Graduate MLC: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో టికెట్ల కోసం పోటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థానానికి దాదాపు డజన్ మందికి పైగా ఆశావహుల పేర్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున రాంచందర్‌రావు ప్రాతినిధ్యం వహించారు. దీంతో బీజేపీకి, తనకు అక్కడ సానుకూలత ఉందని, బ్రాహ్మణులతో పాటు ఇతర సామాజికవర్గాల మద్దతు కూడా తనకు లభిస్తుందన్న అంచనాలతో ఎన్వీ సుభాష్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి పీవీ నరసింహారావు కుమార్తె, ఎన్వీ సుభాష్ చిన్నమ్మ వాణీదేవి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. బ్రాహ్మణ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల మద్దతు కూడా తనకు లభిస్తుందని, ఈ నేపథ్యంలో తనకు అవకాశం లభిస్తే పార్టీకి ఈ స్థానాన్ని దక్కించేందుకు కృషి చేస్తానని సుభాష్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుభాష్ కు పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో అత్యంత సన్నిహితంగా పని చేసిన అనుభవం ఉంది. సుభాష్ అమెరికా నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. పార్టీలో తనకున్న సంస్థాగత అనుభవం, విద్యా అర్హతల ప్రాతిపదికన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన భావిస్తున్నారు.
ఇదిలాఉండగా పాలమూరు ప్రాంతానికి చెందిన డోకూర్ పవన్‌కుమార్ రెడ్డి కూడా ఈ స్థానంపై గట్టిగానే దృష్టి సారించారు. ఆయన అభ్యర్థిత్వానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మద్దతుగా నిలిచినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టికెట్ అంశాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పాలమూరు జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని డోకూరు గ్రామానికి చెందిన నేత. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే ప్రజాసేవపై ఆసక్తి పెంపొందించుకున్నట్లు చెబుతున్నారు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్‌లోనే సాగింది. బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.
వ్యాపార రీత్యా సుమారు పదేళ్లు విదేశాల్లో నివసించినప్పటికీ, తన స్వస్థలం, దేవరకద్ర నియోజకవర్గ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాగా డోకూర్ పవన్ కుమార్ రెడ్డి 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఆపై 2019లో డీకే అరుణతో పిలుపుమేరకు బీజేపీలో చేరారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కన్వీనర్‌గా, బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మునుగోడు ఉపఎన్నిక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వంటి పలు కీలక ఎన్నికల్లో ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన టికెట్ ను ఆశిస్తున్నట్లు సమాచారం. స్థానికత తనకు ప్లస్ అవుతుందని ఆయన ధీమాతో ఉన్నారు.
Also Read: దానం నాగేందర్‌కు ఉహించని షాక్.. రివేంజ్ తీర్చుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, డోకూర్ పవన్‌కుమార్ రెడ్డితో పాటు సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, అమర్‌నాథ్ సారంగుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కాసం వెంకటేశ్వర్లు, గంగాపురం వెంకట్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, ఓఎస్ రెడ్డి, మల్లారెడ్డి తదితర నేతలు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై రాష్ట్ర నాయకత్వం విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత బలగం, పట్టభద్రుల్లో ఉన్న పరిచయాలు, గత ఎన్నికల్లో వారి పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి బీజేపీ ఆశావహుల జాబితాతో పోలిస్తే.. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ ఆశావహుల జాబితా పూర్తిభిన్నంగా ఉంది. ఈ స్థానం నుంచి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాన్ని ఆశిస్తున్న ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పోరెడ్డి కిశోర్ రెడ్డి, డాక్టర్ వీ పుల్లారావ్ యాదవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తమ తొలి ప్రియారిటీ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కే ఇస్తున్నట్లు చెబుతున్నారు. అనివార్య కారణాల వల్ల లేదా సామాజిక, రాజకీయ కారణాల వల్ల అక్కడి నుంచి అవకాశం ఇవ్వకుంటే ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకైనా సిద్ధమనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కాశ్ రెడ్డి, కాసం, కిశోర్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు చేపడుతుండగా.. ఓయూ విద్యార్థి నేత అయిన పుల్లారావు యాదవ్ సైతం తన అభ్యర్థిత్వంపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమం, ఓయూ విద్యార్థి రాజకీయాల్లో తనకు ఉన్న పరిచయాలు కలిసొస్తాయని పుల్లారావు యాదవ్ ఆశిస్తున్నట్లు సమాచారం.
మ్మం ప్రాంతంలోని యాదవ, ముదిరాజ్ సామాజికవర్గాల మద్దతు కూడా తనకు లభిస్తుందన్న అంచనాతో ఆయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈవెంట్స్ ప్రభారీగా ఐదు పాదయాత్రలు పూర్తి చేసిన అనుభవం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ స్థానానికి జనసేన ఇప్పటికే డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జనసేన ఎన్డీయే భాగస్వామిగా ఉంది. దీంతో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాషాయ పార్టీ బరిలోకి ఎవరిని దింపుతోందోననేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వచ్చే ఏడాది ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ రాష్ర్ట నాయకత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఎమ్మెల్సీ టికెట్‌ను దక్కించుకునేందుకు రాష్ర్ట బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. ఎవరికీ వారు రాష్ర్ట, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ మంగళవారం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనుంది.
Also Read: ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి