BigTV English

Donkey Milk Scam: అడ్డంగా దోచేసిన అడ్డగాడిద.. అసలు ఆ కేటుగాళ్ల వలలో ఎలా పడ్డారు?

Donkey Milk Scam: అడ్డంగా దోచేసిన అడ్డగాడిద.. అసలు ఆ కేటుగాళ్ల వలలో ఎలా పడ్డారు?

కడివెడైన నేమి ఖరము పాలు.. అనేది ఎప్పుడో వేమన కాలం నాటి పాత మాట. గంగిగోవు పాలను మించిన డిమాండ్‌ ఇప్పుడు గాడిద పాలకు ఉంది. పల్లె నుంచి పట్టణాల వరకు వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం తరచూ కనిపించే దృశ్యమే. ఐదారు స్పూన్ల గాడిద పాలకు..మూడు వందల వరకూ వసూలు చేస్తుంటారు. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గుకు గాడిదపాలు ఔషధంగా పనిచేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందుకే వీటికి అంత రేటన్నమాట. చాలా మంది ఈ బిజినెస్ ఏదో బాగుందే చేసుకుంటే పోలే.. అని అనుకుంటారు.. సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేసి బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు.


సీన్‌ చూశారుగా.. వీళ్లంతా గాడిద పాలతో లక్షలు సంపాదించుకోవాలని.. చివరికి బాధితులుగా మిగిలారు. తమిళనాడులోని తిరునన్‌వేలికి చెందిన ఓ కేటుగాడు. సినిమాలో ఈము పక్షుల పేరుతో కోట్లు కొట్టేస్తే..ఇక్కడ మాత్రం గాడిదల ఫామ్‌ ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని కొంతమందిని నమ్మించాడు. ఈ వ్యాపారం గురించి యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ప్రచారం చేశాడు. మొదట్లో 10, 25 లీటర్ల పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ.1600 నుంచి రూ.1800 చెల్లిస్తామని ప్రకటించాడు.

భారీగా ఆర్డర్లు వస్తున్నాయని.. కానీ డిమాండ్‌ తగ్గ సరఫరా చేయలేకపోతున్నానని, ఎవరైనా తనకు గాడిద పాలు సప్లై చేస్తే తీసుకుంటానని.. నెలకు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని ఊదరగొట్టాడు. అంతేకాదు.. తన దగ్గర మేలుజాతి గాడిదలు ఉన్నాయని, వాటి పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని బుట్టలో వేసుకున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలామంది నిజమని నమ్మి.. లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు.


ఈ రేంజ్ లో ఆశ చూపిస్తే ఎవరైనా పడాల్సిందే.. ఇంకేముంది ఈ రేంజ్ లో బిజినెస్ అంటే ఏంచకా లైఫ్ సెట్ అనుకున్నారు అంతా. ముందు, వెనక ఆలోచించకుండా.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన రైతులు లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు. ఒక్కో గాడిదకు రూ.90 వేల నుంచి లక్షన్నర వరకూ వసూలు చేశాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా రూ.75 వేల నుంచి లక్షన్నర కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు.

లక్షలు పోసి కొన్న గాడిదలను దట్టంగా మేపిన యజమానులు..తమ నుంచి గాడిద పాలను కొనమని ది డాంకీ ప్యాలెస్ సంస్థను కోరటం మొదలు పెట్టారు. అయితే ఇదిగో అదిగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయటం మొదలు పెట్టాడు తప్ప..ఏ ఒక్కరి నుంచి గ్లాస్‌ పాలు కూడా కొనలేదు. దీంతో ఎక్కడో తేడా కొట్టిందని అనుమానించిన ఓవ్యక్తి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది.

సుమారు 200 మంది రైతుల నుంచి ఏకంగా 9 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. అంతేకాదు.. పాలు సేకరించిన కొంతమందికి.. మొదట్లో చెక్కులు కూడా ఇచ్చింది సంస్థ. ఆ చెక్కులు బ్యాంక్ కు తీసుకెళ్తే బౌన్స్ అయ్యాయి. ఇంకేముంది రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు.. గాడిద పాల వ్యాపారం సంగతి అటుంచితే..లక్షల పోసి కొన్న గాడిదలను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు.

డాంకీ ప్యాలెస్ సంస్థ ఫ్రాంచైజీలో సభ్వత్వం పేరుతో మరో రూ.5 లక్షలు, గాడిదల వైద్యం నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్‌‌ను చూపించి, ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో రూ.50 వేలు నొక్కేశాడు. ప్రతి సభ్యుడి నుంచి రూ.25 లక్షలు నుంచి కోటిన్నర, నిరంతరం నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశాడని బాధితులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు.

Also Read: ఆ గ్రామానికి ఏమైంది? నెలన్నర వ్యవధిలో 20 మరణాలు? కారణం అదేనంటున్న గ్రామస్థులు..

గాడిద పాలకున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కోట్లు కొట్టేసిన కేటుగాడు రాత్రికే రాత్రే జంప్‌ అయితే.. బాధితులు మాత్రం పోయాం మోసం అంటూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరి పరారైన ఆ అడ్డగాడిద పట్టుబడతాడో లేదో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×