Bellampalle Shadow MLAs: ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతోందంటూ చర్చ సాగుతోందట. మండలానికో నేత బయలుదేరి.. తాము చెప్పిందే జరగాలంటున్నారట. ఠాణాల్లో కేసులైనా.. మున్సిపాలిటీ మురికికాల్వలైనా కదలాలంటే.. తమ మాటే శాసనం అంటూ హుకుం జారీ చేస్తున్నారట. నేను గెలిస్తే.. మీతోనే ఉంటానంటూ ఇచ్చిన మాటేమైందంటూ స్థానికులు సదరు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత.. ఏమా కథ.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల ఆధిపత్యం సాగుతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విషయం కాస్తా.. ముదిరిపాకాన పడి.. ఎమ్మెల్యే గెడ్డం వినోద్‌కు సవాల్‌గా మారిందట. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. ఇక్కడే ఇల్లు కట్టుకుని.. మీతోనే ఉంటానని చెప్పిన నేత. తమకు అందుబాటులో ఉండటం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏదైనా ప్రభుత్వం పథకాల పంపిణీ లేదా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నప్పుడు మాత్రమే.. సార్ వచ్చి పోతున్నారని.. నియోజకవర్గంలో జనాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. తమ గోడు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి వస్తున్నా.. ఆయన లేక నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో మండలాల్లోని కొందరు.. తామే షాడో ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతున్నారట. సమస్యలు పరిష్కారం కావాలంటే తమకే చెప్పాలంటూ హుకుం జారీ చేస్తున్నారట. నెన్నెల్ మండలమైనా.. కాశీపేట, తాండూర్, బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నేపల్లిలో.. షాడోల అధిపత్యం తీవ్రంగా పెరిగిందనే టాక్ నడుస్తోంది. తామే ఎమ్మెల్యేలం అన్నట్లుగా పెత్తనం చెలాయిస్తున్నారట. పోలీస్‌స్టేషన్‌లో కేసులైనా.. తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డులైనా.. మండల అపీసులో పనులైనా.. అంతా తమ కనుసన్నల్లో జరగాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారట. ఒకవేళ చెప్పిన పనులు చేయకపోయినా.. వారికి వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Also Read: పాలనలో కొత్త లక్ష్యాల దిశగా.. సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
బెల్లంపల్లి మున్సిపాలిటీలో షాడో ఎమ్మెల్యేల దందాకు అడ్డులేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. కొందరైతే సర్కారు భూములపైనా కన్నేశారంటూ స్థానికులే చర్చించుకుంటున్నారట. ఇలా దందాలతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటూ ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయట. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారే.. ఇలాంటి పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటితోపాటు స్థానికంగానూ పెత్తనాలు చెలాయించటంతో జనాలు విసిగిపోతున్నారనే వాదన ఉంది.
కాబట్టి.. ఎమ్మెల్యే సార్.. ఇప్పటికైనా ఆయా అంశాలపై దృష్టి సారించకపోతే.. జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆయన రంగంలోకి దిగి.. షాడో ఎమ్మెల్యేలను అడ్డుకోకపోతే.. భవిష్యత్‌లో మరింత చెడ్డపేరు వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ ఉంది.