ణి అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వివరాలను అధికారికంగా అధికారులు బయటపెట్టనప్పటికీ.. అతడి పేరు ర్యాన్ వెస్లీ రౌత్‌ అని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం, రౌత్ నార్త్ కరోలినాకు చెందిన వ్యక్తి. పోలీస్ అధికారులను తప్పించుకు పారిపోయిన ఘటనలు కొన్ని రౌత్ పేరున నమోదయ్యాయి. ఈ నేరాల్లో సాధారణ మాదకద్రవ్యాలను కలిగి ఉండటం, నుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, గడువు తీరిన వెహికిల్ ఇన్స్యూరెన్స్‌తో కారు నడపడం వంటి ఫిర్యాదులున్నాయి. 2002లో రౌత్, తన కంపెనీ కార్యాలయంలో తనను తాను బంధించుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు గంటల డ్రామా తర్వాత ఒక తుపాకీని పట్టుకొని, అందర్నీ దాటుకొని పారిపోయాడు. రౌత్ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, తాను 2017-2018లో హవాయికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి, నిరాశ్రయులైన వ్యక్తుల కోసం సాధారణ గృహ నిర్మాణాల ప్రాజెక్ట్‌ను చేసినట్లు తెలుస్తోంది.


2012లో నార్త్ కరోలినాలో ఓటరుగా నమోదు చేసుకున్న రౌత్… ఇటీవల, మార్చి 2024లో రాష్ట్ర డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా వ్యక్తిగతంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ క్యాంపెయిన్ ఫైనాన్స్ రికార్డుల ప్రకారం, రౌత్ 2019 నుండి మొత్తం $140 డాలర్లు పొలిటికల్ విరాళాలు ఇచ్చాడు. అది కూడా డెమోక్రటిక్ అభ్యర్థులకు మద్దతిచ్చే రాజకీయ కార్యాచరణ కమిటీ యాక్ట్‌-బ్లూకి అందించాడు. ఉక్రెయిన్‌కు బలమైన మద్దతు ఇస్తున్న వ్యక్తిగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నాడు. పలు మీడియా సంస్థలకు కూడా ఉక్రెయిన్‌కు సంబంధించి ఇంటర్వూలు ఇచ్చాడు. ఉక్రెయిన్‌కు అమెరికా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయాలనే విషయంలో సలహాలు కూడా ఇచ్చాడు. అయితే, ట్రంప్‌పై కాల్పులు జరపడానికి రౌత్ ఉద్దేశ్యం ఏమిటో మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ, అతని సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే, అతను ట్రంప్ మద్దతుదారు కాదని మాత్రం తేలింది. అలాగని, రౌత్ రిపబ్లికన్లకు వ్యతిరేకి కాదు. ట్రంప్‌కు ముంది ఆ పార్టీ నుండి అధ్యక్ష నామినీ రేసులో ఉన్న భారత సంతతి నేత వివేక్ రామస్వామికి, మరో నామినీ నిక్కీ హేలీలకు రౌత్ మద్దతుదారుగా ఉన్నాడు. 2020లో, మాజీ ప్రతినిధి తులసి గబ్బార్డ్‌కు కూడా రౌత్ మద్దతు తెలిపాడు.”తులసి… సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అల్లకల్లోల ప్రాంతాల్లో శాంతి ఒప్పందాలపై అవిశ్రాంతంగా చర్చలు జరుపుతున్న వ్యక్తి. దీని ప్రకారం, రౌత్ బాధితుల వైపు నిలబడే వ్యక్తి అని తెలుస్తుంది.

Also Read: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

ఇంత సామాజిక, రాజకీయ అవగాహన కలిగిన రౌత్.. ఎందుకు ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు..? అందులోనూ, రౌత్, 2016లో ట్రంప్‌కు ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో 2020 పోస్ట్ ప్రకారం అతనిపై విశ్వాసం కోల్పోయినట్లు ప్రకటించాడు. “2016లో ట్రంప్ నా ఎంపిక. అయితే, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా భిన్నంగా, మెరుగ్గా ఉంటారని నాతో పాటు, ప్రపంచం ఆశించాము. కాని, మేమంతా చాలా నిరాశ చెందాము. ట్రంప్ మరింత దిగజారిపోతున్నారని, భ్రష్టుపట్టిపోతున్నారని అనిపిస్తుంది” అని రౌత్ తన సోషల్ మీడియా ఖాతలో రాశారు. “ట్రంప్ వెళ్ళిపోతే నేను సంతోషిస్తాను” అని కూడా పేర్కొన్నాడు. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ హత్యాయత్నం గురించి కూడా రౌత్ ఓ పోస్ట్ చేశాడు. ట్రంప్ ర్యాలీలో గాయపడిన వారిని సందర్శించాలని బైడెన్‌కు సలహా ఇచ్చాడు. ఆ ఘటనలో హత్య చేయబడిన అగ్నిమాపక ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కావాలని కూడా చెప్పాడు. ‘ట్రంప్ వాళ్ల కోసం ఎప్పటికీ ఏమీ చేయడని కూడా రౌత్ వెల్లడించాడు. ఇక, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రౌత్ రాజకీయ అభిప్రాయాలు అతన్ని ట్రంప్‌పై దాడి చేయడానికి పురిగొల్పాయా అనే అనుమానాలు లేకపోలేదు.

అయితే, సందట్లో సడేమీయా అన్నట్లు డొనాల్డ్ ట్రంప్‌పై రెండవ సారి హత్యాయత్నం జరిగిన సందర్భంగా ప్రపంచ కుబేరుడు, ఎలన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన ఎక్స్‌లో “బైడెన్-కమలను హత్య చేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు” అని పోస్ట్ చేశాడు. నిజానికి, ట్రంప్‌పైడా దాడి తర్వాత, ఎక్స్‌లో ఓ వ్యక్తి , “వాళ్లు డోనాల్డ్ ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు?” అని రాయగా… దానికి, ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న ఎలన్ మస్క్ స్పందించాడు. అందులో, “బైడెన్/కమలను హత్య చేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు” అని కామెంట్ చేశాడు.

అయితే, ప్రస్తుతం తొలగించిన ఈ పోస్ట్‌కు సెప్టెంబర్ 16 ఉదయానికి 34.7 మిలియన్ వ్యూవ్స్, లక్షా 51 వేల లై‌క్‌లు వచ్చాయి. ఈ క్రమంలో ఎలన్ మస్క్‌పై తీవ్రమైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మస్క్ చర్య.. అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడంలో భాగమని చాలా మంది మండిపడ్డారు. ఎలోన్ మస్క్‌పై భద్రతా చర్యలు తీసుకోవాలనీ… అమెరికా పౌరసత్వం తొలగించి, అతని స్వదేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి పంపించాలని కొందరు సూచించారు. అయితే, వెంటనే రియలైజ్ అయిన మస్క్.. మరో పోస్ట్‌లో తన వ్యాఖ్యలను జోక్‌గా భావించాలని అన్నారు.

అయితే, ఈ పరిణామాలన్నీ అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో ఉన్న స్పష్టమైన వైఫల్యాలకు అద్దం పడుతున్నాయనడంలో సందేహం లేదు. అయితే, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే దానిపైన కూడా పలు విశ్లేషణలు ఉన్నాయి. ప్రెసిడెంట్‌లు, వైస్ ప్రెసిడెంట్‌లు, వారి కుటుంబాలను రక్షించే సీక్రెట్ సర్వీస్ విభాగం ఒక దశాబ్దం క్రితం కంటే దాదాపు 10% సామర్థ్యాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతకు కావాల్సినంత ఏజెంట్‌ల సంఖ్య లేదనీ.. ఇలాగే కొనసాగితే, భద్రతలో రాజీపడాల్సిన ప్రమాదం ఉందని గతంలో ప్రభుత్వ వాచ్‌డాగ్ అమెరికన్ కాంగ్రెస్ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొరత కారణంగా గత రెండు సంవత్సరాలుగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రక్షించే ఏజెంట్ల సంఖ్యను పెంచాలనే అభ్యర్థనలు తిరస్కరించబడినట్లు తెలుస్తోంది. ఇక, ట్రంప్‌పై జరిగిన మొదటి దాడి తర్వాత కూడా భద్రతా ఏజెంట్ల సంఖ్యలో మార్పులేనట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రెసిడెంట్, ఇతర సీనియర్ అధికారులను రక్షించడానికి కేటాయించిన ఉద్యోగుల హెడ్ కౌంట్ దాదాపు 350 మంది సిబ్బందికి పడిపోయిందని తాజా కాంగ్రెస్ బడ్జెట్ గణాంకాలు చూపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2014లో 4 వేల 27 మంది నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 671కి తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఆరోపణను సీక్రెట్ సర్వీస్‌ను పర్యవేక్షిస్తున్న హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ ఖండిస్తున్నారు. రక్షణ కార్యకలాపాలు నిర్వహించే ఏజెంట్ల సంఖ్య పెరిగిందని అంటున్నారు. అయితే, నానాటికీ బెదిరింపులు మరింత వైవిధ్యంగా మారిన తరుణంలో.. ప్రైవేట్ రంగం నుండి పోటీ ఎదర్కుంటున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా తక్కువ మంది స్టాఫ్‌, ప్రయివేటు రంగంతో పోల్చుకుంటే తక్కువ జీతాలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో సీక్రెట్ ఏజెన్సీ స్థితి గురించి వచ్చిన ప్రశ్నలకు ఆ సంస్థ స్పందించలేదు. పైగా, యూఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ సెక్యూరిటీ సర్వీస్‌గా ఎప్పటికీ ఉంటుందంటూ సంస్థ అధికారులు చెప్పారు. అయితే, ప్రభుత్వ ఫైలింగ్‌ల ప్రకారం, గత దశాబ్దంలో సీక్రెట్ సర్వీస్ బడ్జెట్ దాదాపు రెట్టింపు అయ్యింది. 2014 ఆర్థిక సంవత్సరంలో సుమారు $1.8 బిలియన్ల నుండి ఇప్పుడు $3 బిలియన్లకు పెరిగింది. అదే సమయంలో, ఏజెన్సీలో సిబ్బంది 8 వేల 100 మంది సిబ్బందితో దాదాపు 25% పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీ వెబ్‌సైట్ ప్రకారం, వీరిలో దాదాపు 3 వేల 200 మంది ప్రత్యేక ఏజెంట్లు, 1300 మంది యూనిఫాం ధరించిన అధికారులుగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఏది ఏమైనప్పటికీ, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన అమెరికా సీక్రెస్ సర్వీస్ ఏజెన్సీ పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారైందని అనడంలో సందేహం లేదు. ఒకవైపు, పెరుగుతున్న టెక్నాలజీతో నేరాలు ఎంతగా ఎక్కువవుతున్నాయో.. రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా నేరాలను అరికట్టడంలో మెరుగవుతూ ఉండాలి. కానీ, అందులో లోపం ఉందని ఇటీవల సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై, త్వరలో రాబోయే ప్రభుత్వమైనా తగు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. దాని కంటే ముందు, ఎన్నికలు పూర్తయ్యే వరకూ ట్రంప్‌‌పై మరో దాడి జరగకుండా.. ఎలన్ మస్క్ మాటలతో ప్రభావితమయ్యి, ఎవ్వరూ బైడెన్, కమల హారిస్‌లపై దాడులకు దిగకుండా కాపాడాల్సిన బాధ్యత యూఎస్ సీక్రెట్ సర్వీస్‌పై ఉంది. కాబట్టి, ఇకనైనా యూఎస్ నిఘా కన్ను గురి తప్పకుండా షార్ప్‌గా పనిచేస్తుందని ఆశించాలి.

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×